మార్కెట్‌లో కొత్త సందడి

ABN , First Publish Date - 2021-12-31T05:04:23+05:30 IST

గత రెండేళ్లగా ఫోన్‌లోనే శుభాకాంక్షలు.. అడుగుతీసి అడుగు వేయకుండా చేసింది కరోనా.. ఎవరిని కలిస్తే ఏమవుతుందోనని భయం భయం మధ్య గడిపారు..

మార్కెట్‌లో కొత్త సందడి
భీమవరంలో తయారైన కేక్‌లు

కళకళలాడుతున్న మార్కెట్‌
వ్యాపారుల ఆఫర్ల వల
పెరిగిన పండ్లు, పవ్వుల ధర
బిర్యానీ పాయింట్లకు ఆర్డర్లు
వీడిన కరోనా భయం
ముందస్తు ఏర్పాట్లలో జనంగత రెండేళ్లగా ఫోన్‌లోనే శుభాకాంక్షలు.. అడుగుతీసి అడుగు వేయకుండా చేసింది కరోనా.. ఎవరిని కలిస్తే ఏమవుతుందోనని భయం భయం మధ్య గడిపారు.. అయితే ప్రస్తుతం ఒమైక్రాన్‌ ఉన్నా.. అది ఇంకా అక్కడక్కడా ఉంది.. దీంతో జనం న్యూఇయర్‌ వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.. మార్కెట్‌కు తగినట్టే వ్యాపారులు సిద్ధమవుతున్నారు.. బిర్యానీ పాయింట్ల నుంచి బేకరీ యజమానుల వరకూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.. పువ్వులు.. పండ్లు, కేక్‌ల ధరలు మాత్రం చుక్కలనంటాయి.. అయినా జనం మాత్రం రెండేళ్ల తర్వాత  కొత్త సంవత్సరాన్ని వేడుకగా చేసుకునేందుకే తగ్గేదేలే అంటున్నారు. మరో 24 గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగిడుతున్న వేళ మార్కెట్‌పై ప్రత్యేక కథనం..
నరసాపురం/భీమవరంటౌన్‌, డిసెంబరు 30 :
మార్కెట్‌లో న్యూ ఇయర్‌ సందడి నెలకొంది. మరి కొన్ని గంటల్లో వచ్చే కొత్త సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకునేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు.కొత్త సందడిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ఇప్పటికే వ్యాపారులు పండ్లు, స్వీట్స్‌ స్టాక్‌ను భారీగా సిద్ధం చేశారు. ఇటు బేకరీలలో కూడా భారీగా కేక్‌లను తయారు చేసి ఉంచారు.ఇక హోటళ్లదీ అదే దారి. కొన్ని రెస్టారెంట్టు రూ.300 లకు రెండు బిర్యానీ ఆఫర్లు ప్రకటించాయి. చిన్న హోటల్‌ వ్యాపారులు కూడా బిర్యానీలు, చికెన్‌ వంటకాలను కొత్త ఏడాదికి తయారు చేస్తు న్నారు.ఆఫర్లను ప్రకటిస్తూ శుక్రవా రం నుంచే పట్టణ, మండలంలో మైక్‌ ప్రచారాన్ని  హోరెత్తిం చారు. ఇక పండ్ల వ్యాపారులు గతంలో మాదిరిగా యాపిల్‌, కమల వంటి పండ్లను భారీగా స్టాక్‌ పెట్టారు. పూల వర్తకులు వందల సంఖ్యలో బొకేలను తయారు చేసి ఉంచా రు. పట్టణంలోని అన్ని బేకరీల్లో సందడి నెలకొంది. 31వ తేదీ రాత్రి కేక్‌ కట్‌ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చారు. వీటన్నంటినీ గురువారం నుంచే సిద్ధం చేస్తున్నారు. స్వీట్‌, బేకరీ, హోటళ్లు విద్యుద్దీపాలతో అలంకరించారు.ఇదిలా ఉంటే పండ్ల ధరలు చుక్కలనంటాయి. నిన్న మెన్నటి వరకు రూ.20 ఉన్న యాపిల్‌ రూ.50కు చేరింది. కమలాఫలం ధర కూడా అంతే పెద్ద కాయ రూ.25 చొప్పున అమ్ముతున్నారు. ఈసారి కేక్‌ల ధరలు  పెరిగాయి. గతేడాది కేజీ రూ.250లకు అమ్మకా లు జరగ్గా,ఈసారి కేజీ కేక్‌ రూ. 280 నుంచి విక్రయిస్తు న్నారు. కూలింగ్‌ కేక్‌ కేజీ రూ. 600లు, ఎగ్‌లెస్‌ కేక్‌ కేజీ రూ.330లకు అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల కేజీ కేక్‌ కొంటే డ్రింక్‌ బాటిల్‌ ఫ్రీ వంటి ఆఫర్లు పెడుతున్నారు. అలాగే పుడ్‌కు సంబందించి కూడా ఆఫర్లు పెడుతున్నారు.


బహిరంగ ప్రదేశాల్లో కొత్త వత్సర వేడుకలు చేస్తే కేసు : సీఐ


 భీమవరం క్రైం, డిసెంబరు 30 : నూతన సంవత్సర వేడుకలని శుక్రవారం రాత్రి ఎవరైనా హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని భీమవరం వన్‌టౌన్‌ సీఐ కృష్ణభగవాన్‌ అన్నారు. గతంలో వేడుకలని చాలా మంది యువత ప్రమాదాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు. అసలే ఒక పక్క కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌లు వెంటాడుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు జరపకూడదని హెచ్చరించారు. హోటల్స్‌, రెస్టారెంట్లు నిబంధనలు పాటించాలని సూచించారు. ఒకే వాహనంపై ముగ్గురు ఎక్కి హారన్‌లు మోగిస్తూ నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు.  

వేడుకలకు దూరంగా ఉంటా :  ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల


నూతన సంవత్సర వేడుకలకు తాను దూరంగా ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానా యుడు గురువారం తెలిపారు. ఎవరూ నూతన వత్సర శుభాకాంక్షలు తెలియచేయడానికి తన కార్యాలయం  వద్దకు రావద్దని విజ్ఞప్తి చేశారు.ఎవరూ రావొద్దు :  మోషేన్‌రాజు, మండలి చైర్మన్‌

నూతన సంవత్సరం సందర్భంగా తనను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేం దుకు ఎవరూ రావొద్దని మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు పేర్కొన్నారు. జనవరి ఒకటవ తేదీన తాను భీమవరంలో అందుబాటులో ఉండడం లేదన్నారు.  
Updated Date - 2021-12-31T05:04:23+05:30 IST