ఆధార్‌.. అవస్థ

ABN , First Publish Date - 2021-08-22T05:04:34+05:30 IST

ఆధార్‌ అనుసంధానానికి సంబంధించిన కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

ఆధార్‌.. అవస్థ
ఆధార్‌ క్యూ : భీమవరంలో ప్రధాన పోస్టాఫీస్‌ వద్ద ఆధార్‌ సవరణలకు భారీ క్యూ

ఆధార్‌ అనుసంధానానికి కష్టాలు


వీరవాసరం/ భీమవరం, ఆగస్టు 21 : ఆధార్‌ అనుసంధానానికి సంబంధించిన కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బ్యాంకులు, పోస్టాఫీస్‌ల వద్దకు ఈకేవైసీకి కార్డుదారులు పరుగులు తీస్తున్నారు. ఐదేళ్లు దాటిన బాల, బాలికల ఈకేవైసీ నమోదుకాకపోతే సెప్టెంబర్‌ నుంచి వారి రేషన్‌ నిలుపుదల చేస్తారని ప్రకటించడంతో తల్లిదండ్రులు ఆధార్‌ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. గత పది రోజులుగా తల్లిదండ్రులు చిన్నారుల ఆధార్‌ తప్పుల సవరణకు ఆరాటపడుతూనే ఉన్నారు. గతంలో మీసేవ కేంద్రాల్లో ఆధార్‌ నమోదు సవరణలకు అవకాశం ఉండేది. అయితే గత కొంతకాలంగా మీసేవ కేంద్రాల్లో ఆధార్‌  లాగిన్‌ నిలుపుదల చేశారు. దీంతో ప్రస్తుతం ప్రత్యేకంగా ఆధార్‌ కేంద్రాల్లోనే మార్పులు, సవరణలు చేస్తున్నారు.ఈ నేప థ్యంలో ఆయా కేంద్రాల వద్ద జనం గుమిగూడి ఉంటున్నారు. శనివారం భీమవరంలోని ప్రధాన తపాల కార్యాలయం వద్ద  ఆధార్‌లో సవరణలకు జనం రద్దీ పెరిగింది.. ఉదయం నుంచే బారులు తీరారు. ప్రతీ చోటా ఇదే పరిస్థితి. వీరవాసరం మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎక్కడా ఆధార్‌ నమోదు కేంద్రం లేకపోవడంతో మండల జనాభా ప్రత్యేకంగా పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది.  పోస్టాఫీస్‌లో ఉన్నప్పటికీ ఆధార్‌కు మొబైల్‌నెంబర్‌ అనుసంధానం మాత్రమే చేస్తున్నారు. దీంతో తప్పనిసరై భీమవరం, పాలకొల్లు పట్టణాల్లోని కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. చిన్నపిల్లలతో ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు పడినప్పటికీ ఈకేవైసీ పూర్తి కావడం లేదని చెబుతున్నారు. 

Updated Date - 2021-08-22T05:04:34+05:30 IST