ఇంటి పోరు

ABN , First Publish Date - 2021-06-23T05:19:45+05:30 IST

ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు కలిపి రూ.1.80 లక్షలు వివిధ దశల్లో ఇస్తానని తెలిపింది.

ఇంటి పోరు


మీ ఇల్లు మీరే నిర్మించుకోవాలంటున్న ప్రభుత్వం

మా వల్ల కాదు.. మీరే కట్టాలంటున్న నిరుపేదలు

ఇచ్చే రూ.1.80 లక్షలు స్లాబ్‌ వరకూ రాదనే భావన

పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలతో ఇది సాధ్యమేనా ? 

మరో రెండు లక్షలుంటే తప్ప పూర్తవదని అంచనా

లబ్ధిదారుల వెనకడుగు.. కట్టుకోవాల్సిందేని అధికారుల ఒత్తిడి 


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అందరికీ ఇళ్లు పథకం ఆదిలోనే అష్టకష్టాల పాలవుతోంది. జిల్లాలో 1,70,699, మందికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 1,39,353 మంది లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వచ్చారు. ఇప్పటికే 37,954 ప్రారంభమయ్యాయి. లబ్ధిదారుల్లో ఎక్కువగా నిరుపేదలే ఉండడంతో ఈ నిర్మాణం తలకుమించిన భారంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఇది తమ వల్ల కాదు.. ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. 


ఏలూరు/ఏలూరు రూరల్‌/పాలకోడేరు/ ఆకివీడు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి):ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు కలిపి రూ.1.80 లక్షలు వివిధ దశల్లో ఇస్తానని తెలిపింది. అయితే ప్రస్తుత ధరలు చూస్తే ఇంటికి అవసరమైన ఇనుము, సిమెంట్‌, రవాణా చార్జీలు, కూలీల ఖర్చులు ఏ మాత్రం అందుబాటులో లేవు. ఈ భారం మోయలేని వారు నిర్మాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. దీనికితోడు చాలా లే అవుట్లు మెరక చేయకపోవడం, ఇతర మౌలిక సదుపాయా లు కల్పించకపోవడంతో ఆ భారమూ లబ్ధిదారులే మోయా ల్సి వస్తోంది. ఇల్లు కట్టుకోవడమే కష్టమనుకుంటున్న సమయంలో ఈ అదనపు భారాలను తట్టుకోలేకపోతున్నా రు. ఇల్లు కట్టాలంటే కనీసం నాలుగు లక్షలైనా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలతో నిర్మాణం సాధ్యమా? ఇల్లు పూర్తవ్వాలంటే అప్పు చేయాలి. అందుకే ‘‘మేము కట్టు కోలేం.. మీరే కట్టించి ఇవ్వాలంటూ’’ ఎక్కువ మంది లబ్ధిదా రులు తేల్చి చెబుతున్నారు. మట్టి పని మొదలుకుని ఎలక్ర్టీషి యన్‌ వరకూ ఏ పనిని పట్టుకున్నా రూ.వేలల్లో ఖర్చు. పైగా దూరప్రదేశానికి సామగ్రి తరలించాలన్నా అక్కడకు వచ్చి మేస్త్రీలు, కూలీలు పని చేయాలన్న రవాణా ఛార్జీల రూపం లో అదనపు భారం. ఇవన్నీ లెక్కేస్తే సొంతంగా ఇళ్ళు నిర్మించుకోలేమని తెగేసి చెబుతున్నారు. కొద్ది రోజుల నుంచి లబ్ధిదారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో ఎక్కువ సంఖ్యలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం స్వయంగా ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని కాస్త భారమైనా మీరే కట్టుకోవాలంటూ వైసీపీ నాయకులు,  ప్రజా ప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఏలూరు నియోజక వర్గంలో ఏడు పంచాయతీల పరిధిలో చొదిమెళ్ల పంచాయ తీలో 127 ఎకరాల 44 సెంట్లు కేటాయించగా, 7,017 మం దికి ఇంటి స్థలాల పట్టాలు అందించారు. కొమడవోలులో 183 ఎకరాల 64 సెంట్లకు 9,984 మందికి ఇవ్వగా, పోణం గిలో 128.06 సెంట్లలో 7,035 మందికి స్థలాలు కేటాయిం చారు. వీరిలో 1,847 మంది తమకు స్థలాలు వద్దని టిడ్కో ఇళ్లు కావాలంటూ వీటిని తిరస్కరించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం లబ్ధిదారులకు మొదట మూడు ఆప్షన్లను ఇచ్చింది. ఆప్షన్‌–1 ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసి కూలీల ఛార్జీలకు నగదు ఇస్తుంది. లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాలి. ఆప్షన్‌–2 ప్రకా రం ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని లబ్ధిదారులు తెచ్చుకుంటే దశల వారీగా పురోగతిని బట్టి ప్రభుత్వం నగదు బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తుంది. ఆప్షన్‌–3  ప్రకారం ప్రభుత్వమే నిర్ధేశించిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించి ఇవ్వడం. అయితే తర్వాత ఈ మూడో ఆప్షన్‌ను తీసేసింది. మొదటి రెండు ఆప్షన్లనే ఉపయోగించుకోవాలని సూచించడంతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు. లేకుంటే తాము చిక్కుల్లో పడిపోతామని చెబుతున్నారు.


పాలకోడేరులో మహిళల ఆందోళన

స్థలం చూపించారు. పూడిక చేయలేదు. ఇల్లు ఎలా కట్టుకోవాలంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకోడేరులో 4.75 ఎకరాల్లో 188 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందులో సగం వరకు పూడ్చారు. మిగతా సగభాగాన్ని భూహక్కు సమస్య వల్ల పూడ్చకుండా వదిలివేశారు. స్థలం తీసుకున్న వారు ఇళ్లు కట్టుకోవాలని అధికారులు వత్తిడి తెస్తున్నారు. లబ్ధిదారులే పూడ్చుకొని గృహాలు నిర్మించుకోవాలని వలంటీర్ల ద్వారా మండలస్థాయి అధికారులు వత్తిడి చేయడంతో ఆ ప్రాంత మహిళలు మంగళవారం ఆందోళనకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. కొవిడ్‌ సమయంలో ధర్నాలు చేస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించడంతో చివరికి ఎంపీడీవో వెంకట అప్పారావు, హౌసింగ్‌ ఏఈ ఆంజనేయరాజుకు వినతిపత్రాలు అందించారు.


వలంటీర్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు..

ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది లబ్ధిదారుల పరిస్థితి.. మట్టిపూడిక లేదు.. రహదారులు లేవు.. సౌకర్యాలు లేవు.. కానీ ఇల్లు కట్టుకోవాలంటూ వలంటీర్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. ఎలా కట్టాలి. 

– వి.గోపాలకృష్ణ, పాలకోడేరు


రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టలేం

జగనన్న కాలనీలో పేదలకు ఇచ్చిన ఇంటి స్ధలంలో రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు. అప్పు చేయాల్సిందే. ప్రతి రోజు కూలీ పనికి వెళితే కాని పూట గడవని కుటుంబం మాది. అప్పు చేసి ఇల్లు కట్టే స్థోమత లేదు. ప్రభుత్వం మొదట్లో ఇల్లు మేమే కట్టిస్తాం పాలు పొంగించు కోవడమే తరువాయి అని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోవాలనడం సరికాదు.

– మాణిక్యం, చొదిమెళ్ళ


ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి 

కొవిడ్‌ సమయంలో భారీగా భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. రూ.1.80 లక్షలతో ఇల్లు పూర్తయ్యే పని కాదు. ఇప్పటికే ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆర్థిక భారమైనా మీరే కట్టుకోవాలంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదనంగా లక్ష రూపాయలు చూసుకోమంటున్నారు. పేదలమైన తాము అప్పులు తెచ్చి ఇల్లు కట్టే ఆర్ధిక స్థోమత లేదు. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలి. 

– సావిత్రమ్మ, కొమడవోలు


రూ3. లక్షలకుపైనే అవుతుంది 

జగనన్న ఇళ్ల కాలనీలో మూడు లక్షలకుపైగా ఇస్తేనే ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ప్రభుత్వం ఇచ్చే 1.80 లక్షలతో స్లాబ్‌ కూడా పూర్తి కాదు. ప్రభుత్వం మూడు ఆప్షన్లలో ఏది పెట్టినా తిరిగి తిరిగి మీరే ఇల్లు కట్టుకోవాలంటున్నారు. అలాం టప్పుడు ఆప్షన్లు ఎందుకు ఇచ్చారు. స్థలమి స్తాం.. ఇల్లు కట్టిస్తాం అన్నారు. ఇప్పుడేమో ఇలా మాట మార్చారు.

– రంగనాయకమ్మ, పోణంగి 


వెనక్కి తీసుకుంటారట

ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే స్థలాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. సీఎం జగన్‌ స్థలాలతోపాటు పక్కా భవనాలు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మాట ఏమైంది. మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా..?

– లక్ష్మి, జనసేన, ఆకివీడు


దారే లేదు.. ఇల్లెలా ?

మట్టి పూడిక చేపట్టలేదు. అక్కడకు వెళ్లేందుకు రహదారే లేదు. ఇంక ఇల్లెలా కట్టేది. ఇల్లు కట్టుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదు. అధికారులు పూడ్చకపోగా మమ్మల్నే పూడ్చుకొని కట్టుకోమని చెబుతున్నారు.

– పి.నరసింహరాజు, పాలకోడేరు

Updated Date - 2021-06-23T05:19:45+05:30 IST