డీఆర్‌డీఏకు మంగళం

ABN , First Publish Date - 2021-11-10T05:12:40+05:30 IST

జిల్లాలో అన్ని సంస్థలకంటే ముందు వరుసలో ఉండే.. డీఆర్‌డీఏను రద్దు చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. పథకాల అమలు, పేదలకు సబ్సిడీ పంపిణీ, రైతులకు అండగా వున్న ఈ సంస్థకు మంగళం పాడాలని కేంద్రం గత ఏడాదే నిర్ణయించినా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రద్దు ప్రక్రియను అమలులోకి తేవాలని యోచిస్తోంది

డీఆర్‌డీఏకు మంగళం

కొన్ని నెలల వ్యవధిలోనే కనుమరుగు.. కేంద్రం ఆదేశాలు

ఒకప్పుడు రారాజుగా వెలిగి.. ఇప్పుడు పతనావస్థకు

డిప్యుటేషన్‌ ఉద్యోగులంతా మాతృ సంస్థలకు

జడ్పీలో విలీనం చేయాలంటూ సూచన 

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అన్ని సంస్థలకంటే ముందు వరుసలో ఉండే.. డీఆర్‌డీఏను రద్దు చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. పథకాల అమలు, పేదలకు సబ్సిడీ పంపిణీ, రైతులకు అండగా వున్న ఈ సంస్థకు మంగళం పాడాలని కేంద్రం గత ఏడాదే నిర్ణయించినా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రద్దు ప్రక్రియను అమలులోకి తేవాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారికంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖలు అందాయి. ఒక వెలుగు వెలిగిన ఈ శాఖ ఇప్పుడు పూర్తిగా అదృశ్యం కాబోతోంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులను ఇతర శాఖలకు బదలాయించనున్నారు. 


ఒకప్పుడు అంతా తానై..

కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం వాటా భరించేలా 40 ఏళ్ల క్రితం గ్రామీణాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. జిల్లా కేంద్రాల సాక్షిగా గ్రామీణాభివృద్ధి సంస్థ తన కార్యకలాపాలు నిర్వహించింది. ఆ తరువాత డీఆర్‌డీఏగా మార్పు చెంది మిగతా శాఖలకు దీటుగా ఎదిగింది. ఈ సంస్థకు ప్రత్యేక యంత్రాంగమంటూ ఉండేది కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పథకాల అమలుకు వీలుగా పొరుగు శాఖల నుంచి కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్‌లో పంపేది. 2000 సంవత్సరం నాటికి ఐఆర్‌డీపీ కింద సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకంగా మారినా పేదలను ఆదుకోవడం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలను విస్తరించడం, వ్యవ సాయ రంగంతోపాటు అనుబంధ రంగాలు విస్తరించడం, లబ్ధిదారులకు చేయూతనివ్వడం వంటి లక్ష్యాలతో ముందుకెళ్లింది. సంస్థ పరిధిలోకి పరిశ్రమలు, వ్యవసాయం, హార్టికల్చర్‌, ఇరిగేషన్‌ వంటి శాఖల బాధ్యత ఉండేది. ఉదాహరణకు హార్టికల్చర్‌, సెరీకల్చర్‌లో రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ పరికరాలు అందించేవారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో అట్టడుగు వర్గాలకు డీఆర్‌డీఏ చేరువైంది. మధ్యలో ఎస్‌జీఎస్‌వై (స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్‌ యోజన) అమలులోకి తీసుకువచ్చారు. ఆఖరికి డ్వామా సంస్థ కూడా డీఆర్‌డీఎ పరిధిలోనే ఉండేది. ఆదరణ పథకం కింద వంద శాతం సబ్సిడీపై పరికరాలను పేదలకు అందించడంలో డీఆర్‌డీఏ కీలక పాత్ర వహించింది. స్వయం సహాయక సంఘాలు దీని పరిధిలోకి వచ్చాయి. వేలతో ఆరంభమైన మహిళా సంఘాల గ్రూపులు లక్షల్లోకి పెరిగాయి. వీటి అమలు, పర్యవేక్షణ, రుణసాయం ఇతర కీలక అంశాలను ఇక్కడ నుంచే పర్యవేక్షించేవారు. తర్వాత కాలంలో మహిళా గ్రూపులు సెర్ఫ్‌ పరిధిలోకి వెళ్లిపోయాయి. సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య పదుల సంఖ్య నుంచి రెండంకెలలోపు దిగజారాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఒకనాడు ఏర్పాటు చేసిన గ్రామీ ణాభివృద్ధి సంస్థను పూర్తిగా తొలగించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. గతేడాది కూడా ఈ మేరకు ప్రతిపాదనలను, తమ నిర్ణయాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాలకు లేఖ రూపంలో తెలియజేసింది. డీఆర్‌డీఏను ఎందుకు రద్దు చేయాలంటున్నారో కూడా ఆయా లేఖల్లో సవివరంగా వెల్లడించారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఈ నిర్ణయం వెలువరించినా తన వాటాగా 75 శాతం బడ్జెట్‌ను మాత్రం విడుదల చేసింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల డీఆర్‌డీఏను రద్దు చేయడం ఆరంభించింది. 


ఏడాది తరువాత మళ్లీ ఇప్పుడు 

డీఆర్‌డీఎను రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్‌కుమార్‌ వచ్చే ఆర్ధిక సంవత్సరం నాటికి డీఆర్‌డీఎను రద్దు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు  తాజాగా లేఖ రాశారు. తదనుగుణంగా ఏ చర్యలు తీసుకోవాల్సింది కూడా తగు సూచనలు చేశారు. వాస్తవానికి జిల్లాలో డీఆర్‌డీఏ పరిధిలో ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 23 మంది మాత్రమే. వీరంతా సంస్థ నియమించిన వారే. వీరు గాక అనేక మంది జిల్లా పరిషత్‌తోపాటు వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని డీఆర్‌డీఏను రద్దు చేయడంతోపాటు ఈ కార్యకలాపాలు అన్నింటిని జిల్లా పరిషత్‌, పంచాయతీలకు విలీనం చేయాల్సిందిగా సూచించారు. డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి మాతృ సంస్థలకు పంపడం, అలాగే మిగతా వారిని సర్దుబాటు చేయడం వంటి అనేక అంశాలను ప్రతిపాదించారు. దీంతో రానున్న కొన్ని మాసాల వ్యవధిలోనే డీఆర్‌డీఏ కనుమరుగు కావడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే ఇందులో పనిచేస్తున్న అనేకమంది ముందస్తుగా తమ మాతృసంస్థలో చేరిపోగా మిగిలిన వారిలో ఒకింత ఆందోళన ఆరంభమైంది.  


 


Updated Date - 2021-11-10T05:12:40+05:30 IST