ముంచిన వర్షం

ABN , First Publish Date - 2021-08-22T04:43:57+05:30 IST

భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ముంచిన వర్షం
నిడదవోలులో వర్షానికి నీట మునిగిన ఆర్టీసీ డిపో

గణపవరం, ఆగస్టు 21: భారీ వర్షాలకు గణపవరం మండలంలోని గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గణపవరంలోని దండు మారెమ్మ ఆలయం వద్ద నాలుగు రోడ్ల కూడలి నీటిలో మునిగింది. పిప్పరలోని నెంబర్‌వన్‌ బాలికల పాఠశాల కూడా నీటితో నిండింది. పిప్పర, మొయ్యేరు గ్రామాల్లో కాలనీలు వర్షపునీటితో నిండాయి. వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండ వైద్య, ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో ముందుస్తు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వర్షాల వల్ల చెరువులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, క్లోరినేషన్‌ చేసిన నీటిని సరఫరా చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వర్షపునీరు రోడ్లపై నిల్వ ఉండకుండా డ్రెయినేజీలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

నిడదవోలు: నిడదవోలు పట్టణ మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రెయిన్లు సైతం పొంగి పొర్లాయి. పట్టణంలోని ఆర్టీసీ డిపో భారీ వర్షానికి నీట మునగగా బస్సులు దిగి ఎక్కే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు రాకపోకలు సాగించే శెట్టిపేట గ్రామంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి భారీ వర్షానికి నీట మునగడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
Updated Date - 2021-08-22T04:43:57+05:30 IST