ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు ?

ABN , First Publish Date - 2021-08-26T05:22:20+05:30 IST

2020 మార్చి 31న కరోనా వైరస్‌ ప్రవేశంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి పరిస్థితి మారింది. కొంత కాలం సాధారణ వైద్య సేవలు నిలిపి వేసి, గతేడాది నవంబర్‌ 15 నుంచి మళ్లీ అనుమతి ఇచ్చారు.

ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు ?
ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి.

కరోనా వైద్యానికే జిల్లా ప్రభుత్వాసుపత్రి పరిమితం

అందుబాటులోకి రాని సాధారణ వైద్యం  

మందులు కొనలేక రోగుల అవస్థలు

కాలం చెల్లుతున్న టాబ్లెట్స్‌, టానిక్‌లు 

లక్షల్లో బడ్జెట్‌ ఉన్నా డ్రా చేసే దారి లేదు 


 ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి.. 

పశ్చిమతోపాటు కృష్ణా జిల్లా నుంచి రోగులు రోజుకు 800 నుంచి 1,200 మంది వరకూ వైద్యం (ఓపీ) కోసం వస్తుండే వారు. ఆసుపత్రిలో 500 నుంచి 550 మంది రోగులు ఇన్‌ పేషెంట్లుగా చికిత్స పొందేవారు. 


 కరోనా రాకతో.. 

2020 మార్చి 31న కరోనా వైరస్‌ ప్రవేశంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి పరిస్థితి మారింది. కొంత కాలం సాధారణ వైద్య సేవలు నిలిపి వేసి, గతేడాది నవంబర్‌ 15 నుంచి మళ్లీ అనుమతి ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 19న సెకండ్‌ వేవ్‌ రాకతో ఏప్రిల్‌ 15 నుంచి ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా మార్పు చేసి ఓపీ విభాగాలు, శస్త్ర చికిత్సలన్నీ ఆపివేశారు. ఏప్రిల్‌, మే నెలల్లో కేసులు వందల్లో రాగా, జూన్‌ 15 నాటికి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 58 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య తగ్గింది.


ఏలూరు క్రైం, ఆగస్టు 25 :


నాలుగున్నర నెలలు నుంచి ఆసుపత్రిలో ఓపీ విభాగాలను, సాధారణ వైద్య సేవలను పూర్తిగా ఆపివేశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకున్నాయి. కానీ, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మాత్రం సాధారణ వైద్యం అందడం లేదు. ప్రస్తుతం ఓపీ, ఇన్‌పేషెంట్‌ సదుపాయం లేకపోవడంతో సాధారణ రోగుల అవ స్థలు అన్నీ ఇన్నీ కావు.షుగరు, బీపీ వ్యాధి గ్రస్తులు నెలకు సరిపడా మందులు లేక రోగులు విలవిల్లాడి పోతున్నారు. వాటిని బయట కొనుగోలు చేయా లంటే నెలకు మూడు నుంచి ఆరు వేల వరకు ఖర్చవుతుంది. పక్షవాతం వచ్చిన వారి పరిస్థితి మరీ దారుణం.చాలామంది బయట కొను క్కునే స్థోమత లేక అరకొరగా మందులు కొని మింగుతున్నారు. 

 కాలం చెల్లిన మందులు

ఆసుపత్రికి ఏప్రిల్‌లో ఇచ్చిన మందులు, అంతకు ముందు జనవరిలో ఇచ్చిన మందులు పూర్తిస్థాయిలో వినియోగించక కొన్ని ఎక్స్‌పైర్‌ కావడంతో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన మందులను పక్కన పెట్టేశారు. ముఖ్యంగా వీటిలో షుగరు, బీపీ, గ్యాస్‌ బిళ్లలు, ఒళ్లు నొప్పుల బిళ్లలు ఉన్నట్లు గుర్తించారు. యాంటీ బయోటిక్‌ బిళ్లలు గడువుకు దగ్గరలో ఉన్నాయి. ప్రస్తుతం యాంటీ బయోటిక్‌ సిఫ్యాగ్జిమీ, బీపీ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే రోస్‌వర్టిన్‌, కాల్షియం మందులు జనవరి వరకూ మాత్రమే గడువు ఉన్నాయి. మరో 25 రకాల మందు బిళ్లలు, ఎనిమిది రకాల సిరఫ్‌లు గడువుకు దగ్గరలోనే ఉన్నాయి. ఆసుపత్రి ఆవరణలోవున్న జిల్లా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో వున్న ఈ మందుల ఎక్స్‌పైరీ డేట్‌ (గడువు ముగింపు తేదీ) జనవరి వరకూ ఉన్నది. ఈ లోపే వీటిని ఆసుపత్రికి ఇచ్చి రోగులకు అందించాలి. గతంలో జిల్లా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో మూడు లక్షల విలువైన మందులను ఎక్స్‌పైరీ డేట్‌ పూర్తయిన వాటిని పక్కనబెట్టి ఉంచారు. 

బడ్జెట్‌ ఉన్నా.. వాడలేని పరిస్థితి

ఓ వైపు మెడికల్‌ కాలేజీ పనులు చకచకా జరుగుతున్నా.. కరోనా వైద్య సేవలు మినహా సాధారణ వైద్య సేవలు లేవు. కేవలం 58 మంది మాత్రమే కరోనా బాధితులు ఉన్నారు. వీరందరినీ ఒక ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య సేవలందించే సదుపాయం ఉంది. ఎందుకో ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి ఏడాదికి నాలుగు క్వార్టర్లుగా బడ్జెట్‌ను అందిస్తుంటారు. ప్రస్తుతానికి ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ మందు బిళ్లలు, టానిక్‌ల రూపంలో రూ.80.36 లక్షల విలువైన మందు బిళ్లలు, రూ.18.44 లక్షల విలువైన ఆపరేషన్లకు అవసరమైన వస్తువులను జిల్లా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి పొందాలి. ఏటా ఈ బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో వాడుకోవడమే కాకుండా అదనంగా కూడా మందులు తీసుకుంటూ ఉండేవారు. కానీ, ఈసారి ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు రూ.35.45 లక్షల విలువైన మందులు, సర్జికల్స్‌ వస్తువులను మాత్రమే పొందగలిగారు. ఇంకా బడ్జెట్‌లో రూ.63.35 లక్షల విలువైన మందులు, సర్జికల్‌ వస్తువులు తీసుకునే బడ్జెట్‌ మిగిలిపోయింది. సాధారణ వైద్య సేవలు లేకపోవడం వల్లే ఈ బడ్జెట్‌ ద్వారా మందులను డ్రా చేయలేని పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-08-26T05:22:20+05:30 IST