సందడే.. సందడి..

ABN , First Publish Date - 2022-01-01T04:52:30+05:30 IST

పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి ఆహ్వాన వేడుకతో మార్కెట్‌ సందడిగా ఉంది.

సందడే.. సందడి..
జంగారెడ్డిగూడెం పట్టణంలో అమ్మకానికి ఉంచిన కేక్‌లు

మార్కెట్‌లో నూతన సంవత్సర కళ


జంగారెడ్డిగూడెం/కొవ్వూరు, డిసెంబరు 31: పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి ఆహ్వాన వేడుకతో మార్కెట్‌ సందడిగా ఉంది. పట్టణాలు గ్రామాల్లో సైతం శుక్రవారం నాడు పూల దుకాణాలు, కేక్‌లు, రంగులు, ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణా లు వెలిశాయి. నూతన సంవత్సరం వేడుక ఆనందోత్సవాల మధ్య జరుపుకునేందుకు రంగవల్లులు వేసేపనిలో మహిళలు ఉంటే స్నేహితులకు, తోటివారికి శుభాకాంక్షలు తెలిపేందుకు కేక్‌లతో యువతరం సన్నద్ధమైంది. ఉదయం నుంచి మద్యం అమ్మకాలు, మందుబాబుల హడావుడితో పట్టణాలు, గ్రామా ల్లో సందడి నెలకొంది. జంగారెడ్డిగూడెం, కొవ్వూరు పట్టణాల్లోని ప్రధాన సెంటర్లలో ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణాలను చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. వివిధ రకాల మాంసాహార వంటకాలను విక్రయించారు. కేక్‌లు, స్వీట్‌లు, పండ్ల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.


కేక్‌లు.. ఆఫర్లు..


 నూతన సంవత్సర వేడుకలకు యువకులు విరివిగా ఉపయోగించే కేక్‌ల విక్రయంతో బేకరీలన్నీ బిజీగా ఉన్నాయి. వివిధ రకాల కేక్‌లు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చి మరీ విక్రయించారు. కేజీ నుంచి 10 కేజీలపైగా కేక్‌లను ప్రత్యేక ఆకర్షణలో తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటి కోసం రెండు మూడు రోజుల క్రితమే ఆర్డర్‌ తీసుకుని తయారు చేశారు. పుష్ప గుచ్చాలు, స్వీట్స్‌ దుకాణాలు కూడా కిటకిటలాడాయి.


ఘుమఘుమలు..


పట్టణాలు, గ్రామాల్లో వెలిసిన బిరియానీ, మాంసాహార వంటకాల దుకాణాల్లో ఘుమఘుమలు నోరూరించాయి. చికె న్‌, మటన్‌, రొయ్య, చేపలు, పీత తదితర మాంసాహార వంటకాలతో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. దుకాణాదారుల మధ్య పోటీ పెరిగి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. నిత్యం హోటల్స్‌లో బిర్యానీ రూ.150 ఉంటే రూ.99 ధరకే అందిస్తున్నారు.


మందు బాబులు ఫుల్‌ జోష్‌


డిసెంబర్‌ 31వ తేదీ మందుబాబులకు పెద్ద పండుగే. ఉదయం నుంచి మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. పాత సంవత్సరాన్ని ఒక బాటిల్‌తో బైబై చెప్పి కొత్త సంవత్సరాన్ని మరో బాటిల్‌తో ఆహ్వానించే పనిలో మందుబాబులున్నారు.Updated Date - 2022-01-01T04:52:30+05:30 IST