మినీ గోకులం బిల్లులిస్తారా..?
ABN , First Publish Date - 2021-07-21T05:09:10+05:30 IST
టీడీపీ ప్రభుత్వం 2018 సంవత్సరంలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు మినీ గోకులం పథకం ప్రవేశపెట్టింది.
మూడేళ్లుగా పాడి రైతుల ఎదురు చూపు
అప్పులు చేసి షెడ్లు నిర్మించాం..
మా సొమ్ము.. మాకిప్పించండి
ఏలూరు టూటౌన్ :
‘‘మూడు నెలల్లో చెల్లిస్తామన్నారు. మూడేళ్లు దాటిపోయింది. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేదు. బిల్లులు చెల్లించాలంటూ పాడి రైతులు పశుసంవర్ధక శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. కలెక్టరేట్, పశుసంవర్ధకశాఖ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టి ధర్నాలు నిర్వహించాం. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు.’’ ఇదీ జిల్లాలో మినీ గోకులం పథకంలో షెడ్లు నిర్మించుకున్న పాడి రైతుల ఆవేదన.
టీడీపీ ప్రభుత్వం 2018 సంవత్సరంలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు మినీ గోకులం పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రారంభించి షెడ్లు నిర్మించుకున్న రైతులకు సొమ్ములు చెల్లించే సమయానికి ఎన్నికలు వచ్చాయి. ముందు షెడ్లు నిర్మించుకోండి.. వెంటనే మేం డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైతులు అప్పులు తెచ్చి మరీ షెడ్లు నిర్మించుకున్నారు. అంతేకాకుండా రైతు వాటా సొమ్ము కూడా చెల్లించారు. ఎన్నికలు రావడం..కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో తమ బిల్లులు వస్తాయని ఆశించారు.ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వం మినీ గోకులాల మాట ఎత్తకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పాడి రైతులకు వచ్చే అరకొర ఆదాయం వడ్డీలకే సరిపోతోంది. పాడిరైతులను ప్రోత్సహించి అధిక పాల దిగుబడి సాధించి రైతులు ఆర్ధికంగా ఎదిగేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.. పాడి పశువులు అధిక పాల దిగుబడి ఇవ్వాలంటే మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశ్యంతో వాటికి షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మినీ గోకులం షెడ్ల ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఈ పథకాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసింది. ఉపాధి హామీ నిధుల నుంచి షెడ్లకు డబ్బులు చెల్లించే విధంగా పథకాన్ని రూపొందించారు. పాడి పశువుల సంఖ్యను బట్టి మూడు రకాలుగా షెడ్ల నిర్మా ణానికి ప్రభుత్వం ప్రణాళిక వేసింది. రెండు పశువుల కోసం షెడ్డు నిర్మాణానికి లక్ష రూపా యలు, నాలుగు పశువుల కోసం లక్షన్నర రూపాయలు, ఆరు పశువుల కోసం లక్షా 80 వేలు చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో రైతు వాటాగా పది శాతం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో 90 శాతం ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు. రైతులు తమ వాటాగా పది శాతం డీడీల రూపంలో చెల్లించారు.
4,247 దరఖాస్తులు
జిల్లా వ్యాప్తంగా 4,247 ధరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4,086 దరఖాస్తులు అర్హత కల్గిన విగా గుర్తించారు. వీటిలో 649 మంది రెండు పశువుల షెడ్డు నిర్మాణానికి, నాలుగు పశువుల షెడ్డుల నిర్మాణం కోసం 1112 మంది, ఆరు పశువుల షెడ్డు నిర్మాణానికి 2486 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
అప్పులు చేసి నిర్మించాం
దాసరి సతీష్, పాడి రైతు, గొల్లగూడెం, ఉంగుటూరు మండలం
ఆరు పశువుల కోసం 2018వ సంవత్సరంలో షెడ్డు నిర్మించాం. రైతు వాటాగా 18 వేల రూపాయలు డీడీ తీసి దరఖాస్తుతో పాటు చెల్లించాం. షెడ్డు నిర్మాణానికి దాదాపుగా రెండు లక్షల రూపాయలు అయ్యింది. అప్పులు చేసి షెడ్డు నిర్మించాం. మూడేళ్ళ నుంచి వడ్డీలు కడు తున్నాం. ప్రభుత్వం ఇంత వరకూ ఒక్క పైసా మంజూరు చేయలేదు. బిల్లులు చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలి.
ఎన్నో పోరాటాలు చేశాం
శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి
బిల్లులు చెల్లించాలంటూ మూడేళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. వందలాది మంది రైతులతో అనేక సార్లు పశుసంవర్ధకశాఖ కార్యాలయం వద్ద, జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించాం. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పెద్దలకు రైతుల పట్ల కనీసం కనికరం లేకుండా పోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లులు చెల్లించి రైతులను ఆదుకోవాలి.
త్వరలో బిల్లులు చెల్లిస్తాం
డాక్టర్ జి.నెహ్రూ బాబు, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ
మినీ గోకులం షెడ్డులు నిర్మించుకున్న పాడి రైతులకు త్వరలో బిల్లులు చెల్లిస్తాం. జిల్లాలో 12 కోట్ల 8 లక్షల 84 వేల రూపాయలు రైతులకు చెల్లించాలి. వీటిలో ముందుగా పూర్తి స్ధాయిలో షెడ్లు నిర్మించుకున్న వారికి 6 కోట్ల 69 లక్షల 21 వేల రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసంపూర్తిగా ఉన్న మిగిలిన షెడ్లకు 5 కోట్ల 39 లక్షల 63 వేల రూపాయలు విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా ఉంది.