ఫార్మేటివ్ రగడ
ABN , First Publish Date - 2021-10-20T05:41:29+05:30 IST
అకడమిక్ క్యాలెండర్‌కు విరుద్ధంగా ఈ నెల 21 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించనున్న ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఎ–1) పరీక్షల విధానంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పరీక్ష తీరును మార్చడంపై హెచ్ఎంలు, టీచర్ల ఆగ్రహం
రేపటి నుంచే ఎఫ్ఎ–1 పరీక్షలు
ఏలూరు ఎడ్యుకేషన్, అక్టోబరు 19 : అకడమిక్ క్యాలెండర్‌కు విరుద్ధంగా ఈ నెల 21 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించనున్న ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఎ–1) పరీక్షల విధానంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను కూడా తీసుకో కుండా ప్రభుత్వం ఏకపక్షంగా, హడావుడిగా నాలుగు రోజుల క్రితం ఎఫ్ఎ–1 పరీక్షల నిర్వహణ విధానాన్ని మార్చేసి టీచర్లను తీవ్ర ఒత్తిళ్ళకు గురి చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. గురువారం నుంచి ప్రారంభంకానున్న ఎఫ్ఎ–1 పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలను ఏ రోజుకారోజు ఒక గంట ముందుగా స్కూలు హెచ్ఎం ఫోన్‌కు వాట్సాప్ ద్వారా పంపించి, అదే ప్రశ్నా పత్రాన్ని తరగతి గదిలో టీచర్లు బ్లాక్ బోర్డుపై రాయడం ద్వారా పరీక్షలను నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణా మండలి) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై వెంటనే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు స్పందించి ఎస్సీఈఆర్టీ నిర్ణయంపై వ్యతిరేకతను తెలియజేశారు.
సబ్జెక్టు టీచర్లు లేనిచోట ఎలా ?
పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేని విషయాన్ని హెచ్ఎంలు ప్రస్తావిస్తు న్నారు. ఉదాహరణకు హిందీ సబ్జెక్టు టీచర్లు లేని పాఠశాలల్లో ప్రశ్నాపత్రాన్ని బ్లాక్ బోర్డుపై ఎలా రాస్తారని, జవాబు పత్రాలను నిర్ణీత గడువులోగా ఎవరు మూల్యాంకణం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ఒకేసారి పరీక్షలు నిర్వహించడానికి తరగతి గదుల సంఖ్య సరిపోవని చెబుతున్నారు. సోషల్ స్టడీస్, సైన్స్, తదితర సబ్జెక్టుల పరీక్షలకు సంబంధించి బొమ్మలను బ్లాక్ బోర్డుపై టీచర్ గీయడం, వాటిని విద్యార్థులు జవాబు పత్రాల్లో వేసి ప్రశ్నలకు జవాబులుగా ఇవ్వాల్సి ఉండడంతో పారదర్శకత లోపిస్తుందని చెబుతున్నారు.
ఎవరి వాదన వారిదే..
కరోనా ఉధృతి కారణంగా గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు సాధ్యపడలేదు. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలతో ని మిత్తం లేకుండా అందరినీ పాస్ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా మళ్ళీ కరోనా ఉధృతి పరిస్థితులు పునరావృతం కావచ్చునన్న ముందస్తు అంచనాలతో ఎఫ్ఎ పరీక్షల నుంచే రాష్ట్ర మంతటా ఒకే విధానంలో నిర్వహించి పారదర్శకతను పాటించాలని ఎస్సీఈఆర్టీ భావిస్తోంది. ఆ మేరకే ప్రశ్నాప త్రాలను ఎవరికి వారు, ఏ స్కూలుకు ఆ స్కూలులో రూపొందించాల్సిన అవసరం లేకుండా పరీక్షకు ఒక గంట ముందు హెచ్ఎంల ఫోన్లకు సాఫ్ట్‌కాపీ రూపంలో ప్రశ్నాపత్రాలను పంపించే విధానాన్ని చేపట్టింది. అయితే పరీక్షలకు సంబంధించి సిలబస్ ఉండే ‘వారధి’ పుస్తకాలు ఇప్పటికీ చాలా చోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు చేరలేదని, ఈ పరిస్థితుల్లో ఎస్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం ఎఫ్ఏ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేయడమేనని హెచ్ఎంలు, టీచర్లు చెబుతున్నారు. ఆ మేరకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలల వారీగా పూర్తైన సిలబస్ ప్రకారమే ఎఫ్ఏ పరీక్షలను ముద్రిత ప్రశ్నాపత్రాలతో నిర్వహించుకునే పాత విధానాన్నే అమలు చేయాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పీఆర్టీయూ నాయకులు మంగళవారం ఏలూరులో డీఈవో సి.వి. రేణుకను కలుసుకుని వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ రాష్ట్ర సహ అధ్యక్షుడు పి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.