కమిషనర్ కాటంనేని వ్యాఖ్యలపై నిరసన
ABN , First Publish Date - 2021-05-21T04:29:17+05:30 IST
నిరంతరం కష్టపడి పనిచేస్తున్న వైద్య సిబ్బందిపై కాంటనేని భాస్కర్ నిందనలు వేయడం తగదని వైద్య సిబ్బంది మండిపడ్డారు.

ఆచంట మే 20 : నిరంతరం కష్టపడి పనిచేస్తున్న వైద్య సిబ్బందిపై కాంటనేని భాస్కర్ నిందనలు వేయడం తగదని వైద్య సిబ్బంది మండిపడ్డారు. ఈ మేరకు ఆచంట వేమవరం పీహెచ్‌సీ పరిధిలోని కొడమంచిలి సబ్ సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద గురువారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర కమిషనర్ కాంటనేని భాస్కర్ తమను తీవ్రంగా అవమానించారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆకివీడు : కరోనా నియంత్రణకు ఆరోగ్యశాఖ ఎంతో కష్టపడి పనిచేస్తుంటే కమిషనర్ కాటంనేని భాస్కరరావు పనిచేయడంలేదని అనడం బాధాకరమని పీహెచ్‌సీ సూపరింటెండెంట్ మెహరున్నీసా బేగం అన్నారు. స్థానిక పీహెచ్‌సీ సబ్ సెంటర్ దగ్గర గురువారం నల్లరిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. ఇంటి దగ్గర భర్త, పిల్లలు, తల్లిదండ్రులను వదిలేసి ప్రాణాలు పణంగా పెట్టి కరోనా సేవలందిస్తుంటే ఇటువంటి మాటలతో మానసికక్షోభకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఉన్నారు.
వీరవాసరం : వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తగవని వైద్య సిబ్బంది అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు గురువారం పీహెచ్‌సీ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. హెల్త్‌కేర్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాలకోడేరు : వైద్యఆరోగ్య కమిషనర్ వైద్యసిబ్బందిపై చేసిన అనుచిత వాఖ్యలకు పాలకోడేరు వైద్యసిబ్బంది గురువారం నల్లబ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించారు. కమిషనర్ వాఖ్యలు వెనక్కి తీసుకునేంతవరకు ఇలా నిరసన తెలుపుతూనే ఉంటామని పాలకోడేరు వైద్యసిబ్బంది తెలిపారు.