ఏపీలో కీచక ఖాకీలు.. పోలీసు శాఖలో కలకలం..

ABN , First Publish Date - 2021-12-28T17:48:29+05:30 IST

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు కీచకుడిగా మారిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఏపీలో కీచక ఖాకీలు.. పోలీసు శాఖలో కలకలం..

ప.గో.జిల్లా: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు కీచకుడిగా మారిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ యువతిపై ఏలూరులో సీఐ లైంగిక దాడి ఆరోపణలు పోలీస్ శాఖలో కలకలం రేపింది. పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిపై సీఐ పలుసార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడు నెలల క్రితం ఏలూరులోని ఓ హోటల్‌లో ఈ లైంగిక దాడి జరిగినట్లు సమాచారం.


గతంలో ఏలూరులోని పనిచేస్తున్న సీఐకు ఆ యువతి పరిచయం అయింది. ఆ తర్వాత తన మాయ మాటలతో సీఐ యువతిని మోసగించాడు. పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. యువతిపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీఐని వీర్‌కు పంపారు. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు బాధితురాలి ఫిర్యాదుతో రహస్యంగా విచారణ చేపట్టారు.


నెల్లూరు జిల్లా, చిట్టమూరులో దారుణం జరిగింది. మైనర్ బాలికపై హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ అత్యాచారయత్నం చేశాడు. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంటికి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయం బాలిక తన తండ్రికి చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్ కానిస్టేబుల్  సుధాకర్‌ని అదుపులోకి తీసుకుని ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు. 

Updated Date - 2021-12-28T17:48:29+05:30 IST