నిలిచిన క్రీడలు

ABN , First Publish Date - 2021-11-01T05:21:41+05:30 IST

కరోనా మహమ్మారి క్రీడారంగాన్ని అస్తవ్యస్తం చేసింది.

నిలిచిన క్రీడలు

 నిధుల లేమితో స్కూల్‌ గేమ్స్‌ నిర్వహణపై నిరాసక్తత


ఏలూరు స్పోర్ట్స్‌, అక్టోబరు 31: కరోనా మహమ్మారి క్రీడారంగాన్ని అస్తవ్యస్తం చేసింది. జిల్లాలోని ప్రతిభ గల క్రీడాకారులు నిరాశ, నిస్పృహలతో కొట్టు మిట్టాడుతున్నారు.ఏడాదిన్నరగా సాధనకు దూరం కావడంతో క్రీడాకారులు ఫిట్‌నెస్‌ కోల్పోయారు. బాలలకు శిక్షణా కార్యక్రమాలు లేక ఏడాదిన్నరపాటు ఇంటికే పరిమిత మయ్యారు. కరోనా ప్రభావం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా క్రీడా అకాడమీలకు మంగళం పాడడంతో క్రీడాకారులకు అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు కరోనాతో క్రీడలకు దూరమైన క్రీడాకారులకు మరో వైపు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అందడం లేదు. ఏ అధికారి క్రీడల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు కూడా దృష్టి సారించడం లేదు. అక్కడక్కడా జిల్లా, రాష్ట్రస్థాయిలో  క్రీడాకారులు స్వయం కృషితో రాణిస్తున్నారు. అటువంటి వారికి కూడా ప్రోత్సాహం ఇవ్వడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 16 ఏళ్ల లోపు బాలబాలికల క్రీడలను ప్రోత్సహించేందుకు రూరల్‌ ఉమెన్స్‌ గేమ్స్‌ ప్రవేశపెట్టారు. 2006లో యువ క్రీడా ఔర్‌ ఖేల్‌ అభియాన్‌ పైకా ప్రారం భించారు. 2010లో పైకా రద్దు చేసి రాజీవ్‌ఖేల్‌ అభియాన్‌ ప్రారంభించారు. 2015లో దాన్ని కూడా రద్దుచేసి ఖేలోఇండియా ప్రారంభించారు. 2016లో మాత్రమే ఖేలో ఇండియా మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. రెండేళ్లుగా ఖేలో ఇండియా ఖేల్‌ ఖతమ్‌ అయింది. 


 నిధుల లేమి 


ఏటా స్కూల్‌ గేమ్స్‌ కింద వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, కబడ్డీ పోటీలు నిర్వహించేవారు. మండలస్థాయి పోటీలకు 50 వేలు, జిల్లా స్థాయి పోటీలకు ఐదు లక్షలు, రాష్ట్రస్థాయి పోటీలకు రూ.10 లక్షలు ప్రభుత్వం చెల్లించేది. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో పోటీలు నిర్వహించడం లేదు. దీంతో విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి సన్న గిల్లుతోంది. క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాల్లోనూ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించింది. రెండే ళ్లుగా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.నియోజకవర్గానికిఒక మినీ స్టేడియం నిర్మించాలని గత ప్రభుత్వం భావించింది. అయితే తరువాత ప్రతి మండలానికి ఒక కేవీకే నిర్మించాలని నిర్ణయిం చింది. సగం నిర్మించిన వాటికి బిల్లులు చెల్లించకపోవడంతోమినీ స్టేడియాలు మధ్యలోనే ఆగిపోయాయి. 


 ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు 

– ఎస్‌కే అజీజ్‌, డీఎస్‌కె చీఫ్‌కోచ్‌ 


కొవిడ్‌ ప్రభావంతో క్రీడలు కుదేలయ్యాయి. క్రీడాకారులు నిరాశలో ఉండిపోయారు. మైదానాలు ఇప్పుడిప్పుడే తెరచుకుని క్రీడాకారులు ఆటల బాట పడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి మైదానాల్లో సాధన చేయిస్తున్నాం.క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదించాం. వారానికి ఒక క్రీడకు సంబంధించి పోటీలు నిర్వహిస్తున్నాం. 


 క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి 

  – రాయుడు నవీన్‌, ఫుట్‌బాల్‌ జాతీయ క్రీడాకారుడు


క్రీడల పరిస్థితి దారుణంగా తయారైంది. పాఠశాల నుంచి కాలేజీస్థాయి వరకూ క్రీడలు లేకపోవడంతో క్రీడల్లో రాణించడం కష్టంగా మారింది. ప్రభుత్వం బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించక పోవడంతో క్రీడలకు ప్రాధాన్యం కరువైంది. క్రీడలను దత్తత తీసుకున్న ఒడిశా పదేళ్లలోనే అద్భుత ఫలితాలు సాధించింది. 


 పాఠశాల నుంచి ప్రోత్సహించాలి 

– నవాబ్‌సాహెబ్‌, జాతీయ హాకీ క్రీడాకారుడు 

పాఠశాలస్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాలలో క్రీడామైదానంతో పాటు క్రీడలకు సమయం కేటాయించాలి. ఏ క్రీడాంశమైనా అందులో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి వెళ్లినా స్పాన్సర్స్‌ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రీడలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి. 


Updated Date - 2021-11-01T05:21:41+05:30 IST