ఘనంగా పవిత్రోత్సవం

ABN , First Publish Date - 2021-08-21T05:30:00+05:30 IST

పవిత్రోత్సవాలలో భాగంగా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండో రోజు శనివారం పవిత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా పవిత్రోత్సవం
ద్వారకా తిరుమలలో ప్రత్యేక పూజలు

నేటితో ముగియనున్న సుదర్శన యాగం

చిన వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు


ద్వారకా తిరుమల, ఆగస్టు 21 : పవిత్రోత్సవాలలో భాగంగా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండో రోజు శనివారం పవిత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం, ఉపచారాలు సమర్పించి విశ్వక్షేణ, రక్షాబంధన, పంచగవ్య ఆరాధన, హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠాపన చేసి పవిత్రాలకు పంచగవ్య  ప్రోక్షణ, గంధ దూప, దీపాది ఉపచారాలు, హోమ కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం ఉత్సవ మూర్తులకు యాగశాల, ఉపచారాలు సమర్పణ, కుంభ పూజ, పవిత్ర అభిమంత్రణ, స్వామి వారికి పంచ శయనాది వాసం, మహాశాంతి హోమం నిర్వహించారు. లోక కల్యాణార్ధం నిర్వహిస్తున్న సుదర్శన యాగం ఆదివారంతో ముగియనుంది. మూడో రోజు శనివారం స్వామి వారి నిత్యార్జిత కల్యాణ మండపంలో  సుదర్శనహోమం ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రాంబాబు, వేద పండితులు మంత్రోచ్ఛరణలతో యాగం నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చి నిత్యార్జిత కల్యాణ మండపంకు తోడ్కుని వచ్చారు. సుదర్శన హోమంలో అగ్ని ఆరాధన, వాస్తు అంకురార్పణ, మంటపములకు సూలోపచర్య పూజ, సహస్ర సంఖ్యాక మూలమంత్ర, అగత్గుచంద్ర సహిత సుదర్శన హోమం జరిపారు. ఆదివారంతో యాగం ముగియనుంది. ఈవో సుబ్బారెడ్డి దంపతులు, సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు శనివారం ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-08-21T05:30:00+05:30 IST