నిర్లక్ష్యంపై ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-10-26T05:21:20+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది.

నిర్లక్ష్యంపై ఫిర్యాదులు
కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకుంటున్న బాధితురాలు

స్పందనలో భారీగా అభ్యర్థనలు

పోలీసుల తీరుపై ఆవేదన

పింఛను బాధలు యథాతథం

ఏలూరు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. గోదావరి సమావేశ మందిరం వద్ద వందల సంఖ్యలో బారులు తీరారు. కొవిడ్‌ నిబంధనలను పట్టించుకోకపోవడంతో గమనించిన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అర్జీదారుల వద్దకే వచ్చి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కార బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించారు. మొత్తం 355 అర్జీలు రాగా వాటిలో రెవెన్యూ శాఖకు 117, పింఛన్లకు 60, పోలీస్‌ శాఖకు 40, పంచాయతీరాజ్‌కు 29, మున్సిపాలిటీలకు 23, పౌర సరఫరాలకు 15, సాంఘిక సంక్షేమ శాఖకు 12, ఇతర శాఖలకు సంబంధించిన మిగిలిన దరఖాస్తులు ఉన్నాయి. జేసీలు బీఆర్‌ అంబేడ్కర్‌, హిమాన్షుశుక్లా, సూరజ్‌ గానోరే, పద్మావతి, డీఆర్‌వో డేవిడ్‌రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

సమస్యల వెల్లువ

జంగారెడ్డిగూడెం మండలం రావికంపాడులోని కట్టవపడ్డాలవారిగూడేనికి చెందిన కోలా చిన్ని అనే చిన్నారి తీవ్ర శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతోంది. ఆమెకు మూడు నెలలుగా దివ్యాంగ పింఛను ఆగిపోయింది. వేలి ముద్రలు పడడం లేదని వలంటీర్లు, సచివాలయ అధికారులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు కలెక్టర్‌ను వేడుకున్నారు. 

ద్వారకా తిరుమల మండలం తిర్నంపాలెంకు చెందిన కొత్తపల్లి కాంతమ్మ 70 ఏళ్ల ఒంటరి మహిళ. రెండు నెలలుగా ఆమెకు పింఛను రావడం లేదు. ఒంటరి మహిళ కావడంతో ఆమె బంధువుల రేషన్‌ కార్డులో తన పేరు నమోదు చేయించుకుంది. ఇప్పుడు ఆ  కార్డు యజమానికి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందన్న కారణంగా ఈమె పింఛను కోల్పోయింది. తన పింఛను పునరుద్ధరించాలని ఆమె కలెక్టర్‌ను వేడుకుంది.

ఏలూరు బీడీ కాలనీకి చెందిన దివ్యాంగుడు టి.నూకరాజు, కొవ్వూరు మండలం పినకాలమెట్టకు చెందిన మరో దివ్యాంగుడు చివటం కొండయ్య పింఛన్లు రావడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడేనికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఈ నెల 17న పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు 18న ధర్మాజీగూడెం స్టేషన్‌లోను, తర్వాత ఎస్పీ కార్యాలయంలోను ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టరేట్‌ స్పందనలో మొర పెట్టుకున్నారు. 


Updated Date - 2021-10-26T05:21:20+05:30 IST