వ్యాక్సిన్ ఇవ్వండి..!
ABN , First Publish Date - 2021-05-09T04:53:39+05:30 IST
కొవిషీల్డ్.. కొవాగ్జిన్.. ఇవి కొవిడ్ వ్యాక్సిన్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ప్రజలు జపిస్తున్న మంత్రం.

నిరాశగా వెనుదిరుగుతున్న జనం
కరోనా భయంతో ఆందోళన
కొవిషీల్డ్.. కొవాగ్జిన్.. ఇవి కొవిడ్ వ్యాక్సిన్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ప్రజలు జపిస్తున్న మంత్రం. ఆరంభంలో వ్యాక్సిన్ కోసం పెద్దగా ఆసక్తి కనబర్చకున్నా కరోనా ఉధృతితో అందరూ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వ్యాక్సిన్ లేదని.. కేవలం రెండో డోస్ వారికేనని.. వ్యాక్సిన్ అయిపోయిందనే.. సమాధానాలతో ప్రజల్లో నిరాశతో పాటు భయం పెరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా దరిచేరదనే నమ్మకం కూడా బలపడింది. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో నిల్వలు లేకపోవడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఆస్పత్రుల వద్ద క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారు. లేదంటే నిరాశగా వెనుదిరుగుతున్నారు.
కొయ్యలగూడెం/పోలవరం/చింతలపూడి/ద్వారకాతిరుమల, మే 8: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. కరోనా ఉధృతితో వ్యాక్సిన్ ఆవశ్యకత తెలిసివచ్చింది. దీంతో వ్యాక్సిన్ కోసం ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. కొద్దిపాటి వ్యాక్సిన్ డోస్‌లు రావడంతో వ్యాక్సిన్ కోసం వెళ్లిన ప్రజలు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కొయ్యలగూడెం, బయ్యన్న గూడెం పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. పదిరోజులుగా వ్యాక్సిన్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా వ్యాక్సిన్ వేయడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వచ్చిన వ్యాక్సిన్ రెండో డోసు వారికి మాత్రమేనని, మొదటి డోసు వారికి వేయడం లేదు. ఎప్పుడు వెళ్లినా వ్యాక్సిన్ లేదనే సమా ధానం వస్తుందని ప్రజలు వాపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చిందని తెలిసే సరికే అయిపోతుందని ఆవేదన చెందుతున్నారు. మండలంలోని ప్రజలు బుట్టా యిగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లోని వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు కూడా వెళ్తున్నారు. అయినప్పటికి అందరికీ వ్యాక్సిన్ అందక అసహనానికి గురవుతున్నారు. ఒక పక్క కర్ఫ్యూతో వ్యాక్సిన్ కోసం బిక్కుబిక్కుమని వెళుతున్న వారు వ్యాక్సిన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని వాపోతున్నారు. కనీసం వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చేది ముందుగా తెలియజేస్తే తమకు కష్టాలు ఉండవని అంటున్నారు. ఆసుపత్రుల్లో ముందుగా వ్యాక్సిన్ వచ్చే రోజు తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు.
వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు
పోలవరం సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరతతో ఎదురుచూపులతోనే నిరాశగా వెనుదిరుగుతున్నారు. పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రంలో మొదటి, రెండో డోస్ వ్యాక్సిన్‌లు లేకపోవడంతో చాలామంది వెనుదిరిగి వెళ్లారు. ఈ విషయమై ఆసుపత్రి అధికారులు సైతం వాక్సిన్ కొరత వాస్తవమేనని చెబుతున్నారు. పోలవరం మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయందోళన చెందుతున్నారు.
ఎక్కడికెళ్లినా వ్యాక్సిన్ కొరత
చింతలపూడిలో ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్‌సీల్లో మూడు రోజులుగా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ కోసం పలువురు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. వ్యాక్సిన్ లేకపోవడంతో మూడు రోజు లుగా తిరుగుతూనే ఉన్నారు. కోవ్యాగ్జిన్ రెండో విడత వేయాల్సిన వారికి అందుబాటులో లేకపోవడంతో సమయం దాటిపోతుందేమోనని ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. దీనిపై కోవిడ్ అధికారి కిరణ్ చైతన్యను ప్రశ్నించగా ప్రస్తుతం మున్సిపాల్టీలో వ్యాక్సిన్లు వస్తున్నాయని ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు కేసులు పెరుగుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావద్దని ఏమైనా అవసరాలు ఉంటే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరిపించుకోవచ్చునన్నారు.
వ్యాక్సిన్ రెండో డోస్‌కు ఎదురుచూపులు
ద్వారకాతిరుమల మండలంలో కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ మొదటి డోసు కొంత మంది వేయించుకున్నారు. రెండో డోసు అందుబాటులో లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మండలంలో చాలామందికి మొదటి డోస్ కూడా వేయలేదు. మండల ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే రెండో డోస్ వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.