ఆకివీడు.. సమస్యలు బోలెడు!

ABN , First Publish Date - 2021-11-24T05:04:02+05:30 IST

ఆకివీడు పేరుకే నగర పంచాయతీ.... సమస్యలు చూస్తే మేజర్‌ పంచాయతీ కంటే అధ్వానం.

ఆకివీడు.. సమస్యలు బోలెడు!
సిద్ధాపురం వెళ్లే దారిలో కాలువ రోడ్డు పక్కన చెత్త డంపింగ్‌

కనీస మౌలిక వసతులు కరువే 

చినుకు పడితే కాలనీలు చెరువులే

 కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం 


ఆకివీడు, నవంబరు 23 : ఆకివీడు పేరుకే  నగర పంచాయతీ.... సమస్యలు చూస్తే మేజర్‌ పంచాయతీ కంటే అధ్వానం. అయినా పట్టించుకునే వారే లేరు.. కన్నెత్తి చూసిన వారు లేరు.. ప్రజలు రోగాల బారిన పడుతున్నా పారిశుధ్య మెరుగుదల కూడా చేపట్టలేని దుస్థితిలో అధికార యంత్రాంగం ఉంది. చినుకు పడుతున్నా కాలనీలు చెరువులుగా మారుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేని స్థితిలో పాలకులు ఉన్నారు.. పట్టణానికి డంపింగ్‌యార్డ్‌ లేకున్నా నేటి వరకూ  ఏ ఒక్కరూ ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించిన పాపాన పోలేదు. ఊరి మధ్యన అటు ఆసుపత్రి.. ఇటు తహసీల్దార్‌ కార్యాలయానికి మధ్యలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని డంపింగ్‌యార్డ్‌గా ఉపయోగిస్తున్నా.. సిద్ధాపురం వెళ్లే రోడ్డులో కాలువ గట్ల పక్కన చెత్త వేస్తున్నా ఇదేంటని అడిగే సాహసమూ చేయడం లేదు.. ఇక తాగునీటి చెరువులు కలుషితమైపోతున్నాయి.. డ్రెయినేజీల్లో సిల్ట్‌ తీయక చినుకు పడితే చాలు కాలనీలు కాలువలుగా మారిపోతున్నాయి... ఇక ట్రాఫిక్‌ది  అదే పరిస్థితి.. ఇలా ఆకివీడు అంతా సమస్యల మయం..సోమవారం కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో ప్రజలంతా తమ సమస్యలు పరిష్కరి స్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి పాలకులు ఏం చేస్తారో చూడాల్సిందే.. 


చెత్తకు చోటిదేనా..


ఏ పట్టణంలోనైనా పారిశుధ్యం మెరుగుపడాలంటే డంపింగ్‌యార్డు ఉండాల్సిందే..ఆకివీడు పట్టణానికి మాత్రం నేటి వరకూ డంపింగ్‌యార్డులేదు.. ఊరి మధ్యన ఉన్న ప్రభుత్వ ఖాళీస్థలాన్నే డంపింగ్‌యార్డుగా వినియోగిస్తు న్నారు. లేదంటే ఇదిగో ఇలా సిద్ధాపురం కాలువ గట్టు పక్కన పడేస్తారు. 


ఇదీ తాగునీటి చెరువా..


తాగునీటి సమస్య ఉన్న పట్టణాలు చాలా అరుదుగా ఉంటాయి.. ఆకివీడు మాత్రం దీనికి మినహాయింపు.. 365 రోజులు తాగునీటి సమస్య ఉంటుంది. దొరగారి, కొండయ్య మంచినీటి చెరువులు ఉన్నా ఒక పక్క ఆక్రమణలు.. మరో పక్క కలుషితం కావడంతో ప్రజలకు తాగునీరందించలేని దుస్థితి. 


డ్రెయినేజీలింతే..


పారిశుధ్యం అధ్వానం.. ఏ కాలనీలోనూ డ్రెయినేజీ శుభ్రంగా ఉండందంటే అతిశయోక్తి కాదు.. దాదాపు పట్టణంలో ఉన్న డ్రెయినేజీలన్నీ సిల్ట్‌తో నిండిపోయాయి. ప్రధాన రహదారుల్లోనూ డ్రెయి నేజీల్లో మురుగు రోడ్ల పైకి వచ్చేస్తుంది. పట్టణ ప్రధాన డ్రెయినేజీలైనఅందే, గంగానమ్మ, మూలలంక బోదెలు ఆక్రమణకు గురై పూడుకుపోయాయి. ఒకప్పుడు పంట బోదెలుగా ఉన్న ఈ డ్రెయినే జీలు ప్రస్తుతం మురుగు కాలువలుగా మారి పోయాయి. దీంతో చిన్నపాటి వర్షానికే రహదారులపై నీరు నిలుస్తుంది. పలు కాలనీలు భారీ వర్షాలకు ముంపుబారిన పడుతున్నాయి. 


చినుకుపడిందా.. మునిగిందే..


చినుకు పడిందంటే ఆకివీడులో కాలనీలు అన్నీ నీట మునుగుతాయి. ప్రధానంగా శాంతినగర్‌, శ్రీనగర్‌, అమృతరావు నగర్‌, సుందరయ్య నగర్‌ కాలనీలు కాలువలుగా మారిపో తాయి. కాలనీలు మునిగిపోవడంతో కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. పరిష్కారం పాలకుల చేతుల్లో ఉన్నా నేటికీ స్పందించినవారే లేరు.  మరి కొత్త పాలకవర్గమైనా ఈ సమస్యపై దృష్టి సారిస్తుందో లేదో చూడాలి. 


వెళ్లామా.. చిక్కామే


ఆకివీడు వెళ్లామంటే తిరిగిరావడం వాళ్ల చేతుల్లో ఉండదు. ఎందుకంటే అంతలా ట్రాఫిక్‌.. ఒకసారి పట్టణంలో అడుగు పెట్టామా బయటకు రావడం కష్టమే. అయినా ట్రాఫిక్‌ మళ్లింపు  చర్యలు శూన్యం.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మినీ బైపాస్‌ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం  వచ్చిన తరువాత ఆ రోడ్డును పట్టించుకోలేదు. ఆ రహదారి వినియోగంలోకి తెస్తే ట్రాఫిక్‌ను నియంత్రించవచ్చు. Updated Date - 2021-11-24T05:04:02+05:30 IST