నిర్వాసితుల భూముల్లో పంట ధ్వంసం

ABN , First Publish Date - 2021-11-03T04:55:45+05:30 IST

పోలవరం నిర్వాసిత గ్రామం కొరుటూరు వాసులకు పి.నారాయణపురంలో కేటాయించిన భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్న పంటల ను రెవెన్యూ, పోలీస్‌ అధికారుల సమక్షంలో మంగళవారం ధ్వంసం చేశారు.

నిర్వాసితుల భూముల్లో పంట ధ్వంసం
గిరిజన మహిళలతో మాట్లాడుతున్న అధికారులు

జీలుగుమిల్లి, నవంబరు 2: పోలవరం నిర్వాసిత గ్రామం కొరుటూరు వాసులకు పి.నారాయణపురంలో కేటాయించిన భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్న పంటల ను రెవెన్యూ, పోలీస్‌ అధికారుల సమక్షంలో మంగళవారం ధ్వంసం చేశారు. గిరిజనులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సర్వే నెం.183, 182, 181 భూమిని కొరుటూరు వాసులు 120 కుటుంబాలకు 185 ఎకరాలు ప్రభుత్వం కేటాయించినట్లు తహసీల్దారు జి.ఎలీషా తెలిపారు. ఆయా భూముల్లో నిర్వాసితులు సాగు చేసుకో కుండా దాట్లవారిగూడెం, మడకంవారిగూడెం గిరిజనులు అడ్డుకుంటున్నారు. నిర్వాసిత భూముల్లో వేరుశనగ, మినుము, ఇతర అపరాల పంటల్ని అధికారులు దున్నించారు. గిరిజన మహిళలు కొందరు అడ్డు చెప్పడంతో ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. పోలవరం, జీలుగుమిల్లి తహసీల్దార్లు సుమతి, ఎలీషా మహిళలకు నచ్చ జెప్పి పంటను ట్రాక్టరుతో ధ్వంసం చేశారు. కొరుటూరు నిర్వాసితులకు భూములు అప్పగించే పనిలో రెవెన్యు అధికారులు నిమగ్నమయ్యారు. నిర్వాసితులు, స్థానిక గిరిజనుల మధ్య ఘర్షణ చోటు చేసుకోకుండా ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌ జీలుగుమిల్లి, బుట్టాయగూడెం పోలీస్‌ సిబ్బంది, ఏఆర్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-11-03T04:55:45+05:30 IST