చివరి మజిలీ గజిబిజి..

ABN , First Publish Date - 2021-08-21T05:34:00+05:30 IST

సుబ్బారావు మతి మరుపుతో ఇంట్లో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.

చివరి మజిలీ గజిబిజి..

60 దాటితే అన్నీ ఇబ్బందులే..

ఒంటరితనంతో బిక్కు..బిక్కు

గుర్తింపు లేదంటూ ఆక్రోశం

చాదస్తంగా భావిస్తున్న పిల్లలు 

ధిక్కార స్వరంతో వృద్ధుల్లో ఆవేదన


సుబ్బారావు మతి మరుపుతో ఇంట్లో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ‘‘ఒరేయ్‌.. నాలుగు అవుతున్నా మీ ఆవిడ నాకు అన్నం పెట్టలేదురా అంటూ కొడుక్కి ఫోన్‌ చేయడంతో కంగారుపడి లేచి .. టైమ్‌ చూశాడు.. నాన్నా ఇప్పుడు తెల్లవారుజాము నాలుగు అయింది.. ఇప్పుడేంటి నాన్నా అంటూ కాస్త విసుక్కున్నాడు.. సరేలే.. నాకు ఆకలి వేస్తోంది.. ఏదో ఒకటి పెట్టు అంటూ కయ్యమన్నాడు ఆ పెద్దాయన.. వృద్ధాప్యంలో అల్జీమర్స్‌ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. జీవితం చివరి దశలో వృద్ధులు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు  పడుతుంటారు..  

తాతారావుకి 80 ఏళ్లు దాటాయి. కొడుకులు అతడిని బాగానే చూసుకుంటున్నారు. అయినా అతడిలో ఏదో అసంతృప్తి.. తనను తక్కువ చూస్తున్నారనే భావన. ఫలానా యల్లారావు రైలు కిందపడి చచ్చాడు. ఆ ధైర్యం నేను చేయలేకపోతున్నాను అంటూ నిట్టూర్పులు.. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన 50 శాతం పైబడి ఇలాంటి మనస్తత్వాలతోనే తాము బాధపడుతూ కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారు. ప్రేమగా చూసుకునే వారికి ఇది ఇబ్బందిగా మారుతోంది. ఎప్పుడైనా కసురుకుంటే పెద్దలు మరింత తల్లడిల్లిపోతున్నారు..

జీవితం చివరిలో ఎన్నో సమస్యలు వృద్ధులను వెంటాడతాయి.. అదే సమయంలో వారు కుటుంబ సభ్యులకు భారంగా కనిపిస్తుంటారు. 

నేడు జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జరిపిన ఒక సర్వేలో ఆసక్తి కలిగించే కొన్ని అంశాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులలో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో గడుపుతున్న వారి సంఖ్య మన దేశంలో 22 శాతంగా ఉంది. 12 శాతం వృద్ధులు మానసిక ఒత్తిడితో జీవిస్తున్నారు.20 శాతం వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ భగవంతుడు తీసుకెళ్లిపోతే బాగుండు అనుకుంటున్నారు. 

10 శాతం వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉన్నారు. ఇక మిగిలిన 36 శాతం వృద్ధుల జీవితం పలు సమస్యలతో సాగుతోంది. 

పాలకొల్లు, ఆగస్టు 20 : సహజంగానే 60 దాటితే అధిక శాతం వృద్ధులలో చెప్పిన మాటలనే పదేపదే చెప్పడం... సమయం సందర్భం లేకుండా మాట్లాడడం... తమ మాటలను పిల్లలు వినకుంటే అలక చెందడం వృద్ధుల లక్షణం. ఇప్పుడు వృద్ధుల జీవన ఉనికికి ఇదే పెద్ద ప్రమాదంగా తయా రైంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తాము ప్రేమగానే చూసుకుంటున్నామని పిల్లలు చెబుతూ వస్తున్నప్పటికీ వృద్ధులు తమను తక్కువ చేసి చూస్తున్నారనే భావనతో కలతచెందు తున్నారు. అధికశాతం వృద్ధులు జీవిత చరమాంకంలో ఇక తనువు చాలిస్తేనే బావుండు అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.వృద్ధులలో అభద్రతా భావం వెంటాడుతోంది. తమపిల్లలు వృద్ధాప్యంలో పట్టించుకోరనే ఆందోళన అధికశాతం వృద్ధులను వెంటాడుతోంది. అనారోగ్యం పాలయితే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచన వారిని మరింత కుంగదీస్తోంది.


Updated Date - 2021-08-21T05:34:00+05:30 IST