కష్టాల సా..గు

ABN , First Publish Date - 2021-12-08T05:30:00+05:30 IST

ఈ సారి రైతులకు వాతావరణం అనుకూలించ లేదు.

కష్టాల సా..గు
కాళ్ళలో బురదలోనే యంత్రంతో వరి కోతలు

ఇంకనూ పూర్తికాని మాసూళ్లు

ఆందోళనలో రైతాంగం


ఆచంట/కాళ్ళ, డిసెంబరు 8 : ఈ సారి రైతులకు వాతావరణం అనుకూలించ లేదు.  తరచూ మబ్బులు, మేఘాలతో నిండి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్ప టికే వరుస తుపానులు, భారీ వర్షాలతో అనేక చోట్ల పంట పొలాలు నేలమట్టమయ్యాయి. దీని కారణంగా దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుందని పలువురు రైతులు వాపోతున్నారు.  రైతులు పంటను కాపాడుకునే పనిలో పడ్డారు. హడావుడిగా యంత్రాలతో వరి కోతలు కోస్తున్నారు. కోసిన ధాన్యాన్ని ఆరబెడుతూ పంటను ఒబ్బిడి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాళ్ళ మండలంలో సుమారు 6,300 ఎకరాల్లో సార్వా సాగు చేశారు. అయితే ఇప్పటికే ఎకరానికి రూ. 20 వేలు పైబడి పెట్టుబడి పెట్టినట్టు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గట్లను అనుకుని వరి చేలు నేలకొరిగాయి. దీని వల్ల దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరొక వైపు ఎప్పటికప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆందోళన చెందుతున్నామని రైతులు వాపోతున్నారు. వాతావరణంలో  బుధవారం కూడా పలు మార్పులు రావడంతో రైతులు ఏదో విధంగా పండిన పంటను దక్కించుకోవాలని సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. మరొకొన్ని రోజుల పాటు వాతావరణం అనుకూలిస్తే గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఇప్పటికే మాసూళ్లు చేసిన ధాన్యం , తూచిన బస్తాలు కూడా రోడ్డుమీదే ఉన్నాయి. వాతావరణం అను కూలిస్తే సార్వా పంటను కాపాడుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు. 


Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST