నాన్నకు తోడుగా

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

బాల్యాన్ని తలపించే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తమ బిడ్డలే కొండంత ఆసరా.

నాన్నకు తోడుగా

కరోనా వేళ..కంటికి రెప్పలా..

నేడు ఫాదర్స్‌ డే


బాల్యాన్ని తలపించే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు  తమ బిడ్డలే కొండంత ఆసరా. ఆరేళ్ల ప్రాయంలో అల్లరి చేష్టలు.. అరవై ఏళ్ల ప్రాయంలో చాదస్తపు చేష్టలుగా మారినా బిడ్డల లాలింపు మాటలే ఆ తల్లిదండ్రులకు నిలువెత్తు సంపద. నేటి ఆధునిక పోకడలలో తల్లిదండ్రులు పిల్లలకు బరువుగా మారుతున్నారనే భావనలో అత్యధికులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులను దైవంగా భావించే బిడ్డలు ఉన్నారు. భిన్నపార్శ్వాల మధ్య వృద్ధాప్యంలో కొందరు ఆశ్రమా లకు తరలుతుంటే మరికొందరు తరగని ఆస్తిలాంటి తమ పిల్లల లాలనలో చరమాంకాన్ని ఆనందంగా గడుపుతున్నారు. నేడు తండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.


కని పడేశారు.. రూపాయి ఆస్తి సంపాదించ లేదు. దరిద్రపు బతుకు..మాకే తిండిలేక చస్తుంటే మిమ్మల్ని ఎలా పోషించేది. మంచానికి అతుక్కొని బతకాల్సిన పని ఉందా.. అని చీదరించుకునే పిల్లల మధ్య బతుకును దుర్భరంగా సాగిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. కొన ఊపిరితో ఉండగానే శ్మశానాలకు తరలిస్తున్న వైనాలను చూస్తున్నాం. ప్రసార మాధ్యమాలు సైతం ఇటువంటి ఘటనలనే వెలుగులోకి తెస్తున్నాయి. తల్లిదండ్రులను ఆప్యాయంగా ఆదరించే కోణంలో ఇది ఒక పార్శ్వం మాత్రమే. మరో కోణంలో పదుల సంఖ్యలో బిడ్డలు తమకు జన్మనిచ్చిన అమ్మను, నాన్నను ఆప్యాయంగా చంటిబిడ్డల మాదిరి చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తండ్రుల దినోత్సవం సందర్భంగా అటువంటి కొందరి బిడ్డల గురించి ప్రస్తావనే ఈ కథనం.


నాన్నే నా ప్రాణం : పోకల నిఖిత, పాలకొల్లు 

పాలకొల్లు :  పద్నాలుగు గంటల వ్యవధిలో నాన్నమ్మ, తాతయ్య మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో నాన్న, తమ్ముడు, నేను కాలం వెళ్లదీస్తుంటే స్నేహితులు ఇచ్చిన మనోధైర్యమే మాకు కొండంత బలంగా నిలిచింది. మూడు రోజులు తిరక్కుండానే నాన్న ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రి పాలయ్యారు. అప్పటికప్పుడు వైజాగ్‌ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలింపు..లక్షలాది రూపాయలు ఆసుపత్రి ఖర్చు మరోవైపు తమ్ముడితో కలిసి నాన్నకు సేవ చేస్తూనే దుఃఖాన్ని దిగమింగుకుంటూ మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ నాన్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మా నాన్నే మాకు దైవం. 


   నెల రోజులుగా నాన్నతోనే..

జంగారెడ్డిగూడెం టౌన్‌ :  చిన్నప్పటి నుంచి గంభీరంగా ఉండే నాన్నను కరోనా మంచానికి కట్టిపడేసింది. నాన్నను ఎప్పుడూ ఇలా చూడలేదు. మాది చింతలపూడి.. నెలరోజుల కిందట మా ఇంట్లో కుటుంబ సభ్యులందరికి వైరస్‌ సోకింది. అందరూ కోలుకున్నా నాన్నకు తగ్గకపోవడంతో జంగారెడ్డిగూడెంలో ఒక ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నాం. నాన్నను వదిలి ఉండాలంటే నా మనసు ఒప్పుకోలేదు. అందుకే డాక్టర్‌ను సంప్రదించి ఆసుపత్రిలో తోడుగా ఉండేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో సరే అన్నారు. ఉదయం నుంచి నాన్న పక్కనే ఉండి ఆయన పనులు చేస్తూ ఉండిపోయేవాడిని. గోరు ముద్దలు తినిపించిన నాన్నకు నేనే దగ్గరుండి మూడుపూటలా అన్నం తినిపిస్తున్నాను. నాన్న కంటే ఏదీ నాకు ఎక్కువ కాదు..అందుకే ప్రస్తుతానికి వ్యాపారం ఆపేసి నాన్నతోనే ఉంటున్నా. 


నాన్నను..బతికించుకున్నాడు...

వీరవాసరం :  వీరవాసరానికి చెందిన బండి శ్రీనివాసరావు భవననిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధి. ఆయనకు కరోనా సోకడంతో కొద్దిరోజులు ఇంటివద్దే హోంఐసొలేషన్‌లో ఉన్నారు. ఆక్సిజన్‌ సమస్య తలెత్తడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తన తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడు ఫణీంద్ర పడరాని పాట్లు పడ్డాడు. చేసేది చిన్న ప్రైవేటు ఉద్యోగం.. ఒకపక్క ఆర్థిక సమస్యలు.. మరో పక్క తండ్రి అనారోగ్యం.. స్నేహితుల సహకారంతో తండ్రిని భీమవరం ఆసుపత్రిలో చేర్పించాడు. కరోనా తగ్గినా ఆక్సిజన్‌ సమస్య అలాగే ఉంది. చివరకు వైద్యులు వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పడంతో మళ్లీ ఆసుపత్రి వెదికే పనిలో పడ్డాడు. చివరకు లంగ్స్‌ స్పెషలిష్ట్‌ను సంప్రదించి భీమవరంలోని మరో ఆసుపత్రిలో చేర్చి మరో వారం రోజులు వైద్యసేవలందించారు. చివరకు ఆరోగ్యం కుదుటపడింది. ఫణీంద్ర ప్రాణాలకు తెగించి కొవిడ్‌ ఆసుపత్రిలో ఉంటూ కంటికి రెప్పలా చూసుకుని తండ్రిని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తీసుకువెళ్లాడు.


 సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదులుకుని..  

ఆచంట : ఆచంట మండలం భీమలాపురానికి చెందినగుర్రం వరప్రసాద్‌ కొన్ని సంవత్సరాలుగా వైజాగ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసేవాడు. తన తండ్రి కృష్ణారావు గ్రామంలో కిరాణాషాపు పెట్టి జీవనం సాగిస్తున్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఎక్కువగా ఉండడంతో ప్రసాద్‌ ఉద్యోగానికి రిజైన్‌ చేసి భీమలాపురం వచ్చేశాడు. పెద్ద వయసులో తన తండ్రి కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తనే కిరాణాషాపు నడుపుతున్నాడు. తండ్రికి సాయంగా ఉండాలనే ఉద్దేశంతోనే నెలకు రూ.40 వేలు వచ్చే ఉద్యోగాన్ని సైతంవదులుకున్నట్టు వరప్రసాద్‌ తెలిపారు.


 లండన్‌ మానుకుని తండ్రికి అండగా..

కొయ్యలగూడెం : కరోనాతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉన్న ప్పటికి వారిద్దరికి మనో ధైర్యం చెబుతూ తండ్రి వ్యాపార కార్యకలాపాలను అతనే చూసుకు న్నాడు. కొయ్యలగూడేనికి చెందిన కొల్లూరు సత్తిబాబు ప్రముఖ వ్యాపారవేత్త. ఇటీవల కరోనా రావడంతో కొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆ సమయంలో కొడుకు శివ భాస్కర్‌ తండ్రికి అవసరమైన అన్ని పనులు  చూసుకుంటూనే ఇటు వ్యాపారం చూసుకున్నాడు. బీటెక్‌ చదివిన భాస్కర్‌ ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లాల్సి ఉంది. ఈలోగా కరోనా మహమ్మారి రావడంతో తన పర్యటన కూడా విరమించుకుని తండ్రికి చేదోడుగా నిలిచాడు. 


Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST