నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం!

ABN , First Publish Date - 2021-02-27T04:46:55+05:30 IST

దాల బారిన పడుతున్నాయి. ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్నాయి. గడ్డి తరలిస్తున్న వాహనదారులు కనీస నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు కారణం. ఇష్టారా

నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం!
ఇటీవల ఎస్‌.కోటలో దగ్ధమైన వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌




ఇష్టారాజ్యంగా వరిగడ్డి తరలింపు

నిబంధనలు పట్టని వాహనదారులు

తరచూ అగ్నిప్రమాదాలు

వాహన చోదకులకు తప్పని ఇబ్బందులు

పట్టించుకోని అధికారులు

(శృంగవరపుకోట)

- వరి గడ్డి లోడుతో ఓ వ్యాన్‌ రోడ్డుపై వెళ్తోంది. మితిమీరిన వేగంతో వెళ్తుండగా టైరు ఊడిపోయింది. ఇనుప రాడ్డు రాపిడికి గురికావడంతో నిప్పులు రేగాయి. క్షణాల్లో వరి గడ్డికి మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా కాలిపోయింది. ఏం జరిగిందో తెలియక రహదారిపై ఉన్నవారు ఆందోళనతో పరుగులుతీశారు. ఈ నెల 7న జామి మండలం అలమండ సమీపంలో జరిగింది ఈ ఘటన.

- అర్ధరాత్రి వేళ రహదారిపై వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులుతీశారు. ఎస్‌.కోట పాత పోస్టాఫీసు సమీపంలో నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఐదు రోజుల కిందట చోటుచేసుకుందీ ఘటన. పైన విద్యుత్‌ వైర్లు, చెంతనే ఇళ్లు ఉండడంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 


---ఇలా వరిగడ్డి తరలిస్తున్న వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్నాయి. గడ్డి తరలిస్తున్న వాహనదారులు కనీస నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు కారణం. ఇష్టారాజ్యంగా, పరిమితికి మించి వాహనాల్లో వరిగడ్డిని ఎక్కించి తరలిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 


జిల్లాలో పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, ఎస్‌.కోట, కురుపాం నియోజకవర్గాల్లో వరి అధికంగా పండిస్తారు. ఇక్కడ నుంచి వరిగడ్డి పట్టణాలు, నగరాలకు ఎక్కువగా తరలిస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో వాహనాల్లో ప్రధాన మార్గాల మీదుగా వరి గడ్డిని తరలించుకుపోతున్నారు, పశుగ్రాసానికి కొరత ఉన్న నేపథ్యంలో వరిగడ్డికి గిరాకీ.  పట్టణ ప్రాంతాల్లో ఇటీవల డెయిరీలు జోరుగా వెలుస్తుండడంతో నిర్వాహకులు మైదాన ప్రాంతాలకు వచ్చి గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా పశువులతో నూర్పులు చేసిన తరువాత మంచి వరిగడ్డి లభ్యత ఉండేది. ఏడాది పొడవునా పశుగ్రాసంగా రైతులు వినియోగించేవారు. యాంత్రీకరణ పుణ్యమా అని పశువులు తగ్గుముఖం పట్టాయి. యంత్రాలతో నూర్పులు చేస్తుండడంతో వరిగడ్డి నాణ్యత తగ్గింది. దీంతో గడ్డిని పొలాల్లోనే రైతులు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం గిరాకీ ఉండడంతో గడ్డిని సేకరించి డెయిరీ నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. 


ఇదో వ్యాపారంగా..

గడ్డి తరలింపును కొందరు వ్యాపారంగా మలచుకున్నారు. మెట్ట ప్రాంతాల్లో వరి పండకపోవడంతో అక్కడి పాడి రైతులు, డెయిరీ నిర్వాహకులు మైదాన ప్రాంతాల నుంచి గడ్డిని తెప్పించుకుంటున్నారు. దీంతో గడ్డి వ్యాపారం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఒక ట్రాక్టరు లోడు వేలల్లో పలుకుతుండడంతో వాహనదారులకు ఇదో లాభసాటి వ్యాపారంగా మారింది. దూరాన్ని బట్టి రేటు కట్టి గడ్డిని సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కానీ తరలింపులో కనీస నిబంధనలు పాటించడం లేదు. అధికారులు కూడా రైతుల కోణంలో చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కంటైనర్లలో గడ్డిని తరలించాలి. లారీలు, ట్రాక్టర్లలో తరలించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సామర్థ్యాన్ని అనుసరించి లోడు చేయాలి. గడ్డిని భారీ తాళ్లతో కట్టాలి. ట్రాఫిక్‌ లేని సమయంలో తరలించాలి. పట్టణ రహదారులపై కాకుండా..ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించాలి. కానీ జిల్లాలో ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. ఇష్టారాజ్యంగా తరలిస్తుండడంతో రహదారులపై వాహన చోదకులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. వేలాడుతున్న విద్యుత్‌లైన్లు పుణ్యమా అని చిన్నపాటి రాపిడికే నిప్పులు ఎగసిపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇకనైనా అధికారులు మేల్కొనకపోతే ప్రమాదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 




Updated Date - 2021-02-27T04:46:55+05:30 IST