బాలలతో పనులు చేయిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-05-20T05:47:09+05:30 IST

చింతలపూడి పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని నాలుగు మండలాల్లో జరిగిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో 37 మంది బాలలను గుర్తించినట్టు చింతలపూడి సీఐ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు తెలిపారు.

బాలలతో పనులు చేయిస్తే చర్యలు
చింతలపూడిలో బాలలతో సీఐ మల్లేశ్వరరావు, ఇతర అధికారులు

‘ఆపరేషన్‌ ముస్కాన్‌’లో పలువురు బాలల గుర్తింపు

చింతలపూడి, మే 19 : చింతలపూడి పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని నాలుగు మండలాల్లో జరిగిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో 37 మంది బాలలను గుర్తించినట్టు చింతలపూడి సీఐ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం నాలుగు మండలాల్లో తనిఖీలు చేసి 37 మంది బాల కార్మికులను గుర్తించి వారి తల్లి దండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి   బాలలను అప్పగించినట్లు తెలిపారు.  బాలలకు కరోనా పరీక్షలు నిర్వహించి అల్పాహారం,  శానిటైజర్లు అందజేశారు.   చైల్డ్‌లైన్‌ సిబ్బంది ఎస్‌ఐ స్వామి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

 బుట్టాయగూడెం: పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు  తప్పవని  ఎస్‌ఐ ఎం.కుటుంబరావు తెలిపారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా బుధవారం స్టేసన్‌ ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో వివిధ రకాల పనులు చేస్తున్న 11 మంది బాల కార్మికులను గుర్తించి పనులు చేయిస్తున్న యజమానులకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కార్యక్రమానికి ముందు పిల్లలకు  కరోనా పరీక్షలు నిర్వహించి మాస్కులు, అల్పాహారాన్ని అందించారు. బాల్యంలో బడులకు పంపాలి తప్ప పనులు చేయించడం చట్టారీత్యా నేరమన్నారు. వైద్యాధికారి జి. గంగాధర్‌, తదితరులు   పాల్గొన్నారు.

కుక్కునూరు: బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ బాల సురేష్‌బాబు హెచ్చరించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా వీధి బాలలు, బాల కార్మికులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కరోనా టెస్టులు చేయించి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో అల్పాహారం అందించారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి  పిల్లలను పనిలో పెట్టమని హామీపత్రం రాయించుకుని బాలలను వదిలిపెట్టారు.  దుకాణాదారులు ఎవరైనా 18 ఏళ్ల లోపు వారిని పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్‌ఐ పైడిబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-20T05:47:09+05:30 IST