చిట్టీలతో మోసగించిన కుటుంబం అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-15T05:40:42+05:30 IST

చిట్టీలు, డిపాజిట్ల పేరుతో పలువురిని మోసగించిన ఓ కుటుంబానికి చెందిన నలుగు రిని అరెస్టు చేశామని ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌ తెలిపారు.

చిట్టీలతో మోసగించిన కుటుంబం అరెస్ట్‌

ఏలూరు క్రైం, డిసెంబరు 14: చిట్టీలు, డిపాజిట్ల పేరుతో పలువురిని మోసగించిన ఓ కుటుంబానికి చెందిన నలుగు రిని అరెస్టు చేశామని ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌ తెలిపారు. ఏలూరుటూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన వివరాలు తెలిపారు. ఏలూరు తంగెళ్ళమూడి ఎంఆర్‌సీ కాలనీకి చెందిన శ్రీరంగం సత్యదుర్గ (42), ఆమె భర్త నాగేశ్వరరావు (48), వారి కుమారులు శ్రీరంగం సుబ్రహ్మణ్యం, అలియాస్‌ నాని (25), శ్రీరంగం దుర్గావెంకటేష్‌ అలియాస్‌ చిన్ని (23) పదమూడేళ్లు గా ఆ ప్రాంతంలో నివశిస్తూ చిట్టీల వ్యాపారానికి రిజిస్ట్రేషన్‌ ఉందంటూ అనధికారికంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఇస్తామని డిపాజిట్లను పలువురి నుంచి సేకరించారు. ఆ తర్వాత గడువు తీరినప్పటికీ సొమ్ములు చెల్లించకపోవడంతో తుమ్మపాల ఈశ్వరరావుతో పాటు మరో 56 మంది ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్‌ సీఐ డి.వి.రమణ, ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు కేసు దర్యాప్తు చేశారు. బాధితుల నుంచి రూ. 80 లక్షలకు పైగా వసూలు చేసి ఇల్లు విడిచి పారిపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. బాధితులను మోసగించిన డబ్బులతో 70 గజాల స్థలంలో మూడంతస్తుల బిల్డింగ్‌, 75 గజాల ఖాళీ ఇంటి స్థలం, రెండంతస్తుల డాబా, 75 సెంట్ల వ్యవసాయ భూములు కొన్నట్టుగా గుర్తించారు. వాటిని సీజ్‌ చేయడానికి కోర్టువారు అనుమతి కోరుతూ పిటీషన్‌ దాఖలు చేస్తున్నామన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన ఇంటి పత్రాలు, చిట్స్‌ తాలూకా పుస్తకాలు, ఏటీఎం కార్డు, పాన్‌ కార్డు, ఎల్‌ఐసీ బాండ్లు, రెండు బంగారపు ఉంగరాలు, రూ.30 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు మోటార్‌ సైకిళ్ళు సీజ్‌ చేశామన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఏలూరు టూటౌన్‌ సీఐ డి.వి.రమణ, సీఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు పాల్గొనారు.

Updated Date - 2021-12-15T05:40:42+05:30 IST