ఆర్టీసీ బస్టాండ్స్‌లో మెరుగైన సేవలందిస్తాం
ABN , First Publish Date - 2021-12-10T05:17:13+05:30 IST
ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లలో మెరుగైన సేవలు అందజేస్తామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

పెదపాడు, డిసెంబరు 9: ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లలో మెరుగైన సేవలు అందజేస్తామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రాంత బస్టాండ్‌లను పరిశీలించి మెరుగైన సేవలందిస్తామని తెలిపారు. పెదపాడు బస్టాండ్‌ను గురువారం ఆయన పరిశీలించారు. బస్టాండ్ విస్తీర్ణం, బస్టాండ్ ప్రదేశంలో దుకాణాలు, ఇతర సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. బస్టాండ్‌లో నిరుపయోగంగా వున్న మరుగుదొడ్లను పరిశీలించారు. స్థానికంగా సమస్యలను బస్టాండ్‌లో దుకాణాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే లక్ష్యంగా సేవలను కొనసాగిస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లో బస్టాండ్‌ల స్థితిగతులు పరిశీలించి సేవలను మరింత విస్తృతంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సునీత, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.