మర్మమేమిటో?

ABN , First Publish Date - 2021-06-22T05:35:27+05:30 IST

తాటిపూడివలస కొండపై మాంగనీసు తవ్వకాలు జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. రెండు నెలల కిందట వెలుగుచూసిన ఓ ఘటన మరుగునపడిపోగా..సోమవారం గిరిజనుల ఆందోళనతో మరోసారి తెరపైకి వచ్చింది. ఇది చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మర్మమేమిటో?
ఎక్సకవేటర్‌ ఇచ్చేయాలంటూ గిరిజనులు ఆంధోళన

మాంగనీసు తవ్వకాల వివాదంలో కొత్తరాగం

గిరిజనుల నిరసన చర్చనీయాంశం

(మెంటాడ)

తాటిపూడివలస కొండపై మాంగనీసు తవ్వకాలు జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. రెండు నెలల కిందట వెలుగుచూసిన ఓ ఘటన మరుగునపడిపోగా..సోమవారం గిరిజనుల ఆందోళనతో మరోసారి తెరపైకి వచ్చింది. ఇది చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొండలింగాలవలస పంచాయతీ తాటిపూడివలసలో సుమారు 500 ఎకరాల్లో కొండ విస్తరించి ఉంది. కొండలో అత్యంత విలువైన మాంగనీసు నిల్వలు ఉన్నాయి. రెండు నెలల కిందట కొండ సమీపంలో ఎక్సకవేటర్‌తో పాటు యంత్రాలను స్థానికులు గుర్తించి భూగర్భ, గనుల శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. సచివాలయ సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించగా కొండ వద్ద తవ్వకాలు బయటపడ్డాయి. అక్కడే ఉన్న ఎక్సకవేటర్‌ను గుర్తించిన సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చేలోపే ఎక్సకవేటర్‌తో పాటు ఆపరేటర్‌ అక్కడ నుంచి పరారయ్యారు. దీనిని సీరియస్‌గా పరిగణించిన అధికారులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా కొన్ని రోజుల కిందట ఎక్సకవేటర్‌ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీన్‌ కట్‌చేస్తే పోడు వ్యవసాయం కోసం జేసీబీని తీసుకొచ్చామని.. అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కొంతమంది గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇన్ని రోజులు కనిపించని వారు ఉన్నపళంగా నిరసన చేపట్టడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలను నిగ్గు తేల్చాలని స్థానిక సీపీఎం నాయకుడు రాకోటి రాములు డిమాండ్‌ చేశారు. దీనిపై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించనున్నట్టు చెప్పారు. 

ఎవరున్నారో నిగ్గుతేలుస్తాం

తాటిపూడివలస గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై మైనింగ్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో మైనింగ్‌ అధికారులు దాడులు చేశారు. అక్రమ తవ్వకాలు నిర్వహించిన వారిపై కేసు నమోదు చేశాం. ఎక్సకవేటర్‌, ఆపరేటర్‌ పరారీ అయ్యారు. మైనింగ్‌ తవ్వకాలు వెనుక ఎవరున్నారో నిగ్గుతేలుస్తాం.

- విజయలక్ష్మీ, ఏడీ మైన్స్‌ 


ఎక్సకవేటర్‌ను స్వాధీనం చేసుకున్నాం

మైనింగ్‌ అధికారుల ఫిర్యాదు మేరకు తాటిపూడివలస గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై మైనింగ్‌ తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసి ఇటీవల ఎక్సకవేటర్‌  స్వాధీనం చేసుకున్నాం. అది మా ఆధీనంలోనే ఉంది. తవ్వకాలు జరిగి సుమారు నెల రోజులైంది. 

- షేకశంకర్‌, ఆండ్ర ఎస్‌ఐUpdated Date - 2021-06-22T05:35:27+05:30 IST