ఉప సంగ్రామం

ABN , First Publish Date - 2021-11-02T06:11:38+05:30 IST

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి వివిధ కారణాలువల్ల ఆగిపోయిన చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల షెడ్యూలును సోమవారం విడుదల చేశారు.

ఉప సంగ్రామం

పెనుగొండ జడ్పీటీసీ, పెదమల్లం సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు 

ఆచంట, నవంబరు 1: మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి వివిధ కారణాలువల్ల ఆగిపోయిన చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల షెడ్యూలును సోమవారం విడుదల చేశారు. ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ జడ్పీటీసీ, పెదమల్లం సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పెనుగొండ జడ్పీటీసీ జనరల్‌ మహిళకు కేటాయించగా పెదమల్లం సర్పంచ్‌ జనరల్‌కు రిజర్వు అయింది. పెదమల్లం సర్పంచ్‌ ఎన్నిక ఈనెల 14న, పెనుగొండ  జడ్పీటీసీ ఎన్నిక ఈ నెల 16న జరగనుంది. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఈ నెల 3,4,5 తేదీలలో నామినేషన్‌లు స్వీకరించనున్నారు. పెదమల్లం సర్పంచ్‌ ఎన్నిక 14న జరుగుతుండగా, అదే రోజున కౌంటింగ్‌ కూడా జరగనుంది. అలాగే పెనుగొండ జడ్పీటీసీ ఎన్నిక ఈ నెల 16న జరుగుతుండగా 18న కౌంటింగ్‌ జరగనుంది.  


పోరు..హోరాహోరీ

పెనుగొండ జడ్పీటీసీ నుంచి  టీడీపీ నుంచి చలుమూరి తులసీ అన్నపూర్ణ   నామినేషన్‌ వేయగా వైసీపీ నుంచి పోడూరి గోవర్థన నామినేషన్‌ వేశారు.  టీడీపీ అభ్యర్థి అన్నపూర్ణ మృతి చెందడంతో ఎన్నిక  వాయిదా వేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఎన్నిక రసవత్తర ంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో టీడీపీ, జనసేన కూటమి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను  దక్కించుకున్నాయి. దీంతో పెనుగొండలో కూడా టీడీపీ, జనసేన మరలా కలిసి పోటీ చేస్తే ఇక్కడ కూడా సునాయాసంగా గెలుస్తామనే ధీమాతో ఇరు పార్టీల నాయకులు ఉన్నారు. అధికార పార్టీ నాయకులు కూడా బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నటు సమాచారం.  ఆచంట మండలంలోని పెదమల్లం సర్పంచ్‌ అభ్యర్థి దిరిశాల వెంకట ప్రసాద్‌ అకాల మరణంతో ఇక్కడ కూడా ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ కూడా జనసేన, టీడీపీ ఇరుపార్టీలు కలిసి సర్పంచ్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇప్ప టికే నాయకులు పావులు కదుపుతున్నారు.


Updated Date - 2021-11-02T06:11:38+05:30 IST