సార్వాకు సొమ్ములేవీ..!

ABN , First Publish Date - 2021-07-09T05:19:20+05:30 IST

ధాన్యం అమ్మిని రైతులు సొమ్ములు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. నెలల తరబడి వేలాది మంది రైతుల పడిగాపులు పడుతు న్నారు.

సార్వాకు సొమ్ములేవీ..!

నెలలు గడుస్తున్నా రైతులకందని దాళ్వా ధాన్యం డబ్బులు రూ.800 కోట్లు 

జిల్లాలో 30 వేల మంది ఎదురుచూపు 

ఎప్పుడొస్తాయో తేల్చని అధికారులు

 బయట అప్పు పుట్టక రైతుల విలవిల 

ఇప్పటికే నారుమళ్లు.. నాట్లు ఆలస్యం


‘ధాన్యం అమ్మి నెల రోజులవుతుంది. మూడు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని అంతా అమ్మేశాం. రెండు లక్షలు వరకూ రావాలి. అదిగో ఇదిగో అంటున్నారు. చేతిలో మాత్రం పెట్టడం లేదు. సార్వా పనులు ముంచుకొచ్చాయి. సొమ్ము వస్తేనే సార్వా పనులు సాగేది’ అని వాపోయారు బేతపూడికి చెందిన రైతు కె.సత్యనారాయణ.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ధాన్యం అమ్మిని రైతులు సొమ్ములు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. నెలల తరబడి వేలాది మంది రైతుల పడిగాపులు పడుతు న్నారు. సార్వా పనులు ముంచుకొచ్చాయి. చేతిలో చిల్లి గవ్వ లేదు. డబ్బు ఉంటేనే వ్యవసాయ పనులు ముందుకు సాగేది. ఈ మాసాంతం నాటికి దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకూ 30 వేల హెక్టా ర్లలో నాట్లు వేశారు.. జిల్లావ్యాప్తంగా 30 వేల మంది రైతులకు రూ.800 కోట్లకుపైగా సర్కారు దాళ్వాకు సంబంధించి ధాన్యం సొమ్ములు చెల్లించాలి. ఖాతాలో సొమ్ము ఎప్పుడు పడుతుందా ఏరోజుకారోజు ఎదురు చూస్తున్నారు. గత రబీలో దాదాపు 13.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. రూ.2400 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు రూ.1,590 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా చెల్లించాల్సిన రూ.800 కోట్లు ఎప్పటిలోగా రైతులకు అందు తుందో స్పష్టత లేదు. ధాన్యం కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి 15 రోజుల్లోనే సొమ్ము చేతిలో పడాలి..కానీ నెలలు గడుస్తున్నా సొమ్ములు రాకపోవడంతో రైతుల్లో నైరా శ్యం నెలకొంది. తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తోంది. ఇప్ప టికే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో వంద లాది మంది రైతులు నలిగిపోతున్నారు. తెలుగుదేశం సహా మిగతా పక్షాలన్నీ ధాన్యం సొమ్మును తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకుండా రైతులతో ఆటలాడుతారా అంటూ వామపక్షాలు నిగ్గదీస్తున్నాయి.  


 పుంజుకోని నారుమడులు

ఏరువాక ఆరంభమై చాలా కాలమైనా సార్వా సాగుకు కాల్వలకు నీటిని విడుదల చేసినా వ్యవసాయ పనులు ఇప్పటికీ దాదాపు పుంజుకోలేదు. ప్రత్యేకించి ఈ జిల్లాలో సార్వా లక్ష్యం దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకూ కేవలం ఏడు వేల హెక్టార్లలోనే నారుమళ్లు పోశారు. అనుకున్న లక్ష్యం చేరువ కావడానికి మరో 3,800 హెక్టార్లు నారుమళ్లు సిద్ధం కావాలి. కానీ ఆ పరిస్థితి కనిపిం చడం లేదు. సాధారణంగా ఈ జిల్లాలో సీజన్‌లో అదును తప్పకుండా వ్యవసాయ పనులు ఆరంభిం చేస్తారు. ఈసారి ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడమే లేదు. నారుమళ్లతో పాటు నాట్లు పుంజుకోలేదు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు తడిచి మోపెడయ్యాయి. కూలీ రేట్లు రెండింతలయ్యాయి. అంతో ఇంతో పెట్టుబడి పెడితేనే పనులు ఆరంభమవుతాయి. అప్పు కోసం ఎక్కే గడప, దిగే గడప. అయినా ఫలితం లేదు. రైతుల కష్టాలపై సర్కారులో మాత్రం కదలికలేదు. పరిష్కార మార్గాలు అన్వేషించాల్సింది పోయి కేంద్రం నుంచి రావాల్సిన ధాన్యం సొమ్ములో వాటా చేరలేదంటూ సాకులు చెబుతోంది.


 ఇదెక్కడి దారుణం  – ఎం.వీరబాబు, కౌలు రైతు, పాలకొల్లు

పదేళ్లుగా కౌలుకు చేస్తున్నా. మూడె కరాల్లో ధాన్యం పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ఇచ్చా. లక్షా 30 వేలకు రూ.60 వేలు ఇచ్చారు. మిగతా సొమ్ము ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇదెక్కడి దారుణం.  సార్వాకు నాలుగు రూపాయలు చేతిలో ఉంటేనే కాని పనులు మొదలు పెట్టలేం. 


చేతుల్లో సొమ్ముల్లేవ్‌ –బొక్కా శ్రీనివాస్‌, యలమంచిలి

18 ఎకరాలకుపైగా సాగు చేశాను. ధాన్యం సొమ్ము కోసం రెండు నెలలు గా ఎదురుచూస్తున్నాం. రావాల్సిన 9 లక్షలు ఇప్పటికీ రాలేదు. సార్వా పనుల కోసం కూలీలు, పురుగు మందులు, ఎరువులు నిమిత్తం చేతిలో సొమ్ము ఉంటేనే పని.. లేదంటే అంతే సంగతులు. ఏం చేయాలో తెలియడం లేదు. 


 40 రోజులైనా పైసా రాలేదు – యర్రంశెట్టి రాంబాబు, బాలేపల్లి

గతంలో ఎన్నడూ పడని ఇబ్బం దులు ఇప్పుడు పడుతున్నాం. ధాన్యం విక్రయించి 40 రోజులవుతోంది. ఆరు ఎకరాల్లో నానా కష్టాలు పడి ధాన్యం పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రా నికి ఇచ్చా. మూడు లక్షలు రావాలి. పైసా రాలేదు. ఇప్పుడేమో పెట్టుబడి అవసరం. చేతిలో నయా పైసా లేదు. ఏం చేయా లో తెలియడం లేదు. బయట అప్పు పుట్టడం లేదు. 

Updated Date - 2021-07-09T05:19:20+05:30 IST