వీడని వర్షాలు

ABN , First Publish Date - 2021-11-15T05:16:35+05:30 IST

వర్షాలు వదలడంలేదు. తుఫాన్‌ తీరం దాటినా మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆ ప్రభావంతో ఆదివారం తీర ప్రాంతంలో వానలు కురుస్తూనే ఉన్నాయి.

వీడని వర్షాలు

తుఫాన్‌ హెచ్చరికతో వేటపై ఆంక్షలు

నరసాపురం, నవంబరు 14: వర్షాలు వదలడంలేదు. తుఫాన్‌ తీరం దాటినా మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆ  ప్రభావంతో ఆదివారం తీర ప్రాంతంలో వానలు కురుస్తూనే ఉన్నాయి. ఉదయం కొద్ది సేపు ఎండ రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. గంట, అరగంట పాటు తెరిపిస్తూ రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉన్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివాహాలు, ఇతర శుభకార్యక్రమాలకు ముహూర్తాలు పెట్టుకున్న వారంతా వానలతో   ఇబ్బందులకు గురయ్యారు.  ఈ నెల 2 నుంచి తీర ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొన్నది. దీపావళికి ముందు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలకు కురిశాయి. అమావాస్య వెళ్లిన తరువాత అల్పపీడనం కాస్త తుఫాన్‌గా మారడంతో శుక్రవారం వరకు భారీ వర్షాలు పడ్డాయి. తుఫాన్‌ తీరం దాటినా ఆ ప్రభావం శనివారం వరకు కనిపించింది. ఇలా 12 రోజులుగా వర్షాలతో ప్రజలు విసుగెత్తారు. వాతావరణంలో మార్పు వచ్చిందనుకుంటున్న సమయంలో అండమాన్‌ వద్ద  బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఇది తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార  యంత్రాగం అప్రమత్తమైంది.  మత్స్యకారులు సముద్రవేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ బోట్లన్నీ ఈ నెల 12 రోజులుగా తుఫాన్‌ హెచ్చరికతో పట్టణంలోని లాకుల వద్దకు చేరాయి. మళ్లీ తుఫాన్‌ ఏర్పడుతుందనడంతో మత్స్యకారులంతా ఢీలాపడ్డారు. 


 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు 

తుఫాన్‌ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులన్నీ రద్దు చేశారు. తీర గ్రామాల్లో పని చేసే రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది అలర్టుగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నరసాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి వీఆర్వోలతో అదివారం సమావేశమయ్యారు. తుఫాన్‌ తీవ్రతను తీర గ్రామ ప్రజలకు తెలియజేయాలన్నారు. తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వలంటీర్లతో ఇంటింటికి తెలపాలన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో బలమైన గాలలు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలన్నారు. తీర గ్రామాల్లోని తుఫాన్‌ షెలర్టలను సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ 08814 –275048కు  ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. 


Updated Date - 2021-11-15T05:16:35+05:30 IST