బాధితుల్ని ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి

ABN , First Publish Date - 2021-05-09T05:06:33+05:30 IST

జిల్లాలో అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి వచ్చిన కొవిడ్‌ బాధితులను కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

బాధితుల్ని ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి
ఏలూరు ఆసుపత్రిలో కలెక్టర్‌తో మాట్లాడుతున్న సిబ్బంది

ఆరోగ్యశ్రీ కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులు

తాత్కాలిక అనుమతులు పొందాలి

50 శాతం బెడ్‌లు కొవిడ్‌ బాధితులకు కేటాయించాలి

కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి వచ్చిన కొవిడ్‌ బాధితులను కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లేని ప్రైవేటు అసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు తాత్కాలిక అనుమతులు పొందాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రుల్లో సాధారణ, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లలో 50 శాతం ఖచ్చితంగా కొవిడ్‌ బాధితులకు కేటాయించి ఉచిత వైద్యం అందించాలన్నారు. బెడ్లు, వైద్యం అందించకుండా నిరాకరించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాకు కోవాక్సిన్‌ టీకా వచ్చిందని, ఇది రెండో డోసు వారికి మాత్రమే ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వాక్సినేషన్‌ సెంటర్లలో గుంపులు లేకుండా చూడాలన్నారు. బ్యాంకులు, ఇతర ప్రాంతాల్లో జనం గుమికూడకుండా చూడాలన్నారు. 


ఏలూరు ఆస్పత్రిలో 500 బెడ్లు..

ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు

ఏలూరు క్రైం, మే 8: ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 500 వరకు బెడ్లు పెంచేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం హాస్పటల్‌లో హెల్ప్‌డెస్క్‌, ఆక్సిజన్‌ ప్లాంటును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సమస్య ఏర్పడిందని దానిని 20  నిమిషాల్లోనే సరి చేశామని తెలిపారు. ఆక్సిజన్‌ జనరేటర్‌ను ఆసు పత్రిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని దానిని వేరే ప్రాంతాలకు సరఫరా చేయడంగాని, లేదా ఇక్కడే వినియోగించుకో వచ్చునన్నారు. దీని ద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్‌ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. 15 క్యూబిక్‌ లీటర్ల సామర్ధ్యం గల ఆక్జిన్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు దాత రాజు ముందుకు వచ్చారని త్వరలోనే ఏర్పా టుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 కెఎల్‌ వరకు సామర్ధ్యం గల స్టోరేజ్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్‌ అండ్‌ బి, ఎన్‌హెచ్‌ఏఐ వారు ఆసుపత్రిలో జర్మన్‌ టెక్నాలజీతో 100 నుంచి 150 బెడ్‌లకు ఆక్సిజన్‌ సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించారని,అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పిం చామని తెలిపారు.  ప్రతి రోజు ఆసుపత్రిలో 60 నుంచి 70 మంది బాధితులు జాయిన్‌ అవుతున్నారని  40 నుంచి 50 మంది డిశ్చార్జి అవుతున్నారని తెలి పారు. ఏలూరులో సీఆర్‌ఆర్‌ కళాశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, అందులో 24 గంటలు డాక్టర్లను, ఆక్సిజన్‌ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.  జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా, ట్రైనీ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌, ఆర్‌ఎంవో శ్రీనివాసరావు, మెడికల్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పోతమూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 


 ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు

ప్రైవేటు అంబులెన్సులు పేషెంట్లు వద్ద నుంచి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని అటువంటి వారిపై చర్యలు తీసుకోవలసిందిగా ఆర్టీవో, ఆర్డీవో, డిఎస్‌పీలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సమయంలో ఎవరైనా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి నట్లయితే వారిపై కే సు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


హెల్ప్‌డెస్క్‌ ఉద్యోగులను విధుల నుంచి తప్పించాలి

ఏలూరు క్రైం, మే 8: ఏలూరు ప్రభుత్వాసుపత్రి హెల్ప్‌డెస్క్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తున్నాయని, వారిని తక్షణం విధుల నుంచి తొల గించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాడీసీహెచ్‌ఎస్‌ మోహన్‌ను ఆదేశించారు. శనివారం ఉదయం ఏలూరు ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.హెల్ప్‌డెస్క్‌, ట్రేసింగ్‌ సెంటర్‌, ఆక్సిజన్‌ ప్లాంటులను పరిశీలించారు.రాత్రి వేళ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఎక్కువగా వృఽథా అవకుండా ఒక అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం 6.30 గంటల కల్లా ఎంత ఆక్సి జన్‌ ఉంది, ఎంత కావాలి అనే నివేదికలను అందించాలన్నారు. హెల్ప్‌డెస్క్‌ సక్రమంగా నిర్వహించాలని, పూర్తి సమాచారం ఉండాలన్నారు. అంబులెన్సులో ఎక్కువ సమయం బాధితులను ఉంచకుండా చర్యలు చేపట్టాలన్నారు. వారికి ఇంటి దగ్గర నుంచి ప్రేమతో పంపే భోజనం అందించాలని సూచించారు. 

Updated Date - 2021-05-09T05:06:33+05:30 IST