డబ్లింగ్ లైన్ మార్చికి పూర్తి
ABN , First Publish Date - 2021-09-03T05:30:00+05:30 IST
వచ్చే ఏడాది మార్చి నాటికి నరసాపురం – విజయవాడ రైల్వే డబ్లింగ్ లైన్ పనులను పూర్తి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య చెప్పారు.

చురుగ్గా నరసాపురం–విజయవాడ మధ్య పనులు : జీఎం గజానన్ మాల్య
నరసాపురం, సెప్టెంబరు 3 : వచ్చే ఏడాది మార్చి నాటికి నరసాపురం – విజయవాడ రైల్వే డబ్లింగ్ లైన్ పనులను పూర్తి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య చెప్పారు. శుక్రవారం ఆయన నిడదవోలు, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం రైల్వే స్టేషన్లను సందర్శించారు. నరసాపురంలో రూ.10 కోట్లతో నిర్మించిన కొత్త ఫిట్‌లైన్ పనులను ప్రారంభించి, విలేకర్లతో మాట్లాడారు. నరసాపురం–కోటిపల్లి రైల్వే లైన్ పనులు పూర్తి చేసేందుకు మరో రెండేళ్లు పట్టవచ్చు నన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావడం లేదని చెప్పారు. నిడదవోలు–తణుకు, పాలకొల్లు–నరసాపురం స్టేషన్లలో అదనపు ప్లాట్ పారాలు, ప్లై ఓవర్ వంతెనలతోపాటు ఆయా స్టేషన్లలో కొత్త కార్యాలయ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. నరసాపురం నుంచి వారణాసి, బెంగళూరు రైళ్లు ప్రతిపాదనలో ఉన్నాయన్నారు. కొవిడ్ నియంత్రణకు రైల్వే పటిష్ఠ చర్యలు తీసుకుంటుందన్నారు. మాస్క్ లేనిదే.. స్టేషన్‌లోకి అనుమతించడం లేదన్నారు. ప్రతి బోగీని శానిటైజర్ చేస్తున్నామన్నారు. స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని తగ్గిస్తున్నామన్నారు. డీఆర్‌ఎం శివేంద్ర మోహన్, రైల్వే ఆధికారులు రవీంద్రనాధ్ రెడ్డి, శ్రీనివాస్, ఎస్‌ఎం మధుబాబు తదితరులు ఉన్నారు.