మురుగు కాల్వలోకి మినీ వ్యాన్‌

ABN , First Publish Date - 2021-12-19T06:26:59+05:30 IST

ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి.. మురుగునీటి కాల్వలోకి ఓ మినీ లారీ దూసుకెళ్లింది. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో పెనుముప్పు తప్పింది.

మురుగు కాల్వలోకి మినీ వ్యాన్‌
ప్రమాదానికి గురైన వ్యాన్‌..

25 మందికి స్వల్ప గాయాలు.. పలువురికి అస్వస్థత

నరసాపురం, డిసెంబరు 18 : ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి.. మురుగునీటి కాల్వలోకి ఓ మినీ లారీ దూసుకెళ్లింది. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో పెనుముప్పు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో వున్న 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి.ఈ ఘటన నరసాపురంలో శనివారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో జరిగింది. సీఐ శ్రీనువాస యాదవ్‌ తెలిపిన వివరాలివి..మొగల్తూరు మండలం ముత్యాలపల్లి చింతరేవుకు చెందిన 24 మంది పట్టణంలోని స్టేషన్‌పేట ప్రాంతానికి వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చారు. తిరిగి సాయంత్రం వీరంతా ఇళ్లకు వెళ్లేందుకు మినీ వ్యాన్‌ ఎక్కారు. క్రిస్టియన్‌ పేట మీదుగా అడ్డదారిలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించ బోయి వ్యాన్‌ కాల్వలోకి దూసుకుపోయింది. వ్యాన్‌లో వున్న కార్మికుల ఆర్తనాదాలు విని స్థానికులు ఘటనా స్థలానికి పరుగులు తీసి, నీటిలో పడిన వారిని రక్షిం చారు. డ్రైవర్‌తో కలిపి 16 మంది పురుషులు, 9 మంది స్ర్తీలు ఉన్నారు. వీరిలో కొందరు స్వల్పంగా గాయపడగా, మరికొందరు మురుగునీటిని తాగడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసయాదవ్‌, ఎస్సై నాగేశ్వరరావు పలువురు సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని అంబులెన్స్‌ సిబ్బంది సహకారంతో ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. డ్రైవర్‌ ముత్యాలరావు, తిరుమాని లక్ష్మణరావు, తిరుమాని ఏసురాజు, సూర్యకాంతం, ఏసు, కె.నాగమణి, కె.సత్యనారాయణ, టి.ఏడుకొండలు, టి.సాయి,వి.రావు, కె.అనసూయ, కొల్లాటి నాగమణి, కె.కుమారి గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  Updated Date - 2021-12-19T06:26:59+05:30 IST