ఇంకెంత కాలం..?

ABN , First Publish Date - 2021-10-08T05:22:10+05:30 IST

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలు వెల్లడై.. నెల రోజులు దాటు తోంది. ఇతర ప్రాంతాలు, ప్రైవేటు వర్సిటీల్లో కౌన్సెలింగ్‌ మొదలైనా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు నోటిఫి కేషన్‌ ఇవ్వలేదు.

ఇంకెంత కాలం..?

ఇప్పటి వరకు విడుదల కాని కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్లు

15 వేల మంది ఇంజనీరింగ్‌, ఫార్మశీ, అగ్రికల్చర్‌ విద్యార్థుల ఎదురుచూపు

సంవత్సరం చివరికొస్తోంది.. తరగతులు ఇంకెప్పుడు మొదలవుతాయి

చదువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లే ఆలోచనలో మరికొందరు 

కళాశాలల్లో భర్తీ కాని సీట్లు  ..  ఒత్తిడిలో యాజమాన్యాలు


 ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలు వెల్లడై.. నెల రోజులు దాటు తోంది. ఇతర ప్రాంతాలు, ప్రైవేటు వర్సిటీల్లో  కౌన్సెలింగ్‌ మొదలైనా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు నోటిఫి కేషన్‌ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థుల్లో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ముందు  జాగ్రత్తగా డీమ్డ్‌, ప్రైవేటు యూనివర్సిటీల్లో సీట్ల కోసం ఆరా తీస్తున్నారు. ఈ పరిణామంతో సీట్ల భర్తీపై కళాశాలల   యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది.


భీమవరం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 7: 

ఫలితాలు విడుదలై నెల రోజులు దాటినా ఎప్పుడు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు ? ఎప్పుడు తరగతులు మొదలవుతాయి ? అంటూ ఇంజనీరింగ్‌, ఫార్మశీ, అగ్రికల్చర్‌ ఉత్తీర్ణత సాధించిన 15 వేల మంది 

విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జాప్యం జరిగితే చదువుకునేందుకు వేరే రాష్ట్రానికి వెళ్లాలా ? అని వారు తీవ్ర ఒత్తిడికి గురై గందరగోళంలో పడిపోతున్నారు. కౌన్సెలింగ్‌ జాప్యం కావడంతో ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలపైన ఒత్తిడి పెరుగుతోంది. ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో అది సీట్ల భర్తీపై ప్రభావం చూపుతుంది. జిల్లాలో 16 ఇంజనీరింగ్‌ కళాశాలలకు గాను, గత ఏడాది కన్వీనర్‌ కోటా సీట్లు 7,700కు గాను 6,461 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రెండో కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూశారు. ఇక ఈ ఏడాది కౌన్సెలింగ్‌ ఆలస్యం, తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఇప్పటికీ తెలియకపోవడంతో సీట్లు భర్తీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్‌లో 10 వేల 629 మంది ఉత్తీర్ణత సాధించడంతో సీట్ల భర్తీ పెరుగుతాయని కళాశాల యాజమాన్యాలు  అంచనాలు వేసుకున్నప్పటికీ.. కౌన్సెలింగ్‌ జాప్యం వల్ల అయోమయంలో పడిపోతున్నారు. దీనికితోడు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి విద్యార్థులు మక్కువ చూపితే ఆ సీట్లు నష్టపోతారు. ఇప్పటికే డిగ్రీ అడ్మిషన్‌లు చివరి దశకు చేరాయి. ఇంజనీరింగ్‌లో మాత్రం వెనుకబ డ్డాయి. ఈ ఏడాది ఆగస్టు 19 నుంచి 25 వరకు ఏపీఈఏపీ సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు జరిగాయి. సెప్టెంబర్‌ 8న ఫలితాలు వెల్లడించడంతో 10 వేల 629 మంది ఉత్తీర్ణత సాధించారు. వాస్తవంగా ఫలితాలు వెల్లడించే సమయంలోనే కౌన్సెలింగ్‌, తరగతుల ప్రారంభ తేదీలను ప్రకటిస్తారు. కానీ, అది ఇప్పటి వరకు వెల్లడించలేదు. మొదటి కౌన్సెలింగ్‌ సీట్లు అలాట్‌మెంట్‌ చాలా రోజులు ఉంటుంది. దీంతో ఇంజనీరింగ్‌ తరగతులు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి తగ్గింది. ఈ సమయంలో ఇంజనీరింగ్‌ తరగతులు మొదలైతే సాఫీగా సాగొచ్చు. ఆలస్యంగా మొదలైతే.. తర్వాత కరోనా ఎలా ఉంటుందోననే భయాందోళనలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. ఏపీఈఏపీ సెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీలలో నిర్వహించి 14న ఫలితాలు వెల్లడించారు. 4,766 మంది ఉత్తీర్ణత సాధించారు. కౌన్సెలింగ్‌ తేదీని ఖరారు చేయలేదు.  


కౌన్సెలింగ్‌ జాప్యంతో ఒత్తిడి 

– కొట్టి జాహ్నవి, భీమవరం


కౌన్సెలింగ్‌ జాప్యం వల్ల ఒత్తిడి పెరుగుతోంది. చాలామంది ఇక్కడ కౌన్సెలింగ్‌ ఆలస్యమని ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇంజనీరింగ్‌ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. దీనికితోడు ఎప్పుడు కౌన్సెలింగ్‌ జరుగుతుంది ? తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది తేదీ నిర్ణయించలేదు. ఇదంతా పూర్తయ్యే సరికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇప్పటికే ఏడాది చివరికి వచ్చేసింది.


బోధనా సమయం తగ్గుతుంది

– కె.భార్గవి, వెంప

ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏపీఈ ఏపీ సెట్‌ ఫలితాలు విడుదలై నెల రోజులు దాటుతున్నాయి. కౌన్సెలింగ్‌ డేట్‌ కోసం రోజూ ఎదురు చూస్తున్నాం. ఆలస్యం కావడం వల్ల విద్యా సంవత్సరం వెనక్కి వెళ్లిపోతోంది. దీనివల్ల బోధనా సమయం తగ్గిపోయే అవకాశం ఉంది. 


Updated Date - 2021-10-08T05:22:10+05:30 IST