ముంచిన వాన

ABN , First Publish Date - 2021-08-21T05:02:04+05:30 IST

రహదారులు కాలువలను తలపించాయి..వీధులు చెరువులుగా మారిపోయాయి..

ముంచిన వాన
ముంచేసింది : భీమవరంలో నీట మునిగిన ఫైర్‌స్టేషన్‌ రోడ్డు

2 గంటల పాటు కుమ్మేసిన వాన

నీట మునిగిన పల్లపు ప్రాంతాలు

ముంపులో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు పట్టణాలు 


ఆకివీడు/రూరల్‌/ఉండి/కాళ్ళ/పాలకొల్లుఅర్బన్‌/ పాలకొల్లురూరల్‌ /యలమం చిలి/ ఆచంట/ భీమవరం/రూరల్‌/వీరవాసరం, ఆగస్టు 20 : రహదారులు కాలువలను తలపించాయి..వీధులు చెరువులుగా మారిపోయాయి..చేలు నీటితో నిండిపోయాయి.. పల్లపు ప్రాంతాలు జలమయమ య్యాయి.. శుక్రవారం ఏకధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షంతో జనజీవనం స్తంభిం చింది. ఆకివీడు పట్టణం, మండలం అతలాకుతలమైంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దిగమర్రు –పామర్రు జాతీయరహదారిపై అజ్జమూరు వద్ద, ఆకివీడు –ఏలూ రుపాడు రహదారి, ఆకివీడు – దుంపగడప, ఆకివీడు –పెదకాపవరం రహదారులపై వర్షపు నీరు నిలిచి పోయింది.ఉండి మండలంలో పల్లపు ప్రాంతాలు వాన నీటితో నిండిపోయాయి.కాళ్ళ మండల గ్రామాల్లోని అంతర్గత రహదారులతో పాటు ప్రధాన రాష్ట్రీయ రహదారి సైతం వర్షపు నీటితో కాలువలను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు లాగక రోడ్లు బురదమయం అయ్యాయి.పాలకొల్లు పట్టణం, మండలంలోనూ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సుమారు 11 గంటల వరకూ ఏకబిగిన కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణంలో పలు కాలనీ ల్లోనూ, బస్టాండ్‌ ప్రాంతం, బ్రాడీ పేట, లక్ష్మీనగర్‌, రాజీవ్‌ గాంధీ నగర్‌, రామారావు పేట, హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఏవీ ఎస్‌ కాలనీ, బద్దా వానిపేట కొత్తకాలనీలు నీట మునిగాయి. యలమంచిలి మండలం లో చించినాడ – ఏనుగువానిలంక, యలమంచిలి–ఊటాడ, మేడపాడు –నేరేడుమిల్లి, మేడపాడు –పెను మర్రు ప్రధాన రహదారులు వర్షపునీటితో నిండి, బురదమయంగా మారడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆచంట మండలంలో ఉన్న నక్కల, కొఠాలపర్రు, తాడేరు మరుగు డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. భీమవరం వన్‌టౌన్‌ ప్రాంతంలో గునుపూడి, బ్యాంకు కాలనీ, చినపేట ఏరియా, దిరుసుమర్రు రోడ్డు,  హౌసింగ్‌ బోర్డు కాలనీలలో డ్రెయినేజీ అధ్వానంగా ఉండడంతో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి.చినరంగనిపాలెం, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ఏరియా, నర్సయ్య అగ్రహారం, రైల్వే కాలనీ, మెంటేవారి తోట ప్రాంతంలో ముంపు పరిస్థితి నెలకొంది.టూటౌన్‌ ఏరియాలో దుర్గాపురం, బీసీ కాలనీ, శ్రీరామపురం, బలుసుమూడి ఏరియాలో, రాయలం, చినఅమిరం, ఆదర్శ నగర్‌ ఏరియా పలు ప్రాంతాల్లో ముంపు సమస్య నెలకొంది. డ్రెయినేజీ వ్యవస్థ అఽధ్వానంగా ఉండడంతో భీమవరంలో పలు కాలనీలు ముంపులో ఉన్నాయి.వీరవాసరంలో బొంతువారిపేట జలమయ మైంది. పశ్చిమకాలువలోకి వెళ్లే వర్షపునీరు డ్రెయినేజీ పూడ్చివేయడం వలన ఈ నీరంతా రహదారి పక్కనే ఉన్న జూనియర్‌ కళాశాల, రహదారుల భవనాల శాఖ కార్యాలయంలోనికి చేరాయి. రజకుల వీధి, పెదదళితపేట , వెలమపేటలోని పల్లపు ప్రాంతాలు నీటితో నిండాయి. 


 సార్వా నాట్లు..పాట్లు


భారీ వర్షం కారణంగా సార్వా నాట్లు పల్లపు ప్రాంతాల్లో నిండా మునిగాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని యనమదుర్రు, దిరుసుమర్రు, తాడేరు, బేతపూడి, తుందుర్రు, పెదగరువు ప్రాంతాల్లోని పల్లపు భూముల్లో నాట్లు, వెనుకస్తు నారుమడులు నిండా మునిగాయి. తొలకరిలో వేసిన నారుమడులు భారీవర్షాలకు నష్టపోవడంతో రైతులు తిరిగి రెండో విడత, మూడో విడత నారుమడులు వేశారు. ఇవి కూడా నీటిముంపులో కొనసాగుతున్నాయి. దీని వల్ల సార్వాసాగు మరింత జాప్యమవుతోంది. భీమవరం మండలంలో 40 శాతంలోపు మాత్రమే నాట్లు వేయడం, అది పల్లపు ప్రాంతాలు ముంపునకు గురి కావడంతో ఇంకా నాట్లు వేయాల్సిన రైతులు ఎలా నాట్లు వేయాలా అన్న ఆలోచనలో పడ్డారు. కోస్తాంధ్రలో మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 




Updated Date - 2021-08-21T05:02:04+05:30 IST