టార్గెట్‌ శ్రీగంధం

ABN , First Publish Date - 2021-01-21T04:59:53+05:30 IST

స్మగ్లర్ల చూపు ఎర్రచందనం నుంచి శ్రీగంధం వైపు మళ్లింది. ఏపుగా పెరిగిన శ్రీగంధం చెట్లను చీకటివేళ నరికివేస్తూ అపహరిస్తున్నారు.

టార్గెట్‌ శ్రీగంధం
స్మగ్లర్లు నరికివేసిన శ్రీగంధం చెట్టు(ఫైల్‌)

రూటు మార్చిన స్మగ్లర్లు

మొన్నటి వరకు ఎర్రచందనం

ఇప్పుడు చీకటిమాటున  శ్రీగంధం చెట్లు నరికి తరలింపు

ఆందోళన చెందుతున్న పెదవేగి మండల రైతాంగం

పెదవేగి, జనవరి 20 : స్మగ్లర్ల చూపు ఎర్రచందనం నుంచి శ్రీగంధం వైపు మళ్లింది. ఏపుగా పెరిగిన శ్రీగంధం చెట్లను చీకటివేళ నరికివేస్తూ అపహరిస్తున్నారు. 20 ఏళ్ల పాటు పెంచుకున్న చెట్లను స్మగ్లర్లు నరుక్కుపోతూ ఉంటే రైతులు లబోదిబో మంటున్నారు. శ్రీగంధం చెట్లకు మంచి గిరాకీ ఉంది. పూర్తిగా తయారైన శ్రీగంధం టన్ను ధర దాదాపు కోటి రూపాయల దాకా ఉన్నది. దీనిని ఆసరాగా చేసుకుని స్లగ్లర్లు శ్రీగంధం చెట్లవైపు తమ దృష్టిని సారించారు. శ్రీగంధం చెట్టు పూర్తిగా తయారవడానికి 20 నుంచి 25 ఏళ్లు పడుతుంది. ఒక్కో చెట్టు అరటన్ను వరకు బరువు తూగుతుంది. శ్రీగంధం చెట్లను రైతులు తమ పండ్ల తోటల్లో అంతరంగా పెంచుతున్నారు. ఇప్పటివరకు శ్రీగంధం చెట్లు ఉన్నట్లే ఎవరికీ తెలియదని మరో రెండు, మూడేళ్లు గడిస్తే ఫలం చేతికొస్తుందని ఇప్పుడు స్మగ్లర్లు రాకతో వాటిని సంరక్షించుకోవడం ఇబ్బందిగా మారిందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


పెదవేగి మండలంలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లను రైతులు తమ కొబ్బరి, పామాయిల్‌ వంటి పండ్ల తోటల్లో అంతరంగా సాగు చేస్తున్నారు. కొంతకాలం కిందటి వరకు ఎర్రచందనం చెట్లను నరికి తరలించుకుపోయేవారు. ఇప్పుడు శ్రీగంధం చెట్లపై పడ్డారు. చలికాలం..అర్ధరాత్రి సమయం.. రైతులంతా ఇళ్లల్లో నిద్రించే సమయంలో గుట్టు చప్పుడు కాకుండా రంపాలతో చెట్లను కోసి, చివరి భాగాలను వేరుచేసి దుంగలను పట్టుకుపోతున్నారు. మూడు రోజుల క్రితం విజయరాయికి చెందిన రావిపాటి పిచ్చియ్య అనే రైతు తోటలో పదిచెట్లను నరికి రాత్రికి రాత్రే అపహరించుకుపోయారు. మరో ఏడు చెట్లను కొంతమేర కోసి పూర్తిగా తయారు కాలేదని తెలుసుకుని అంతటితో ఆపేశారు. తెల్లవారిన తరువాత తోటకు రక్షణగా వేసిన ఇనుప కంచె తెగి ఉండడాన్ని గమనించిన సరిహద్దు రైతు పిచ్చియ్యతో చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. అదేరోజు రాత్రి విజయరాయి సమీపంలో, కృష్ణా జిల్లా ముసునూరు మండలం యల్లాపురంలో జలగం శేషగిరి అనేరైతు తోటలో 17 చెట్లు నరికి తరలించుకుపోయారు. ఆదివారం రాత్రి విజయరాయిలో అడబాల సుబ్బారావు, పరసా నాగభూషణంలకు చెందిన తోటల్లో  రాత్రికి రాత్రే చెట్లను నరికి అపహరించుకుపోయారు. ఈ సంఘటనలపై రైతులు పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైతులు రాత్రిసమయంలో తమ పొలాల్లో కాపలా కాస్తూ అవస్థలు పడుతున్నారు. నిత్యం ఇలా కాపలా కాయాలంటే ఎలా సాధ్యపడుతుందని రైతులు వాపోతున్నారు. 20 ఏళ్ళపాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చిన చెట్లను ఒక్కరాత్రిలో నరికి అపహరించుకుపోవడంతో లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతు రావిపాటి పిచ్చియ్య విచారంగా చెప్పారు.

చెట్ల దొంగలను పట్టుకుంటాం : సుధీర్‌, పెదవేగి ఎస్‌ఐ 

శ్రీగంధం చెట్ల అపహరణపై రైతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం.త్వరలోనే చెట్ల దొంగలను పట్టుకుంటాం. ఆగ్రామాల్లో రాత్రిపూట గస్తీ పెంచుతాం. ప్రజలు కూడా సహకరించాలి.

Updated Date - 2021-01-21T04:59:53+05:30 IST