పదేళ్ల చిన్నారులపై అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2021-12-31T05:54:33+05:30 IST
పదేళ్ల వయసు కలిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

పెంటపాడులో ఘటన..
పోలీసుల అదుపులో నిందితుడు
పెంటపాడు, డిసెంబరు 30: పదేళ్ల వయసు కలిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పెంటపాడులో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుల అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం మేరకు.. పెంటపాడుకు చెందిన ఓ వృద్ధురాలికి ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు. పెద్ద కుమార్తెకు కొడుకు(10), కూతురు వున్నారు. కొన్నేళ్ల క్రితం భర్త వదిలేయ డంతో ఆమె కొంత కాలానికి చనిపోయింది. అప్పటి నుంచి పిల్లలు ఇద్దరూ అమ్మ మ్మ ఇంటి వద్దే ఉంటున్నారు. చిన్నకుమార్తె భర్త మరణించడంతో కుమార్తె(10)తో సహా ఆమె తల్లి వద్దే ఉంటుంది. భర్త లేని చిన్న కుమార్తె ఏడాది క్రితం పరిచయమైన తాళ్లముదునూరుపాడుకు చెందిన కె.పవన్‌కుమార్‌తో సహజీవనం చేస్తోంది. ఈమె వృత్తి రీత్యా ఐదు నెలల క్రితం వేరే ఊరు వెళ్లింది. అప్పటి నుంచి మనుమరాళ్లు ఇద్దరిని అమ్మమ్మే చూస్తోంది. వీరి సంరక్షణ పేరుతో పవన్‌కుమార్ చిన్నారుల వద్దకు వస్తూ వికృత చేష్టలకు పాల్పడేవాడు. ఇటీవల ఇద్దరిలో ఒక చిన్నారి మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉందని చెప్పడంతో అమ్మమ్మ వారిని పరీక్షించగా అత్యాచారయత్నం జరిగినట్లు గుర్తించారు. దీంతో ఆమె పెంటపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గురువారం ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ బాధితుల ఇంటికి వచ్చి దర్యాప్తు చేశారు. ఇద్దరు చిన్నారులపైనా నిందితుడు కొంతకాలంగా అత్యాచారయత్నానికి పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులు
భీమవరం క్రైం, డిసెంబరు 30 : భీమవరం టూ టౌన్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై అక్కడ పనిచేసే ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం 100కు కాల్ రావడంతో టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. టూటౌన్ సీఐ కృష్ణకుమార్‌ను వివరణ కోరగా బాధితురాలి తరపు వారు ఎవరూ ఫిర్యాదు ఇవ్వడానికి రాలేదని, ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.