అప్పులు.. అభాసుపాలు

ABN , First Publish Date - 2021-12-15T05:49:20+05:30 IST

సర్పంచ్‌గా గెలిస్తే గ్రామానికంతటికి తామే రాజు అనుకున్నారు. ఊరుని అద్దంలా మార్చి శభాష్‌ అనిపించుకోవాలని కలలు కన్నారు. మంత్రులతో పాటు ఏకంగా సీఎంను కూడా పిలిచి తమ గ్రామ రికార్డును తిరగరాయాలని భావించారు.

అప్పులు.. అభాసుపాలు

పంచాయతీల్లో నిలిచిన అభివృద్ధి పనులు
ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో దీనస్థితి
తాగునీరు, డ్రెయిన్లకు అంతే సంగతులు
అప్పులు చేసిన సర్పంచ్‌లకు తిప్పలు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
సర్పంచ్‌గా గెలిస్తే గ్రామానికంతటికి తామే రాజు అనుకున్నారు. ఊరుని అద్దంలా మార్చి శభాష్‌ అనిపించుకోవాలని కలలు కన్నారు. మంత్రులతో పాటు ఏకంగా సీఎంను కూడా పిలిచి తమ గ్రామ రికార్డును తిరగరాయాలని భావించారు. ఎన్నో హామీలు ఇచ్చారు. మరెన్నో శపథాలు చేశారు. తీరా ఇప్పుడు చతికిలపడ్డారు. అభివృద్ధి చేద్ధామనేసరికి గ్రామ ఖాతాలో చేరిన లక్షలు కాస్తా సర్కారే కాజేసింది. చేతిలో చిల్లిగవ్వలేక అసంపూర్తిగా పనులు కళ్ళెదుట కనిపిస్తుంటే వీధుల్లోకి రాలేక, అభాసుపాలు కాలేక సర్పంచ్‌లు విలవిల్లా డుతున్నారు. మరికొందరైతే ఏకంగా ప్రతిష్టాత్మకంగా భావించి ముందస్తు పెట్టుబడి పెట్టి ఇప్పుడు అప్పులపాలయ్యారు. ఇప్పుడు ఏ ఊరుని కదిపినా ఇదే సీను కనిపిస్తోంది..


అంతా కొత్తే.. చేదు అనుభవాలెన్నో..
జిల్లా వ్యాప్తంగా దాదాపు 856కు పైగా గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో మూడోవంతు కాస్తోకూస్తో భారీగా వివిధ పనుల ద్వారా ఆదాయం సమకూర్చు కునేవే. కాని ఈసారి సీను తిరగబడింది. పంచాయతీలకు జీవం పోయాల్సిన 14, 15 ఆర్థిక సంఘం నిధులన్నీ పక్కదారి పట్టాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వమే దారి చూపింది. నేరుగా తన ఖజానాల్లోకి మళ్ళించుకుంది. తీరా ఊరుకి అంతో ఇంతో చేద్దామని అడుగుపెట్టిన యువ సర్పంచ్‌లు ఇప్పుడు ఎటూ పోకుండా మిగిలి పోయారు. ఏమీ చేయలేని నిస్సహాయతను ఎదుర్కొంటున్నారు. తొలిసారిగా ఎన్నికైన వారి సంఖ్య దాదాపు 90 శాతం కాగా వీరందరికీ ఈమధ్యన వచ్చిన చేదు అనుభవాలెన్నో. ఒక్క 15వ ఆర్థిక సంఘం నిధులే దాదాపు రూ.214 కోట్లు రాగా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించుకుంది. ఫలితంగా తాగునీరు సరఫరా, నిర్వహణ, పారిశుధ్యం, రహదారులు, డ్రెయినేజీ నిర్వహణ, కట్టడాలు, కరెంటు బిల్లులు, ఇతరత్రా వాటికి  అవసరమయ్యే లక్షల రూపాయలు కళ్ళకు కనిపించినట్టే కనిపించి సర్కారు దెబ్బతో మాయమయ్యాయి. మేజర్‌ గ్రామ పంచాయతీలైతే అంతో ఇంతో తట్టుకున్నాయికాని దాదాపు 370కు పైగా చిన్న గ్రామాలన్నీ కుదేలయ్యాయి.


అప్పులు చేసి పనులు చేస్తే..

పంచాయతీల్లో 14, 15 ఆర్థిక సంఘం నిధులతో భారీగా పనులు చేపడదామనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ముందుకు సాగాలని కసరత్తు చేశారు. తీరా ఇప్పుడు సీను కాస్తా తిరగబడింది. గొప్పలకు పోయిన సర్పంచ్‌లు కొందరు తమ సొంత నిధులతో ముందస్తుగా పనులకు ఉపక్రమిం చారు. అది రూపాయో, రెండు రూపా యలో కాదు.. లక్షల్లో ఉన్నా ఖాతరు చేయలేదు. తీరా ఆర్థిక సంఘం నిధులన్నీ మటుమాయం కావడంతో వీరంతా ఒక్కసారిగా అప్పుల్లో కూరుకుపోయారు. మళ్ళించిన సొమ్ములను తిరిగి వెనక్కి ఇస్తారనే నమ్మకంతో సర్పంచ్‌లు ఉన్నారు. కాని ఇప్పటికే మళ్ళించి నెల రోజులకుపైనే అయినా అతీగతీలేదు. సమాధానం చెప్పేవారే లేరు. మంత్రులు, ఎమ్మెల్యేలు మౌనం పాటిస్తున్నారు. అన్నీ చక్కబడతాయంటూ ఓదారుస్తున్నారు. సరాసరిన చిన్న పంచాయతీలు, తక్కువ జనాభా ఉన్న వాటికి దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సంఘం ద్వారా లభించాయి. అదే మేజర్‌ పంచాయతీలైతే 15 నుంచి 25 లక్షల వరకు దక్కాయి. ఇప్పుడు పంచాయతీ ఖజానాలో మాత్రం రూపాయి లేకుండా పోయింది. ఆఖరుకు కరెంటు బిల్లులను కట్టే పరిస్థితుల్లో లేరు. తాగునీటి సరఫరా పరిస్థితి అధ్వాన్నంగా మారింది. వచ్చేది వేసవికాలం..ఇప్పటి నుంచే తాగునీటి పైపులైన్లను సరిచేసుకోవాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వలేక సర్పంచ్‌లు చేతులెత్తేస్తున్నారు.

Updated Date - 2021-12-15T05:49:20+05:30 IST