విద్యాదీవెనా రాలే!

ABN , First Publish Date - 2021-11-02T05:55:49+05:30 IST

కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఈవారం కూడా అర్జీదారులు పోటెత్తారు.

విద్యాదీవెనా రాలే!
స్పందనలో మాట్లాడుతున్న కలెక్టర్‌

 కలెక్టరేట్‌ స్పందనలో విద్యార్థుల ఫిర్యాదు 

 పింఛను కోత బాధితులు సరేసరి

 త్వరలో ఉద్యోగుల గ్రీవెన్స్‌ కూడా : కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఈవారం కూడా అర్జీదారులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వస్తున్న పింఛను, ఇళ్ల స్థలాల బాధితులకు తోడుగా ఈవారం విద్యాదీవెన బాధితులు కూడా జత కలిశారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛను ఆగిపోవడం, విద్యాదీవెనను నిలిపి వేయండం కారణంగా కలెక్టరేట్‌ స్పందనకు వచ్చే అర్జీదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్పందనలో దరఖాస్తు చేసుకున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పదే పదే కలెక్టరేట్‌ తలుపులు తట్టే బాధితుల సంఖ్య  పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్ని శాఖల అధికారులను సోమవారం మరోమారు హెచ్చరించారు. సమస్యల పట్ల అలసత్వం వహించకుండా సకాలంలో పరిష్కరించాలని హెచ్చరించారు. ఇకపై ప్రతి నెలా ఉద్యోగుల సమస్యలపై కూడా గ్రీవెన్స్‌ ఉంటుందని ఆయన  తెలిపారు. ప్రతి నెల నాలుగో శనివారం ఉద్యోగుల గ్రీవెన్స్‌ ఉంటుందని ఆయన చెప్పారు. 

మా పిల్లలిద్దరికీ విద్యాదీవెన ఆపేశారు

మాది గణపవరం మండలం గోపవరం. నేను దివ్యాంగుడిని. కూలి పనులు చేసుకుని పిల్లల్ని చదివించుకుంటున్నాం.  మా ఇద్దరు పిల్లల్లో ఒకరు ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం, ఇంకొకరు పాలిటెక్నిక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. వారికి తొలి విడత విద్యాదీవెన వచ్చింది. రెండో విడత నుంచి విద్యా దీవెన ఆగిపోయింది. మూడో దఫా విద్యాదీవెనకు దరఖాస్తు కూడా చేసుకోనీలేదు. ఇప్పుడు విద్యా దీవెన ఆగిపోతే మా పిల్లల చదువు ఆగిపోతుంది. మా కష్టం వృధా అయిపోతుంది. దయచేసి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి.          

 – బి.గోపాలుడు, గోపవరం


 నాకు ఈనెల నుంచి పింఛను రాదంట! 

మాది ఏలూరులోని దక్షిణం వీధి. నాకు 1987లో లారీ ప్రమాదంలో రెండు కాళ్లూ పోయాయి. అధికారులు 90 శాతం వైకల్యం ఉందని సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. ఇప్పుడు కరెంటు బిల్లు పేరుతో 

నాకు వచ్చే వికలాంగుల పింఛనును ఆపేశారు. తక్షణం నా పింఛను పునరుద్ధరించకపోతే నేను కలెక్టరేట్‌ వద్దే ఆందోళనకు దిగుతాను. అంతకు మించి 

నాకు గత్యంతరం లేదు. 

– కొరళ్ల పార్థసారథి, ఏలూరు

 మాకు స్థలం ఇప్పించండి సారూ..!

మాది ఏలూరులోని కొత్తపేట. మేం కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. ఏడేళ్లుగా అద్దె ఇళ్లల్లోనే జీవనం సాగిస్తున్నాం. జగనన్న ఇళ్ల స్థలాల కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇప్పటికి నాలుగుసార్లు దరఖాస్తు చేశాం. కానీ ఇప్పటి వరకూ జాగా ఇవ్వలేదు. కారణం కూడా చెప్పడం లేదు. అందుకే కలెక్టర్‌ సారుకు మొరపెట్టుకుందామని వచ్చా. దయచేసి నాకు ఇంటి స్థలం ఇప్పించండి సారూ!

– నాగ దుర్గాంజలి, ఏలూరు


Updated Date - 2021-11-02T05:55:49+05:30 IST