ఏజెన్సీ, మెట్ట ప్రాంత్రాలో వర్షం జోరు

ABN , First Publish Date - 2021-07-13T04:51:40+05:30 IST

ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో వర్షం జోరు కొనసాగుతోంది.

ఏజెన్సీ, మెట్ట ప్రాంత్రాలో వర్షం జోరు
ముంజులూరులో విరిగిపడిన చింతచెట్టు

పొంగిన వాగులు.. విరిగిపడిన చెట్లు


జీలుగుమిల్లి / బట్టాయగూడెం / కొవ్వూరు / నల్లజర్ల / చాగల్లు / తాళ్ళపూడి / దేవరపల్లి, జూలై 12: ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో వర్షం జోరు కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. జీలుగుమిల్లి సమీప అశ్వారావుపేటవాగు, వంక వారిగూడెం, పి.రాజవరం, లంకాలపల్లి వాగులు వరద ఉధృతికి పొంగా యి. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఇతర మండలాల నుంచి పలువురు సోమవారం సాయంత్రం ఇళ్లకు చేరేందుకు ఇబ్బందులు పడ్డారు. బుట్టాయగూడెం మండలం ముంజులూరు కొండరెడ్డి గూడెంలో 150 ఏళ్ల నాటి చింతచెట్టు మొదలు విరిగి పాఠశాల పక్కనే పడింది. సోమవారం తెల్లవారుజామున పడడంతో పెను ప్రమాదం తప్పింది. సాధారణంగా కొండరెడ్లు ఈ చెట్టు కిందనే పనులు చేసుకుంటుంటారు. వర్షంతో అందరూ ఇళ్లలో ఉండడంతో ప్రమాదం తప్పింది. కొవ్వూరు పట్టణంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపి లేని వర్ష్షంతో జనజీవనం స్తంభించింది. పట్టణం, మండలంలో లోతట్టు, పల్లపు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. నల్లజర్ల మండలంలో నూతనంగా బైపాస్‌ రోడ్డు నిర్మాణంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేదు. చెక్‌ పోస్టు వద్ద మోకాలి లోతు నీరు చేరడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. నబీపేటలో వరి చేను  పూర్తిగా నీట మునిగింది. చీపురుగూడెం, నల్లజర్ల గ్రామాల్లో వరద నీరు రోడ్లపై చేరింది. వాగులు, డ్రెయిన్లు పొంగడంతో వరద నీరు ముంచుతోంది. చాగల్లు మండలంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో సుమారు మూడు గంటల సేపు కుండపోతగా వర్షం కురిసింది. రోడ్లు, డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. తాళ్లపూడి మండలంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు భారీ వృక్షాలు విద్యుత్‌ స్థంబాలపై పడడంతో సుమా రు 10 స్థంబాలు నేలకొరిగాయి. ప్రక్కిలంక సబ్‌స్టేషన్‌ పరిధిలో 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. సోమవారం సాయంత్రం వరకు తాళ్లపూడి, ప్రక్కిలంక, పైడిమెట్ట, కుకునూరు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  దేవరపల్లి మండలం పల్లంట్ల జడ్పీ హైస్కూల్‌లో అన్ని తరగతి గదుల్లో వర్షపునీరు చేరింది. నాడు నేడు పేరిట పనులు చేపట్టినప్పటికి కొన్ని పాఠశాలల్లో చిన్నపాటి వర్షానికే నీరు చేరడంతో విద్యార్థుల తల్లిదం డ్రులు ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.







Updated Date - 2021-07-13T04:51:40+05:30 IST