సీఎం మీ ఇష్టం అంటారు.. మీరు కట్టమంటారు!
ABN , First Publish Date - 2021-12-10T05:10:28+05:30 IST
అధికారులకు లబ్ధిదారుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఓటీఎస్ పేరుతో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఓటీఎస్‌కు పల్లెబాట పట్టిన అధికారులు
కట్టకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరిక
లబ్ధిదారుల నుంచి ప్రతిఘటన
మొగల్తూరు,డిసెంబరు 9 : అధికారులకు లబ్ధిదారుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఓటీఎస్ పేరుతో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమాధానాలు చెప్పలేక అధికారులు తలలు పట్టుకుం టున్నారు. మొగల్తూరు, ఆకివీడులో గురువారం పలువురు అధికారులు పర్యటిం చారు. హౌసింగ్ పీడీ టి.వేణుగోపాల్ మండలంలోని కొత్తోటలో, సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ కేపీపాలెం నార్త్, ఆకివీడులో నగర పంచాయతీ మేనేజర్ వెంకటేశ్వరరావు పర్యటించి లబ్ధిదారులకు ఓటీఎస్‌పై అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా పలువురు లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ఆకివీడు గంగానమ్మకోడ్ ప్రాంతంలో రుణం పొందిన పామర్తి విజయ్‌ను చెల్లించాలని చెప్పగా తాను ఎందుకు కట్టాలని ఎదురు ప్రశ్నించాడు. 22 ఏళ్ల తరువాత వచ్చి మీరు చెల్లించాలనడం పద్ధతి కాదన్నాడు. అప్పుడే 80 శాతం చెల్లించామని ఇంకా రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుందని మీరొచ్చి రూ.10 వేలు కట్టమంటారేంటని ప్రశ్నించాడు. కట్టినట్టు బిల్లులు చూపించమంటే ఇప్పటి వరకూ ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్బులు చెల్లించకపోతే చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. దీనిపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు ఓటీఎస్‌పై ఒత్తిడి లేదని స్వచ్ఛంద మేనని ప్రకటిస్తుంటే అధికారులు గ్రామాల్లో ఇంటి బాట పట్టడాన్ని విమర్శిస్తు న్నారు. జాయింట్ కలెక్టర్లు, జిల్లా హౌసింగ్ అధికారులు సైతం లబ్ధిదారుల చెంతకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.అవగాహన పేరుతో ఒత్తిడి తేవడం తగదంటున్నారు.