తీరంలో కరోనా ఫియర్‌

ABN , First Publish Date - 2021-05-31T04:34:30+05:30 IST

గత రెండు నెలలుగా తీర ప్రాంతంలో కరోనా ఫియర్‌ నెలకొంది.

తీరంలో కరోనా ఫియర్‌

నరసాపురంలో 2 వేలకు చేరువగా కేసులు

100 మందికి పైగా మృతి

నరసాపురం, మే 30 : గత రెండు నెలలుగా తీర ప్రాంతంలో కరోనా ఫియర్‌ నెలకొంది. పట్టణంలోని వార్డులు, మండలాల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇబ్బిడిముబ్బిడిగా కేసులు నమోదవు తున్నాయి. మొదట్లో పట్టణానికే పరిమితమైన కేసులు నేడు పల్లెలకూ విస్తరించాయి. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవ డమే  కొంపముంచిందన్న వాదనలు వ్యక్తమవుతు న్నాయి. గత నెలలో లాక్‌డౌన్‌ లేకపోవడంతో ప్రజలు విచ్చల విడిగా తిరిగేశారు. ప్రయాణాలు మానలేదు. దీంతో వైరస్‌ నెమ్మది.. నెమ్మదిగా... పెరుగుతూ వచ్చింది. ఈ నెలలో కర్ఫ్యూ అమలు చేసినా పెద్ద ఫలితాన్ని ఇవ్వలేదు. సడలింపు సమయ ంలో ప్రజలు ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మరో పక్క పెళ్ళిళ్లు, శుభకార్యాలు మానడం లేదు. ఇదిలా ఉంటే.. కొవిడ్‌ సోకిన చాలా మంది వైద్య విషయం నిర్లక్ష్యం వహిస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండకుండా బయట  తిరి గేస్తున్నారు. దీని వల్ల వైరస్‌ విస్తరించింది. పట్టణ, గ్రామాల్లో ఈసారి వైరస్‌ విస్తరణకు ఇదే ప్రధాన కారణమన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 


రెండో విడత పరుగో.. పరుగు

 మొదటి విడతలో నరసాపురం పట్టణ మండలంలో నమోదైన కేసులు 1000లోపే ఉన్నాయి. రెండో దశలో సంఖ్య రెట్టింపుకు దగ్గరలో ఉంది. ఇప్పటి వరకు పట్టణ మండలంలోనే ఏకంగా 1800 కేసులు నమోదయ్యాయి. పట్టణంతో సమానంగా గ్రామాల్లో నమోదు కావడం విశేషం. ఇక ప్రైవేటుగా టెస్ట్‌లు చేయించుకుని ఇంటి వద్ద హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న కేసులు మరో వెయ్యి వరకూ ఉండవచ్చని సమాచారం. ప్రతి గ్రామం, వార్డులో ఒక్కరూ లేదా ఇద్దరు ఈ వైరస్‌ బారిన పడి మృత్యువాత పడ్డారు. అధికారుల లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 25కు మించలేదు. అనధికారికంగా ఈ సంఖ్య 100 వరకు ఉండవచ్చునని అంచనా. వీరిలో దంపతులు.. భార్యభర్తలు తదితర కేసులు ఉన్నాయి. పట్టణంలో అత్యధికంగా వీవర్స్‌కాలనీ, చినమామిడిపల్లి, రుస్తుంబాద, రాయపేట, అరుం ధతీపేట, శ్రీహరిపేట, మండలంలోని సరిపల్లి, కొప్పర్రు, ఎల్‌బీచర్ల, తూర్పుతాళ్ళు, వేములదీవి,  ధర్బరేవు, మర్రితిప్ప, లక్ష్మణేశ్వరం గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 


స్నేహితులే బంధువులయ్యారు..

ఆకివీడు, మే 30 : దగ్గర బంధువులు దూరమైపోతున్నారు.. చనిపోయినా రాలేకపోతున్నారు.. కర్మకాండలకు వస్తే ఎక్కడ తమకు సోకుతుందోనని భయపడిపోతున్నారు.. అయితే చాలా చోట్ల స్నేహితులు మాత్రం బాధితుల వెనుకే ఉంటున్నారు. చేతనైన సాయం చేస్తున్నారు.ఆకివీడు కార్మికనగర్‌లో నక్షత్రుడు, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు రోజులు కిందట లక్ష్మికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా రావు లపాలెంలో ఉన్న కుమారుడికి సమాచారం అందించడంతో శనివారం వచ్చా డు. ఆసుపత్రికి తీసుకెళతానన్నా తల్లి రాకపోవడంతో వదిలేశారు. ఆదివారం మృతిచెందింది.. బంధువులకు సమాచారం ఇచ్చినా రాలేదు. స్నేహితుల సాయంతో కుమారుడు దహన సంస్కారాలు చేశాడు. 


కరోనా తగ్గినా.. కిడ్నీలు పాడై టీచర్‌ మృతి

ఆకివీడు, మే 30 : కరోనా వచ్చింది తగ్గింది.. అయితే ఆయన మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఆకివీడు రైల్వే స్టేషన్‌ రోడ్‌లో నివసిస్తున్న సమయమంతుల సాయి (55) నరసాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఒంట్లో నలతగా ఉండడంతో 20 రోజుల కిందట స్కానింగ్‌ చేయించుకోగ కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు హోమ్‌ ఐసోలేషన్‌ ఉంటూ మందులు వాడారు. తగ్గిపోయిందనుకుంటుండగా ఇటీవల ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయని నిర్ధారణ అయ్యింది. దీనికి వైద్యం చేయించుకుంటున్నారు. ఆదివారం ఒక్కసారిగా మృతిచెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  హిందూ శ్మశానవాటికలో ఆదివారం తమ్ముడు శ్రీను దహన సంస్కారాలు చేశాడు. 

Updated Date - 2021-05-31T04:34:30+05:30 IST