తెలంగాణ నుంచి తరలివస్తున్న మద్యం

ABN , First Publish Date - 2021-12-31T05:24:41+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం మందు బాబులకు కిక్‌..! అక్రమార్కులకు లక్‌..!!

తెలంగాణ నుంచి తరలివస్తున్న మద్యం
రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులో తనిఖీ

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం మందు బాబులకు కిక్‌..! అక్రమార్కులకు లక్‌..!! చెక్‌పోస్ట్‌ ఉన్నా.. తనిఖీలు సాగుతున్నా అక్కడి మద్యం ఇక్కడ ప్రవహిస్తోంది. దీనితోపాటు మారుమూల ప్రాంతాల నాటు సారా కూడా యథేచ్ఛగా తరలుతోంది. నిత్యం అధికారులు, సిబ్బంది తనిఖీ చేయడంతో దాదాపు ప్రతీరోజు  కేసులు నమోదవుతున్నాయి. కేసులు కడుతున్నా అక్రమ తరలింపు ఎందుకు కట్టడి కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. తనిఖీలు, కేసులను అక్రమార్కులు లెక్కచేయడం లేదా? లెక్క ముట్టజెబుతున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమార్కులకు ‘కొందరి’ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా లేకపోలేదు. తెలంగాణ మద్యం, నాటు సారాతో పాటు ఇసుక కూడా తరలుతోందని, అప్పుడప్పుడు మాత్రమే ఇసుక పట్టుబడుతుందని పలువురు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.



జీలుగుమిల్లి, డిసెంబరు 30: తెలంగాణ మద్యం అడ్డదారుల్లో అక్రమంగా తరలి వస్తోంది. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల్లో అధికారులు వాహన తనిఖీ చేస్తున్నా అక్రమార్కులు అడ్డదారుల్లో తరలిస్తున్నారు. పలుసార్లు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలైన వారు కొందరైతే.. సిబ్బంది కళ్లుకప్పి బైక్‌లు, కార్లు, ట్రక్కు ఆటోల్లో తెలంగాణ నుంచి తరలిస్తున్నవారు కొందరు. జాతీయ రహదారిపై ఆంధ్ర తెలంగాణ సరిహద్దు తాటియాకులగూడెం వద్ద 24 గంటల పాటు ఎస్‌ఇబీ, పోలీస్‌, ఏఆర్‌, ఎస్పీవో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాలైన కామయ్యపాలెం, రాచన్నగూడెం గ్రామాల్లో చెక్‌పోస్టుల వద్ద రాత్రి వేళ తనిఖీలు అంతంతమాత్రం అని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ విధుల నిర్వహణకు సిబ్బంది కొందరు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఎవరైనా ఒకటి రెండు మద్యం సీసాలు తెచ్చుకునే క్రమంలో తనిఖీ సిబ్బంది వారి వద్ద బాటిళ్లు లాక్కుని పంపించేస్తున్నారని, గట్టిగా నిలదీస్తే కేసులు పెడతామని చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నూతన సంవత్సరం వేడుక, సంక్రాంతి పండుగ సమీపించడంతో మందుబాబులు తెలంగాణ మద్యం కోసం ఉత్సాహంతో ఉన్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు ప్రత్యేక బ్రాండ్‌ల మద్యం తరలిస్తున్నట్లు సమాచారం.


వేధిస్తున్న సిబ్బంది కొరత


మద్యం అక్రమ రవాణా చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నా సిబ్బంది కొరత ప్రధాన సమస్య అని శాఖాపరంగా తెలుస్తోంది. తెలంగాణ మద్యం అక్రమ రవాణా నిరోధించడంలో ఎస్‌ఈబీని సిబ్బంది కొరత వేధిస్తోంది. 2014 నుంచి ఆ శాఖలో ఖాళీలు భర్తీచేయక పోవడంతో తనిఖీలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల రాత్రి పగలు విధులు నిర్వహిస్తున్న చెక్‌పోస్ట్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో ఇసుక అక్రమ రవాణా, సారాపై నిఘా, తనిఖీ చేయలేకపోతున్నారు. ఇసుక, సారా తయారీ, అమ్మకందారులపై కేసులు తక్కువ నమోదు కావడం గమనార్హం.


మద్యం అక్రమ రవాణాపై నిఘా

జీలుగుమిల్లి, టి.నరసాపురం, చింతలపూడి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. ఆయా మండలాల్లో ఎస్‌ఈబీ ఏఎస్పీ ఆధ్వర్యంలో 42 మంది ఎస్పీవోలు పనిచేస్తున్నారు. రెండు విడతలుగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరులో 47 కేసులు నమోదు చేశాం. 48 మందిని అరెస్టు చేసి 420 లీటర్ల సారా, 72 లీటర్ల తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్నాం. పలు కేసులకు సంబంధించి 11 వాహనాలు సీజ్‌ చేశాం. మద్యం అక్రమ రవాణా, సారా, గుట్కా నిల్వలు, రవాణాపై 86397 89431 నెంబరుకు తెలియజేసి సహకరించాలి.

మణికంఠ రెడ్డి, ఎస్‌ఈబీ చెక్‌పోస్ట్‌ ఇన్‌చార్జి సీఐ

Updated Date - 2021-12-31T05:24:41+05:30 IST