ఇదీ భీమవరం రోడ్డు సంగతి!

ABN , First Publish Date - 2021-08-26T05:07:52+05:30 IST

ఎమ్మెల్యే చెబితే అధికారులు వింటారా.. విని ఉంటే ఈ రోడ్డు ఇలా ఉండేది కాదు..

ఇదీ భీమవరం రోడ్డు సంగతి!
ఎమ్మెల్యే చెప్పినా ఇంతే : అధ్వానంగా ఉన్న భీమవరం ఆర్‌టీసీ డిపో నుంచి నర్సయ్య అగ్రహారం రోడ్డు

ఎమ్మెల్యే ఆదేశాలిచ్చినా ఇంతే 

అధ్వానంగా  భీమవరం – నర్సయ్య అగ్రహారం రోడ్డు 

 పట్టణంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు


 భీమవరం అర్బన్‌, ఆగస్టు 25 : ఎమ్మెల్యే చెబితే అధికారులు వింటారా.. విని ఉంటే ఈ రోడ్డు ఇలా ఉండేది కాదు.. ఎందుకంటే చాలా కాలం కిందటే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పట్టణంలో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారి మరమ్మతులు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మాట అయితే విన్నారు కానీ.. ఎందుకో మరి నేటి వరకూ పట్టించుకోలేదు.. కనీసం మరమ్మతులు చేయలేదు.. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఈ రోడ్డు ఎక్కడిదంటారా..  భీమవరం ఆర్‌టీసీ డిపో నుంచి నర్సయ్య అగ్రహారం వరకు ఉన్న సుమారు అర కిలో మీటరు దూరం ఉన్న రహదారి గత కొంత కాలంగా అధ్వానంగా తయారైంది. దీంతో ద్విచక్రవాహనదారులు, భారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద గోతులుగా ఉండడంతో బురద మయంగా మారి పలువురు వాహనదారులు ప్రమాదాల బారి పడుతున్నారు. బైపాస్‌ నుంచి వచ్చే భారీ వాహనాలన్నీ ఈ రహదారి నుంచే ప్రయాణించి ఇటు పాలకొల్లు రోడ్డులో కలుస్తాయి. పాలకొల్లు నుంచి వచ్చే భారీ వాహనాలను కూడా ఆర్‌టీసీ డిపో దగ్గర నుంచి మళ్లించి బైపాస్‌రోడ్డుకి వెళుతూ ఉంటాయి. ఇలా చేయడం కారణంగా పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండేది. అటువంటి ఈ రహదారిని కొన్ని నెలలుగా అధికారులు సరిగా  పట్టించుకోకపోవడంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వెంటనే రహదారికి మరమ్మతులు చేయించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే నేటి వరకూ ఎటువంటి కదలికలేదు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేసి పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-26T05:07:52+05:30 IST