చిరిగిన బ్యాగ్‌లు.. ఊడిన జిప్‌లు!
ABN , First Publish Date - 2021-12-15T05:32:59+05:30 IST
జగనన్న విద్యా కానుకల కింద ప్రభుత్వం విద్యార్థులకు నాసిరకం బ్యాగ్‌లను పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది.

నాసిరకంగా జగనన్న విద్యా దీవెన బ్యాగ్‌లు
నాణ్యత లేవని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ
ఏలూరు రూరల్, డిసెంబరు 14 : జగనన్న విద్యా కానుకల కింద ప్రభుత్వం విద్యార్థులకు నాసిరకం బ్యాగ్‌లను పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు అందించిన బ్యాగ్‌లు కొంతకాలానికే అధిక సంఖ్యలో చిరిగిపోయాయి. మరికొన్నింటికి జిప్పులు పనిచేయడం లేదు. కొన్ని చోట్ల చిరిగిన బ్యాగ్‌లతో విద్యార్థులు పాఠశాలలకు వస్తుండగా, మరికొన్నిచోట్ల పాత బ్యాగ్‌లతో హాజరవుతున్నారు. జగనన్న విద్యా కానుకల కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాగ్, నోట్ పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు, బూట్లు, సాక్సులు అందజేశారు. ఏలూరురూరల్ మండలంలో ఈ ఏడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు 10 వేల 50 మంది విద్యార్థులకు కిట్‌లు అందించారు. ఎంపీపీ పాఠశాలలు 42, యూపీ పాఠశాలలు 10, జడ్పీ పాఠశాలలు తొమ్మిది ఉండగా మొత్తం 10,052 మంది విద్యార్థులు ఉన్నారు. ఆగస్టులో పాఠశాలలు తెరుచుకోగా సెప్టెంబరు, అక్టోబరులలో విద్యార్థులకు కిట్‌లు అందించారు. ఈ ఏడాది అందించిన బ్యాగ్‌లు నాసిరకంగా ఉన్నాయి. ఆదిలోనే చాలా మంది ఉపాధ్యాయులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సెంట్రలైజ్డ్ కొనుగోలు కావడంతో జిల్లాస్థాయి విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేకపోయారు. పంపిణీ చేసిన కొన్ని నెలలకే చాలాచోట్ల బ్యాగ్‌లు చిరిగిపోవడం, లేదా జిప్పులు పనిచేయకుండా పోవడంతో ఆయా పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. కొన్నిచోట్ల చిరిగిపోయిన బ్యాగ్‌లు వెనక్కి ఇచ్చేశారు. మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు నచ్చ చెప్పడంతో చిరిగిన బ్యాగ్‌లతోనే పాఠశాలలకు వస్తున్నారు. నాణ్యతలేని బ్యాగ్‌లు అందించడంతోనే ఈ దుస్థితి దాపురించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు నాసిరకం బ్యాగ్‌లు అందించారని మండిపడుతున్నారు.
