వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా అవమానించారు: నిమ్మల రామానాయుడు

ABN , First Publish Date - 2021-12-31T17:35:49+05:30 IST

వంగవీటి రాధాని వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి, ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించారని...

వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా అవమానించారు: నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: వంగవీటి రాధాని వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి, ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రంగా బొమ్మను అడ్డం పెట్టుకొని గెలిచి వంగవీటి రంగా కుటుంబానికి ఏమీ చేశారని ప్రశ్నించారు. కాపులను సర్వేచేసి బీసీల్లో చేర్చడానికి కాపులందరూ రూ. 46 లక్షలు ప్రభుత్వాన్ని అడిగితే 4 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 


రంగా హత్య కేసులో ప్రధాన ముద్దాయి దేవినేని నెహ్రూకి హైదరాబాద్‌లో రూ. 300 కోట్ల విలువైన భూములను అప్పజెప్పలేదా? అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రంగాను చంపడం తప్పు కాదని బహిరంగంగా చెప్పిన గౌతమ్ రెడ్డికి నేడు ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ పదవిచ్చారన్నారు. దేవినేని నెహ్రూ.. రంగా హత్య కేసులో ముద్దాయి అయితే ఆయన కుమారుడిని అక్కున చేర్చుకోవడంలో అర్థమేమిటన్నారు. రాధా హత్యకు కుట్ర పన్ని రెక్కీ నిర్వహించిన అరవసత్యం వైసీపీ విజయవాడ శాఖ ఫ్లోర్ లీడర్ కాదా? అని ప్రశ్నించారు. వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణకు వెళ్లినవారిపై జగన్ చిందులు తొక్కలేదా?.. కాపుల ఓట్లతో గెలిచి  కాపులకు ఏం చేశారన్నారు. కాపుల బాగోగుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. వైసీపీ హత్యా రాజకీయాల్లో భాగంగానే టీడీపీ యువనేత వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Updated Date - 2021-12-31T17:35:49+05:30 IST