నిర్వాసితులను భయపెట్టడానికి కాఫర్‌ డ్యాం మూసివేత

ABN , First Publish Date - 2021-12-20T05:09:25+05:30 IST

నిర్వాసితులను భయబ్రాంతులకు గురి చేయడానికే ప్రభుత్వం కాఫర్‌ డ్యాం మూసివేసిందని ఆదివాసీ మహాసభ, నిర్వాసితుల ఐక్యవేదిక, టీడీపీ నాయకులు విమర్శించారు.

నిర్వాసితులను భయపెట్టడానికి కాఫర్‌ డ్యాం మూసివేత
నిర్వాసితుల దీక్షలో ముంపు గ్రామాల గిరిజనులు

పోలవరం, డిసెంబరు 19: నిర్వాసితులను భయబ్రాంతులకు గురి చేయడానికే ప్రభుత్వం కాఫర్‌ డ్యాం మూసివేసిందని ఆదివాసీ మహాసభ, నిర్వాసితుల ఐక్యవేదిక, టీడీపీ నాయకులు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వా సితుల సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన దీక్షలు ఆదివారం నాటికి పదో రోజుకు చేరుకున్నాయి.  ఆది వాసీ మహాసభ నాయకుడు కారం వెంకటేశ్వరరావు, ఐక్యవేదిక నాయకుడు వీరపురాజు చిట్టిబాబు, టీడీపీ నాయకుడు జల్లేపల్లి వెంకట నరసింహారావు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం పథకం ప్రకారం నిర్వాసితులను భయ బ్రాంతులకు గురిచేయడానికి గ్రామాలు ఖాళీ చేయించడానికే కాఫర్‌ డ్యాం మూసివేసి నీరు నిలగట్టారని, రెవెన్యూ అధికారులు మాయమాటలతో నిర్వా సితులను ప్రాజెక్టు దిగువకు తరలించి గాలికి వదిలేశారన్నారు. పరిహారాలు అందక పునరావాసాల నిర్మాణం పూర్తికాక తినడానికి తిండిలేక, అద్దె ఇళ్లకు అద్దె చెల్లించే పరిస్థితి లేక అప్పుల కోసం యాచకుల్లా బతకాల్సిన దయ నీయ పరిస్థితిలో నిర్వాసితులు బతుకుతున్నారని, పరిహారం ఇచ్చేవరకూ వచ్చేదిలేదంటూ ముంపు గ్రామాల్లో మిగిలిపోయిన 900 కుటుంబాలు తాగడానికి మంచినీరు లేక, తిండి తెచ్చుకోవడానికి రోడ్డు మార్గం లేక ఇబ్బం దులు పడుతున్నారన్నారు. విద్యుత్‌ సౌకర్యం లేక రాత్రివేళ గాడాంధకారంలో విష సర్పాలు, కీటకాల భయంతో, దోమలు, అనారోగ్యాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలు ప్రారంభించి పది రోజులు కావస్తున్నా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, గిరిజనుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే, ఎస్టీ కమిటీ చైర్మన్‌ అయివుండి ఏమాత్రం స్పందించకపో వడం శోచనీయమన్నారు. ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని, పునరావాసాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. లేనిపక్షంలో తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోతామని, ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగిన కొండ, పలువురు నేతలు నిర్వాసిత గ్రామాల గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-20T05:09:25+05:30 IST