పెళ్లి కానుక అందేనా..?
ABN , First Publish Date - 2021-08-08T05:51:15+05:30 IST
నవ దంపతులకు ప్రభుత్వమందించే పెళ్లి కానుక ఇకపై గతమేనని తేలిపోయింది.
వేలాది మంది నవ దంపతుల ఎదురుచూపులు
రెండేళ్ల నుంచి పెండింగ్‌లోనే పథకం
నవ దంపతులకు ప్రభుత్వమందించే పెళ్లి కానుక ఇకపై గతమేనని తేలిపోయింది. గడిచిన రెండేళ్లుగా దరఖాస్తులకే పరిమితమైన ఈ పథకం కిందటేడాది నుంచి ఆ దరఖాస్తుల స్వీకరణను కూడా నిలిపివేసింది. దీంతో పథకం అనధికారికంగా నిలిచి పోయినట్లేనని తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఏలూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నిరుపేద, మధ్యతరగతికి చెందిన నవదంపతులు జీవితంలో స్థిర పడేందుకు వీలుగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ మేరకు బీసీ, మైనారి టీలకు 35 వేలు, ఎస్సీ దంపతులకు రూ. 50 వేలు, దివ్యాంగ, కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు 75 వేలు అప్పటి ప్రభుత్వం పెళ్లి కానుక కింద ఇచ్చింది. ఈ పథకాన్ని మరింత విస్తృత పరుస్తామని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం బీసీ, మైనారి టీలకు రూ. 50 వేలు, ఎస్సీ, దివ్యాంగ, కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు లక్ష రూపాయలు చొప్పున పెళ్లి కానుక పెంచి ఇస్తానని అట్టహాసంగా ప్రకటించింది. కానీ ఒక్కరికి కూడా ఆ కానుక అందలేదు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న దర ఖాస్తుల్లో ఏ కొద్ది మందికో సాయం అందించారు తప్ప కొత్తగా ప్రకటించిన పథకం ప్రకారం పెళ్లి కానుక ఏ ఒక్కరికీ దక్కలేదు.
కిందటి ఏప్రిల్ నుంచి నిలిచిపోయిన పథకం
2018–19లో 11,780 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 5,090 మందికి అప్పటి ప్రభుత్వం రూ. 25.01 కోట్లు కొత్త దంపతులకు కానుకగా ఇచ్చింది. కాగా మిగిలిన 6,690 మందిలో అర్హులైన 6,334 మందికి కానుక ఆగిపోయింది. ఎన్నికల అనంతరం ఏడాది తరువాత కొత్త ప్రభుత్వం వారిలో 5,026 మందికి కానుక ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన 1,308 మందికి మాత్రం కానుక ఇవ్వలేదు. దీంతోపాటు 2019–20 సంవ త్సరానికి 5,662 మంది దంపతులు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో ఒక్కరికి కూడా పెళ్లి కానుక దక్కలేదు. అయితే కిందటి సెప్టెంబరు నుంచి అధికారులు పెళ్లి కానుక దరఖాస్తులను కూడా తీసుకోవడం ఆపేశారు. దీంతో ఈ ఏడాది కాలంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మరో 10 వేల మంది పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకునే వీలే లేకుండా పోయింది. వీరంతా పెళ్లి కానుక పథకం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. పెళ్లికానుక పథకం ప్రస్తుతం అమలులో లేదని పథకం అమ లుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదని డీఆర్‌డీఏ పీడీ ఉదయ భాస్కర్ వివరించారు. ప్రభుత్వం ఆదేశాలు వస్తే తిరిగి పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు.