కోర్టులే దిక్కు

ABN , First Publish Date - 2021-10-08T05:22:59+05:30 IST

జిల్లాలో వందలాది మంది మాజీ ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

కోర్టులే దిక్కు

నాడు ఉపాధి పనులు – నేడు నీరు– చెట్టు

బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వ ఇబ్బందులు

జిల్లాలో రూ.100 కోట్ల బకాయిలు

హైకోర్టును ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు  


 తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జగన్నాథపురం మాజీ సర్పంచ్‌ ముత్యాల సత్యనారాయణ టీడీపీ హయాంలో ఉపాధి హామీ, నీరు – చెట్టు పనులు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి బిల్లులు నిలిపివేసింది. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం  దిగొచ్చి రెండున్నరేళ్ల తర్వాత బిల్లులు ఇచ్చింది. ఇప్పుడు నీరు – చెట్టు పథకం కింద చేసిన పనులకు మరో రూ.60 లక్షలు రావాల్సి ఉంది. దీనిపై అధికారులు ఎవరూ నోరు విప్పకపోవడంతో చేసేది లేక ఆయన మళ్లీ హైకోర్టు తలుపు తట్టారు. బకాయి పడిన బిల్లులు ఇప్పించాలని కోరారు. 


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వందలాది మంది మాజీ ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వానికి చేయని విజ్ఞప్తులు లేవు. కార్యాలయాల వద్ద చేసిన ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కదలించలేక పోయాయి. చివరకు కాంట్రాక్టర్లు, టీడీపీ తరపున మరికొందరు తమకు రావాల్సిన బిల్లులపై వాస్తవ పరిస్థితిని హైకోర్టును ముందుంచారు. ఉన్నత న్యాయ స్థానం వేసిన మొట్టికాయలకు ప్రభుత్వం దిగి వచ్చి తాజాగా వడ్డీతో సహా ఉపాధి బిల్లులు చెల్లిస్తోంది. 


రూ.100 కోట్ల బకాయిలు

ఇప్పుడు నీరు–చెట్టు పథకం బిల్లులపైనా ప్రభుత్వం ఇదే ధోరణితో వ్యవహరిస్తుండడంతో కాంట్రాక్టర్లు మళ్లీ కోర్టుబాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్ల మేర బకాయిలుండగా, ఒక్క జిల్లాలోనే రూ.100 కోట్ల చెల్లించాలి. అప్పట్లో కాంట్రాక్టర్లు రానిచోట నీటి సంఘాల ఆధ్వర్యంలోనే పనులు చేశారు. చెరువుల్లో పూడిక తీత, పంట పొలాల్లో సారవంతమైన మట్టి తరలింపు వంటి పనులు నిర్వహిం చారు. మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ పరిధిలో జిల్లావ్యాప్తంగా 1425 చెరువుల్లో మట్టి పూడిక తీశారు. అదే మట్టిని కొంద రు రైతులు తమ పొలాల్లో పూడిక కోసం ఉపయోగిం చారు. చెరువు గట్లను పటిష్టం చేశారు. పంట కుంటలను తవ్వా రు. తాడిపూడి, పశ్చిమ డెల్టా పరిధి లోనే అనేక కాలువల్లో నీరు – చెట్టు పథకం లోనే పూడిక పనులు నిర్వహించారు. ఆ బిల్లులు చెల్లించా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. గ్రామాల్లో కేవలం మంచినీటి చెరువుల తవ్వకాలను ఉపాధి నిధులతో చేపట్టా రు. వాటిని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించారు. మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు, కాలువల్లో పూడికతీత పనులకు మాత్రం రాష్ట్రం నిధులు విడుదల చేసేది. గత ప్రభుత్వ హయాంలో బిల్లులన్నీ మంజూరయ్యాయి. చివరి దశలో చేపట్టిన పనులకు మాత్రం చెల్లించలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వమే బిల్లులను చెల్లించాలి. ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో నీరు–చెట్టు పనుల బిల్లులు చెల్లించాలంటూ ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. 


అమ్మో ప్రభుత్వ పనులా..?

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్‌ శాఖ పనులంటే  కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. కొత్త పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. గడచిన వేసవిలో పశ్చిమ డెల్టా పరిధిలో మరమ్మతులు చేయించేందుకు అధికారులు ఆపసోపాలు పడ్డారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే  ఈ శాఖవైపు కాంట్రాక్టర్‌లు కన్నెత్తి చూడరు.  


పట్టణాల్లోని పనులపైనా..!

పాలకొల్లు : జిల్లాలోని ఏలూరు నగరం సహా అన్ని పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో గత ప్రభుత్వంతోపాటు, ఈ ప్రభుత్వ హయాంలోను కాంట్రాక్టర్లు చేసిన పనులకు రూ.162 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా సొమ్ములు అందకపోవడంతో చాలామంది కోర్టును ఆశ్రయించారు. నవంబర్‌ రెండో తేదీలోగా వీరందరి బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  పట్టణాల వారీగా చెల్లించాల్సిన బకాయిలు.. ఏలూరులో రూ.37 కోట్లు, భీమవరం రూ.26 కోట్లు, పాలకొల్లు రూ.14 కోట్లు, తాడేపల్లిగూడెం రూ.22 కోట్లు, తణుకు రూ.14 కోట్లు, నరసాపురం రూ.8 కోట్లు, కొవ్వూరు రూ.6 కోట్లు, నిడదవోలు రూ.7 కోట్లుతోపాటు మిగిలిన నగర పంచాయతీల్లోనూ బకాయిలు చెల్లించాల్సి ఉంది.  దీంతో కాంట్రాక్టర్లంతా బిల్లులు రావాలంటే కోర్టును ఆశ్రయించాల్సిందేననే భావనలో ఉన్నారు. 


ఉపాధి బకాయిలు రూ.150 కోట్లు

జిల్లాలో ఉపాధి పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.150 కోట్లకు పైమాటే. రాష్ట్రవ్యాప్తంగా వున్న బకాయిలను నాలుగు వారాల వ్యవధిలో వడ్డీతోపాటుచెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.


Updated Date - 2021-10-08T05:22:59+05:30 IST