ప్రభుత్వానికి మనుగడ ఉండదు

ABN , First Publish Date - 2021-12-27T05:26:31+05:30 IST

నిర్వాసితుల సమస్యలు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులుండవని మాజీ ఉప సర్పంచ్‌ మంగిన కొండ ఆగ్ర హం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి మనుగడ ఉండదు
దీక్ష చేపట్టిన నిర్వాసితులు

పోలవరం, డిసెంబరు 26: నిర్వాసితుల సమస్యలు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులుండవని మాజీ ఉప సర్పంచ్‌ మంగిన కొండ ఆగ్ర హం వ్యక్తం చేశారు. నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలకు ఆదివారం కొండ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట అధికారులు ముంపు గ్రామాల నుండి నిర్వాసితులను మైదాన ప్రాంతాలకు తీసుకు వచ్చి ఎలాంటి ఆధారం లేకుం డా గాలికొదిలేసి వారికి అందవలసిన పరిహారాలందించకుండా నిర్వాసితుల ఉసురుపోసుకుంటున్నారని విమర్శించారు. అందవలసిన పరిహారాలందకుండా గ్రామాలు ఖాళీ చేసేదిలేదని, గ్రామాల్లో ఉండిపోయిన నిర్వాసితులకు మంచినీరు, రేషన్‌, విద్యుత్‌, రవాణా సౌకర్యాలు లేకుండా చేయడం గిరిజన హక్కులను, చట్టాలను కాలరాయడమేనన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అసలేం తెలియనట్లు వ్యవహరించడం ఆ ప్రభు త్వాల మనుగడకు మంచిది కాదన్నారు. పోలవరం నుంచి ఎల్‌ఎన్‌డీ.పేట వరకూ పునరావాస కాలనీలకు, మండలంలో గ్రామాలకు గత 10 నెలలుగా సత్యసాయి మంచినీటి సరఫరా నిలిచి ప్రజలు, పునరావాస గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు పునరావాస గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు సత్యసాయి మంచినీటి సరఫరా ఎందుకు పునరుద్ధరించలేకపోయారని ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, నిర్వాసితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జల్లేపల్లి వెంకటనరసింహారావు, మేడూరి పార్వతి, మంగిన పోశీరత్నం, ఐక్యవేదిక నాయకులు చిట్టిబాబు, ఆదివాసి మహాసభ నాయకులు కారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T05:26:31+05:30 IST