ఆసుపత్రుల్లో బెడ్‌ల కష్టాలు
ABN , First Publish Date - 2021-05-08T05:36:21+05:30 IST
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రులలో బెడ్‌ల ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

పెరుగుతోన్న కేసులతో బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన
తణుకు,మే 7 : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రులలో బెడ్‌ల ఇబ్బందులు ఎక్కువయ్యాయి. రోజువారి పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు ఆసుపత్రులలో చేరాలంటే బెడ్ కోసం ముందుగా సంబంధిత ఆసుప త్రి వర్గాలను, ప్రజాప్రతినిదులను ఆశ్రయిస్తే తప్ప సామాన్యంగా బెడ్ దొరికే పరిస్థితి లేదు. కొంతమందికి ఆక్సిజన్ అవసరమైతే మరింత కష్టం తప్పడం లేదు. ప్రభుత్వం కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి నోడల్ అధికారులను నియమించింది. ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నప్పటికి, వచ్చిన రోగులకు బెడ్ ఇవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులకు ఆక్సిజన్‌స్థాయి తక్కువగా ఉన్నా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వెంటనే ఇతర ఆసుపత్రులకు తీసుకువెళ్లాలని సూచించ డంతో చాలామంది రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తణుకు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కొవిడ్ వైద్యం అందించడానికి 9 ప్రైవేట్ ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఆయా ఆసుపత్రులలో 520 బెడ్‌లు ఉండగా కొవిడ్‌కు 226 బెడ్‌లను కేటాయించారు. అత్యవసర విభాగం లో ఆక్సిజన్‌తో 44, ఆక్సిజన్ లేకుండా 10 బెడ్‌లు కేటాయించారు. క్యాజువాలిటీలో ఆక్సిజన్‌తో 55, ఆక్సిజన్ లేకుండా 117 బెడ్‌లు కేటాయించారు. వైద్యులకు సంబంధించి జనరల్ మెడిసన్ ఏడుగురు, మత్తు డాక్టర్‌లు ఐదుగురు, ఎంబీబీఎస్ 13 మంది, నర్సింగ్ సిబ్బంది 100 మంది సేవలు అందిస్తున్నారు. కేటాయించిన పడకలకు మించి రోగులు రావడంతో ఆసుపత్రులలో బెడ్‌లు కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ సమస్య తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ బెడ్‌లు పెంచాలని పలువురు కోరుతున్నారు.