మహర్దశ దక్కేనా?

ABN , First Publish Date - 2021-12-19T06:32:21+05:30 IST

పశ్చిమ–కృష్ణాలో ఇప్పటికే జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జిఎస్‌ఐ) సంస్థ చాన్నాళ్ళ క్రితమే సర్వే నిర్వహించి ఈ ప్రాంతంలో నాణ్యమైన నల్ల బంగారం అపార నిల్వలు ఉన్నట్టు గుర్తించింది.

మహర్దశ దక్కేనా?
చింతలపూడి మండలం శెట్టివారిగూడెంలో బొగ్గు నిక్షేపాల సర్వే జరుగుతున్న రిగ్గు (ఫైల్‌)

బొగ్గు బ్లాక్‌ల వేలానికి సిద్ధం  

పశ్చిమ–కృష్ణా జిల్లాల్లో కాస్తంత అలికిడి

వెనుకబడిన ప్రాంతాలకు ఇదొక తీపి కబురే

ఆశల్లో నిరుద్యోగ యువత

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

కాస్తంత వెనుకపడిన ప్రాంతానికి మహర్దశ చేరువలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. పశ్చిమ–కృష్ణాలో ఇప్పటికే జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జిఎస్‌ఐ) సంస్థ చాన్నాళ్ళ క్రితమే సర్వే నిర్వహించి ఈ ప్రాంతంలో నాణ్యమైన నల్ల బంగారం అపార నిల్వలు ఉన్నట్టు గుర్తించింది. ఏకంగా ఈ నిల్వలను వెలికితీస్తే మూడు వేల మెట్రిక్‌ టన్నులకుపైగా బొగ్గు వెలికితీయ వచ్చని అంచనా కట్టింది. తద్వారా ఈ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధితోపాటు మైనింగ్‌కు ఆదాయ వనరులు పెరుగుతాయని భావించింది. దీనిలో భాగంగానే గత ఏడాదే బొగ్గు వెలికి తీసేందుకు కేంద్రం టెండర్లు పిలిచినా అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు తాజాగా మరోమారు బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు మరోమారు టెండర్లను పిలిచింది. ఈ ప్రక్రియ యావత్తు విజయవంతమైతే ఈ రెండు జిల్లాల్లో వేలాది మందికి ఉపాధితోపాటు మరికొంత అభివృద్ధి బాటలు వేసేందుకు వీలుంటుంది. 

 నాణ్యమైన నిల్వలు ఇక్కడే

2016–17 ప్రాంతంలో చింతలపూడి పరిధిలోని దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలోను, కృష్ణా జిల్లా ముసునూరు మండల పరిధిలో మరికొన్ని చోట్ల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు కేంద్రం గుర్తించి సర్వేకు ఆదేశించింది. రెండు ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాతోపాటు మరిన్ని సంస్థలు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నాయి. ఆ మేరకు చింతలపూడి పరిసరాల్లో గుర్తించిన ప్రాంతాల్లో రిగ్‌ వేసేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. అతి పెద్ద విచిత్రం ఏమిటంటే భూ ఉపరితలానికి 50 నుంచి 80 మీటర్ల దిగువున నాణ్యమైన నల్ల బంగారం పొరలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి బయటపడిన బొగ్గు నిక్షేపాలను నాగపూర్‌లో పరిశోధనకు పంపారు. ‘దేశంలోని మిగతా ప్రాంతాలతోపాటు ఇక్కడ బయటపడుతున్న బొగ్గు అత్యంత నాణ్యమైంది’ అని నివేదికలు వచ్చాయి. దీనికితోడు చింతలపూడి ప్రాంతం ఇప్పటికే రైల్వే లైనుకు ప్రణాళికలు ఉన్నందున బొగ్గు నిక్షేపాలు వెలికితీయడానికి మరింత సానుకూల అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. కొవ్వూరు–భద్రాచలం లైను విస్తరణకు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి ఒకింత సానుకూలత దక్కేలా ప్రయత్నించింది. దీనిని పరిగణనలోకి తీసుకుని బొగ్గు నిక్షేపాలు వెలికితీత ఒక్కటే ఆలస్యమని కేంద్ర రంగ సంస్థ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఈసీఎల్‌) భావించి బొగ్గు నిల్వలు, నాణ్యత ఏ పరిధిలో బొగ్గు విస్తరించిందనే విషయంపై పూర్తి నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ మేరకు చింతలపూడికి అత్యంత సమీపంలోని శెట్టివారిగూడెం, నామవరం, పట్టాయిగూడెం, వెంకటాద్రిగూడెం, లక్ష్మీపురంలలో భూ అంతర్భాగాన నాణ్యమైన బొగ్గు నిక్షిప్తమై ఉన్నట్టు దాదాపు తేల్చింది. కృష్ణా జిల్లా పరిధిలోని ముసునూరు మండలంలో చెక్కపల్లి, రమణక్కపేట, లోపూడి, అక్కిరెడ్డిగూడెం ప్రాంతాల్లోనూ బొగ్గు నిక్షేపాలు నాణ్యతతో కూడుకున్నవిగా పరీక్షలో ధృవపడింది. ఓ వైపు అమరావతి రాజధాని ఏర్పాటు, మరోవైపు నవ్యాంధ్రలో బొగ్గు నిక్షేపాలు బయటపడ డంతో ఇక ఈ ప్రాంతానికి తిరుగేలేదని అప్పట్లో భావించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో చొరవ తీసుకోవడంతో బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాలకు కాస్త దూరంలో ఉన్న భూముల ధరలు ఆకాశాన్నం టాయి. బొగ్గు నిక్షేపాలు వెలికితీతకు ఓపెన్‌ కాస్ట్‌ విధానం అవలంభిస్తారా ? లేదంటే అంతర్గత తవ్వకాలవైపే మొగ్గు చూపుతారా ? అనేది అప్పట్లో తేల్చుకోలేకపోయారు. అత్యంత వేగంగా జరిగిన సర్వేలో మాత్రం నాణ్యమైన బొగ్గు ఉన్నట్టు తేలడంతో ఇక వెలికితీత ఒక్కటే మిగిలిందని భావించారు. 

 గత ఏడాదిలోనే..

ఓ వైపు కరోనా విజృంభించిన వేళ గత ఏడాది జులైలో బొగ్గు తవ్వకాలకు వీలుగా వేలం ద్వారా నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేసింది. అటు కృష్ణాలోను, ఇటు పశ్చిమలోను వున్న రెండు బొగ్గు బ్లాక్‌లను వేలం వేయాలనే ప్రతిపాదన ముందు కొచ్చింది. అయితే గత ఏడాది ఈ వేలానికి అనుకూలంగా సంస్థలేవీ ముందుకు రాలేదు. దీంతో అప్పట్లో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఈ రెండు బ్లాక్‌లను వేలం వేయాలని బిడ్‌లను ఆహ్వానించింది. 

 చిగురించిన ఆశలు

దాదాపు 29 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలను వెలికి తీయవచ్చని దాదాపు ఐదేళ్ల క్రితమే ఒక నిర్ధారణకు వచ్చినా ఇప్పుడది సాక్షాత్కారమయ్యేలా కేంద్రం వేలానికి దిగింది. సరాసరిన ఈ ప్రాంతంలో లభించే బొగ్గు వివిధ అవసరాలకు దాదాపు 80 ఏళ్లపాటు సరిపోతాయని కొందరి అంచనా.అధికారిక లెక్కల ప్రకారమే మూడు వేల మెట్రిక్‌ టన్నులకు ఏ మాత్రం తగ్గకుండా నిల్వలు బయటపడతాయని ఇంకో అంచనా. ఈ పక్రియ యావత్తు ఆరంభమైతే ఇప్పటికే వెనుకబడిన ప్రాంతాలుగా వున్న ముసునూరు, చింతల పూడి పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు కాస్తం త ఉపాధి పెరిగే అవకాశం ఉంది. రవాణాతో పాటు మరిన్ని సేవలు విస్తరించనున్న నేపథ్యంలో ఇక ఈ ప్రాంతానికి తిరుగే ఉండదన్న ఆశలు చిగురించాయి.




Updated Date - 2021-12-19T06:32:21+05:30 IST